
కోహ్లిని స్లెడ్జ్ చేయొద్దు..కానీ!
ఆస్ట్రేలియాతో సిరీస్ అంటేనే ప్రత్యర్థి జట్టుకు గుర్తొచ్చేది స్లెడ్జింగ్. క్రికెటర్లను స్లెడ్జింగ్ చేయడంలో ఆసీస్ కు ఆ జట్టే సాటి.
సిడ్నీ:ఆస్ట్రేలియాతో సిరీస్ అంటేనే ప్రత్యర్థి జట్టుకు గుర్తొచ్చేది స్లెడ్జింగ్. క్రికెటర్లను స్లెడ్జింగ్ చేయడంలో ఆసీస్ కు ఆ జట్టే సాటి. అయితే విరాట్ కోహ్లి నేతృత్వంలోని భారత జట్టుతో పరిమిత ఓవర్ల సిరీస్ ను ఆడేందుకు వచ్చిన ఆసీస్ ను ఆ జట్టు మాజీ పేసర్ జాసన్ గిలెస్పీ ముందుగా హెచ్చరించారు. ప్రపంచ క్రికెట్ లో పరుగుల మెషీన్ గా దూసుకుపోతున్న విరాట్ కోహ్లితో జాగ్రత్తగా ఉండాలంటూ ఆసీస్ ను మేలుకొల్పే యత్నం చేశారు. మ్యాచ్ లో కోహ్లిపై స్లెడ్జింగ్ కు దిగితే అతను బౌలర్లపై దూకుడు పెంచుతాడని, అలా కాకుండా వరుసగా బౌన్సర్లు విసిరి అతను క్రీజ్ లో క్రీజ్ లో వెనక్కి తగ్గేలా చేయాలని గిలెస్పీ సూచించాడు.
'కోహ్లి అసాధారణ ఆటగాడు. పవర్ ప్లేలో పరుగులు రాబట్టడంలో కోహ్లిది ప్రత్యేక స్థానం. ఎట్టిపరిస్థితుల్లోనూ కోహ్లితో స్లెడ్జ్ చేయొద్దు. కోహ్లితో ఆసీస్ ఆటగాళ్లు మాటల యుద్ధానికి తిగుతారని అనుకోవడం లేదు. అతనితో వాగ్వాదానికి దిగకుండా బౌలింగ్ తోనే అతన్ని కవ్వించే యత్నించండి. బౌన్సర్లతో కోహ్లిని రెచ్చగొట్టండి. ఆ క్రమంలోనే పరుగులు రాబట్టకుండా చూసుకోండి. పరుగులు సాధించే క్రమంలో కోహ్లి తప్పు చేయొచ్చు. బౌన్సర్లతో పాటు వికెట్లను లక్ష్యంగా చేసుకుని బౌలింగ్ వేయండి. కోహ్లి త్వరగా అవుటైతే.. భారత జట్టుపై ఒత్తిడి పెరుగుతుంది'అని గిలెస్పీ అభిప్రాయపడ్డారు.