ధోని లేని క్రికెట్‌ను ఊహించుకోండి..!

Imagine There Is No MS Dhoni, ICC - Sakshi

దుబాయ్‌: టీమిండియా వికెట్‌ కీపర్‌ ఎంఎస్‌ ధోని వికెట్ల వెనకాల ఉంటే క్రీజ్‌ను దాటే సాహసం చేయొద్దని ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసీసీ) హెచ్చరించిన సంగతి తెలిసిందే. న్యూజిలాండ్‌ పర్యటనలో భాగంగా భారత్‌తో జరిగిన చివరి వన్డే తర్వాత ఐసీసీ తన ట్విటర్‌ అకౌంట్‌లో ఈ మేరకు పోస్ట్‌ చేసింది. ఇందుకు కారణం సమయస్ఫూర్తితో ధోని చేసిన రనౌటే కారణం. ఆ మ్యాచ్‌లో కేదార్‌ జాదవ్‌ వేసిన 37వ ఓవర్‌లో బంతి నీషమ్‌ ప్యాడ్స్‌ తగలగా.. భారత ఆటగాళ్లంతా ఎల్బీడబ్ల్యూ కోసం అప్పీల్‌ చేశారు. అందరూ అంపైర్‌ నిర్ణయం కోసం ఎదురు చూస్తూ బిజీగా ఉండగా.. బంతిని అందుకున్న ధోని అప్పీల్‌ చేస్తూనే నీషమ్‌ను రనౌట్‌ చేశాడు. ఆటగాళ్ల అప్పీల్‌తో క్రీజ్‌ను వదిలి ధోనిని మరిచిన జేమ్స్‌ నీషమ్‌.. భారీ మూల్యం చెల్లించుకున్నాడు.

ఇదిలా ఉంచితే, ధోనిపై ఐసీసీ మరో ట్వీట్‌ చేసింది. కివీస్‌తో చివరిదైన మూడో టీ20 ధోనికి 300వ టీ20 మ్యాచ్‌. దీన్ని పురస్కరించుకుని ఐసీసీ లిరిక్స్‌ రూపంలో ట్వీట్లు చేసింది.  ఇంగ్లిష్‌ సింగర్‌, రైటర్‌ జాన్‌ లెనన్స్‌ క్లాసిస్‌ ‘ఇమాజిన్‌’ను ఆధారంగా చేసుకుని కొన్ని ట్వీట్లు చేసింది. ‘అంపైర్ లేని క్రికెట్‌ను ఊహించండి.. అన్ని మ్యాచ్‌లు ఏడాదంతా ఆడితే ఎలా ఉంటుందో ఊహించండి. ధోని లేని క్రికెట్ ఎలా ఉంటుందో ఊహించండి.. ఆ ఊహే చాలా కష్టంగా ఉంటుంది. మిమ్మల్ని స్టంప్ లేదా క్యాచ్ ఔట్ చేయడానికి ఎవరూ ఉండరు’ అంటూ ఐసీసీ లిరిక్స్‌ రూపంలో ట్వీట్లు పోస్టు చేసింది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top