'నన్ను టీమిండియా నిరాశపరిచింది'

Former Proteas pacer Shaun Pollock says disappointed by visiting teams approach in Tests - Sakshi

పోర్ట్‌ ఎలిజబెత్‌:సఫారీ గడ్డపై తొలిసారి వన్డే సిరీస్‌ గెలిచి సంబరాల్లో మునిగితేలుతున్న టీమిండియాపై దక్షిణాఫ్రికా బౌలింగ్‌ గ్రేట్‌ షాన్‌ పొలాక్‌ అసహనం వ్యక్తం చేశాడు. వన్డే సిరీస్ గెలిచామన్న ఆనందం టీమిండియాలో ఉంటే ఉండొచ్చుకానీ, టెస్టు సిరీస్ విజయానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తే బాగుంటుందనేది ఈ సందర్భంగా పొలాక్‌ పేర్కొన్నాడు. తమతో టెస్టు సిరీస్‌కు పర్యాటక జట్టైన టీమిండియా సరైన ప్రాధాన్యాలు లేకుండా బరిలోకి దిగడం తనను తీవ్రంగా నిరాశ పరిచిందన్నాడు.'టీమిండియా బ్యాటింగ్ చూస్తే నాకు ఆశ్చర్యం వేసింది. భారత్‌ బ్యాటింగ్‌ లైనప్‌ చూస్తే దక్షిణాఫ్రికాకు కష్టమే అనుకున్నా. అయితే సీన్ రివర్స్ అయింది. టెస్టుల్లో భారత్‌ నిరాశ పరిచింది’ అని పొలాక్ అన్నాడు.

టెస్టు సిరీస్‌కు ముందు ప్రాక్టీస్ కోసం మరింత సమయాన్ని టీమిండియా కేటాయిస్తే బాగుండేదన్నాడు. ఇంగ్లండ్ టూర్‌కు వెళ్లే ముందు పలువురు ఆటగాళ్లు అక్కడ కౌంటీ గేమ్స్ ఆడుతుంటారని, అప్పుడు అక్కడి పరిస్థితులకు తగినట్టుగా అలవాటుపడిపోవచ్చని అన్నాడు. కాగా, కెప్టెన్‌గా టీమ్‌లో ఆత్మవిశ్వాసం నింపేందుకు కోహ్లీ ప్రయత్నిస్తున్నాడని పొలాక్ అన్నాడు. కోహ్లీకి జట్టులోని సభ్యుల సహకారం వల్లే వన్డే సిరీస్‌ను టీమిండియా నెగ్గిందన్నాడు. ప్రత్యర్థిని ఎలా గౌరవించాలో మాల్కం మార్షల్ తనకు నేర్పాడని, దాంతో పాటే ఆత్మ విశ్వాసమూ ఎంత ముఖ్యమో బోధించాడని పొలాక్ అన్నాడు. టీమ్‌లో ఆత్మవిశ్వాసాన్ని ఎల్లవేళలా ఉంచేందుకే కోహ్లి దూకుడుగా ఉంటాడని పొలాక్‌ విశ్లేషించాడు.
 

Back to Top