హిట్‌మ్యాన్‌ మరో వరల్డ్‌ రికార్డు | Ind vs WI: Rohit Sharma Gets Another World Record | Sakshi
Sakshi News home page

హిట్‌మ్యాన్‌ మరో వరల్డ్‌ రికార్డు

Dec 22 2019 7:20 PM | Updated on Dec 22 2019 7:25 PM

Ind vs WI: Rohit Sharma Gets Another World Record - Sakshi

కటక్‌: ఇప్పటికే పలు వరల్డ్‌ రికార్డులను సాధించిన టీమిండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మ.. తాజాగా మరో ప్రపంచ రికార్డును నెలకొల్పాడు.  ఓపెనర్‌గా ఒక క్యాలెండర్‌ ఇయర్‌లో అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు సాధించిన రికార్డును రోహిత్‌ సాధించాడు. ఈ క్రమంలోనే 22 ఏళ్ల పాటు పదిలంగా ఉన్న శ్రీలంక మాజీ ఓపెనర్‌ సనత్‌ జయసూర్య రికార్డును బ్రేక్‌ చేశాడు. వెస్టిండీస్‌తో జరుగుతున్న చివరిదైన సిరీస్‌ నిర్ణయాత్మక మ్యాచ్‌లో రోహిత్‌ ఈ ఘనత సాధించాడు.

విండీస్‌ నిర్దేశించిన 316 పరుగుల లక్ష్య ఛేదనలో భాగంగా రోహిత్‌ 9 పరుగుల వద్ద  ఉండగా ఈ ఫీట్‌ను సాధించాడు. 1997లో సనత్‌ జయసూర్య అన్ని ఫార్మాట్లలో కలిపి ఆ క్యాలెండర్‌ ఇయర్‌లో 2,387 పరుగులు సాధించాడు. దాంతో ఓపెనర్‌గా అత్యధిక పరుగులు సాధించిన రికార్డును జయసూర్య సాధించాడు. దాన్ని తాజాగా రోహిత్‌ బ్రేక్‌ చేసి సరికొత్త వరల్డ్‌ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఈ ఏడాది వన్డే ఫార్మాట్‌లో కూడా రోహిత్‌ శర్మనే టాప్‌లో కొనసాగుతుండటం విశేషం.  విండీస్‌తో మ్యాచ్‌లో రోహిత్‌ శర్మ హాఫ్‌ సెంచరీ సాధించాడు. 52 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌తో అర్థ శతకం నమోదు చేశాడు. 

కాగా, ఈ ఏడాది అన్ని ఫార్మాట్లలో కలిపి టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి 2,370 పరుగులతో ఉన్నాడు. 2016 నుంచి చూస్తే వరుసగా మూడేళ్లు అంతర్జాతీయ క్రికెట్‌లో పరుగుల పరంగా టాప్‌తోనే ముగించాడు కోహ్లి. 2016లో 2,595 పరుగులతో కోహ్లి టాప్‌ను సాధించగా, 2017లో 2,818 పరుగులతో అగ్రస్థానాన్ని సాధించాడు. 2018లో 2,735 పరుగులతో టాప్‌ను దక్కించుకున్నాడు. తద్వారా ‘హ్యాట్రిక్‌’ను సాధించాడు కోహ్లి. ఫలితంగా వరుసగా మూడు సంవత్సరాల పాటు టాప్‌లో నిలిచిన ఏకైక ఆటగాడిగా కోహ్లి నిలిచాడు.  విండీస్‌తో మ్యాచ్‌లో రోహిత్‌తో పాటు కేఎల్‌ రాహుల్‌ కూడా అర్థ శతకం సాధించాడు. భారత్‌ 19 ఓవర్లలో వికెట్‌ కోల్పోకుండా 109 పరుగులు చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement