
దుబాయ్: ఆరు దేశాల కబడ్డీ మాస్టర్స్ టోర్నీలో భారత జట్టు సెమీఫైనల్లోకి ప్రవేశించింది. సోమవారం గ్రూప్ ‘ఎ’ లీగ్ మ్యాచ్‌లో భారత్ 41–17 స్కోరుతో పాకిస్తాన్‌ను చిత్తుగా ఓడించింది. శుక్రవారం టోర్నీ తొలి మ్యాచ్‌లోనే పాక్‌ను 36–20తో ఓడించిన భారత్ మరోసారి పైచేయి సాధించడం విశేషం. ఆరంభంలోనే రోహిత్ సూపర్ రైడ్ సాధించడంతో భారత్ 6–1తో ముందంజలో నిలిచింది.
ఆ తర్వాత తన ఆధిక్యం నిలబెట్టుకుంటూ భారత్ తొలి అర్ధభాగం ముగిసే సరికి 18–9తో పట్టు సాధించింది. రెండో అర్ధభాగంలో బరిలోకి దిగిన మోను గోయట్ ఏకంగా 7 పాయింట్లతో అదరగొట్టడంతో మన జట్టుకు తిరుగు లేకుండా పోయింది. భారత్‌తో పాటు ఇరాన్ కూడా సెమీస్ స్థానాన్ని ఖాయం చేసుకుంది. గ్రూప్ ‘బి’లో జరిగిన మ్యాచ్‌లో ఇరాన్ 31–27తో కొరియాను ఓడించింది.