అరంగేట్రంలోనే అదరగొట్టాడు..

Foakes become Most runs by an England Keeper on Test debut - Sakshi

గాలె: శ్రీలంకతో ఇక్కడ జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లండ్‌ తరపున అరంగేట్రం చేసిన బెన్‌ ఫోక్స్‌ అదుర్స్‌ అనిపించాడు. ఈ మ్యాచ్‌ రెండు ఇన్నింగ్స్‌ల్లో మొత్తంగా 144 పరుగులు చేసిన ఫోక్స్‌.. అరంగేట్రం మ్యాచ్‌లోనే అత్యధిక పరుగులు సాధించిన రెండో ఇంగ్లండ్‌ వికెట్‌ కీపర్‌గా నిలిచాడు.  తొలి ఇన్నింగ్స్‌లో 107 పరుగులు చేసిన ఫోక్స్‌.. రెండో ఇన్నింగ్స్‌లో 37 పరుగులు చేశాడు. దాంతో ఇంగ్లండ్‌ తరపున తొలి టెస్టు మ్యాచ్‌లోనే అత్యధిక పరుగులు సాధించిన జాబితాలో చోటు దక్కించుకున్నాడు. ఈ జాబితాలో మ్యాట్‌ ప్రయర్‌(147) అగ్రస్థానంలో ఉన్నాడు.

మరొకవైపు కీటన్‌ జెన్నింగ్స్‌(146 నాటౌట్‌) భారీ సెంచరీ సాధించాడు.  ఓపెనర్‌ జెన్నింగ్స్‌ 280 బంతులు ఎదుర్కొని శతకాన్ని నమోదు చేశాడు. అతనికి సాయంగా బెన్‌ స్టోక్స్‌(62) కూడా రాణించడంతో ఇంగ్లండ్‌ తన రెండో ఇన్నింగ్స్‌ను 322/6 వద్ద డిక్లేర్‌ చేసింది. ఫలితంగా శ్రీలంకకు 462 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. కాగా, శ్రీలంకలో అత్యధిక పరుగులు చేసిన రికార్డును ఇంగ్లండ్‌ సవరించింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి చేసిన పరుగులు 664. అంతకుముందు 1993లో కొలంబోలో జరిగిన టెస్టులో ఇంగ్లండ్‌ చేసిన 608 పరుగులే ఆ జట్టుకు ఇప్పటివరకూ లంకలో అత్యధికం. ఇప్పుడు ఆ రికార్డును ఇంగ్లిష్‌ టీమ్‌ బ్రేక్‌ చేసింది. ఇక తన కెరీర్‌లో చివరి మ్యాచ్‌ ఆడుతున్న లంక స్పిన్నర్‌ రంగనా హెరాత్‌ మూడు వికెట్లు సాధించాడు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక తన రెండో ఇన్నింగ్స్‌లో వికెట్‌ నష్టపోకుండా 15 పరుగులు చేసింది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top