మ్యాచ్‌ మన చేతుల్లోకి... 

 England v India: Hardik Pandya stars as tourists take control - Sakshi

తొలి ఇన్నింగ్స్‌లో  ఇంగ్లండ్‌ 161 ఆలౌట్‌

5 వికెట్లతో చెలరేగిన పాండ్యా 

భారత్‌కు 168 పరుగుల ఆధిక్యం

రెండో ఇన్నింగ్స్‌లో ప్రస్తుతం 124/2  

ట్రెంట్‌బ్రిడ్జ్‌లో అందివచ్చిన అవకాశాన్ని భారత్‌ అద్భుతంగా ఒడిసి పట్టుకుంది. ముందుగా హార్దిక్‌ పాండ్యా అద్భుత  బౌలింగ్‌తో ప్రత్యర్థిని స్వల్ప స్కోరుకే కుప్పకూల్చి 168 పరుగుల భారీ ఆధిక్యం అందుకున్న టీమిండియా... ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లోనూ దూకుడుగా ఆడి ఓవరాల్‌ ఆధిక్యాన్ని 292 పరుగులకు పెంచుకుంది. ఫలితంగా రెండో రోజే టీమిండియా మ్యాచ్‌ను తమ చేతుల్లోకి తెచ్చేసుకోగా... పేలవ బ్యాటింగ్‌తో ఇంగ్లండ్‌ పరాజయానికి బాటలు పరచుకుంది.   

నాటింగ్‌హామ్‌: ఇంగ్లండ్‌తో జరుగుతోన్న మూడో టెస్టుపై భారత్‌ పట్టు బిగించింది. రెండో రోజు ఆదివారం ఆట ముగిసే సమయానికి భారత్‌ తమ రెండో ఇన్నింగ్స్‌లో 31 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది. శిఖర్‌ ధావన్‌ (44, 6 ఫోర్లు), కేఎల్‌ రాహుల్‌ (36, 7 ఫోర్లు) వేగంగా ఆడి వెనుదిరగ్గా... ప్రస్తుతం పుజారా (33 బ్యాటింగ్‌), కోహ్లి (8 బ్యాటింగ్‌) క్రీజ్‌లో ఉన్నారు. అంతకుముందు ఇంగ్లండ్‌ తమ తొలి ఇన్నింగ్స్‌లో 38.2 ఓవర్లలో 161 పరుగులకే కుప్పకూలింది. బట్లర్‌ (39; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్‌స్కోరర్‌గా నిలిచాడు. ఒక దశలో 54/0తో ఉన్న ఇంగ్లండ్‌ ఒక్క సెషన్‌లోనే 115 పరుగులు చేసి 10 వికెట్లు కోల్పోవడం విశేషం. హార్దిక్‌ పాండ్యా (5/28) కేవలం 29 బంతుల వ్యవధిలో 5 వికెట్లు తీసి సంచలన ప్రదర్శన నమోదు చేశాడు.  

7.5 ఓవర్లలో... 
వర్షం కారణంగా రెండో రోజు ఆట అర గంట ఆలస్యంగా మొదలైంది. ఓవర్‌నైట్‌ స్కోరు 307/6తో ఆట కొనసాగించిన భారత్‌  47 బంతుల్లో మరో 22 పరుగులు జోడించి ఆలౌటైంది. రిషభ్‌ పంత్‌ (24)ను ముందుగా ఔట్‌ చేసిన బ్రాడ్‌... తన తర్వాతి ఓవర్లో అశ్విన్‌ (14)ను కూడా అదే తరహాలో క్లీన్‌బౌల్డ్‌ చేశాడు. మరుసటి ఓవర్లో అండర్సన్‌... షమీ (3), బుమ్రా (0)లను వరుస బంతుల్లో పెవిలియన్‌ పంపించి టీమిండియా ఇన్నింగ్స్‌కు తెర దించాడు.  

టపటపా... 
ఇంగ్లండ్‌ తమ తొలి ఇన్నింగ్స్‌ను దూకుడుగా ప్రారంభించింది. కుక్‌ (29), జెన్నింగ్స్‌ (20) తొలి వికెట్‌కు 12 ఓవర్లలోనే 54 పరుగులు జోడించారు. అయితే లంచ్‌ విరామం తర్వాత ఆట భారత్‌ వైపు తిరిగింది. ఓపెనర్లు ఇద్దరూ వరుస బంతుల్లో వెనుదిరిగారు. కుక్‌ను ఇషాంత్‌ ఔట్‌ చేయగా, తర్వాతి ఓవర్‌ తొలి బంతికే జెన్నింగ్స్‌ను బుమ్రా పెవిలియన్‌ పంపించాడు. కొద్ది సేపటికే పోప్‌ (10) కూడా వెనుదిరిగాడు. ఈ మూడు క్యాచ్‌లను పంత్‌ పట్టడం విశేషం. జట్టును ఆదుకోవాల్సిన బాధ్యత తీసుకున్న రూట్‌ (16) కూడా వివాదాస్పద రీతిలో ఔట్‌ కావాల్సి వచ్చింది. పాండ్యా బౌలింగ్‌లో రూట్‌ స్లిప్‌లోకి ఆడగా బంతి నేలను తాకే క్షణాన రాహుల్‌ అందుకున్నాడు. అంపైర్‌ ఔట్‌గా ప్రకటించినా... రూట్‌ వెనుదిరిగేందుకు నిరాకరించాడు. దాంతో థర్డ్‌ అంపైర్‌ పదే పదే రీప్లేలు చూసిన అనంతరం రూట్‌ను ఔట్‌గా ఖరారు చేశాడు. ఆ తర్వాత ఏ దశలోనూ కోలుకోలేకపోయిన ఇంగ్లండ్‌ వరుసగా వికెట్లు కోల్పోయింది. ఆఖర్లో బట్లర్‌ కొంత దూకుడుగా ఆడి ఇంగ్లండ్‌ను ఫాలోఆన్‌ నుంచి తప్పించాడు. షమీ ఓవర్లో అతను వరుసగా 4, 6, 4 సహా మొత్తం 16 పరుగులు రాబట్టాడు. తొలి టెస్టు ఆడుతున్న రిషభ్‌ పంత్‌ ఐదు క్యాచ్‌లు అందుకోవడం విశేషం.  

పాండ్యా ‘పాంచ్‌’ పటాకా... 
‘ హార్దిక్‌ పాండ్యా బౌలింగ్‌లో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను ఒత్తిడిలో పడేసే వాడి వేడి కనిపించవు. నిలకడ, బంతిపై నియంత్రణ కూడా లేవు. క్లిష్ట సమయాల్లో వికెట్‌ తీసే విషయంలో కెప్టెన్‌ అతడిపై నమ్మకం ఉంచడం కష్టం’... విండీస్‌ దిగ్గజం బౌలర్‌ మైకేల్‌ హోల్డింగ్‌ ఈ వ్యాఖ్య చేసి మూడు రోజులు కూడా కాలేదు. ఇంతలోనే పాండ్యా ఒక్కసారిగా బంతితో హీరోగా మారిపోయాడు. తన సహచర సీనియర్‌ పేసర్లకు సాధ్యం కాని విధంగా, అటు వైపు అండర్సన్‌ కూడా ఆశ్చర్యపోయేలా బంతిని స్వింగ్‌ చేసి పడేశాడు. ఆఫ్‌ స్టంప్‌ లైన్‌ ఏమాత్రం తప్పకుండా కట్టుదిట్టమైన బంతులతో అతను ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను కట్టి పడేశాడు. ఆడక తప్పని పరిస్థితి కల్పించి వికెట్లు పడగొట్టాడు. కెరీర్‌లో గత 15 ఇన్నింగ్స్‌లలో ఒకే సారి ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు తీయగలిగిన పాండ్యా ఇప్పుడు మొదటిసారి ఐదు వికెట్లతో సత్తా చాటాడు. తాను వేసిన 6 ఓవర్ల స్పెల్‌లో 28 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లతో మ్యాచ్‌ను భారత్‌ వైపు తిప్పేశాడు. తొలి బంతికే రూట్‌ను ఔట్‌ చేయడంతో ఇంగ్లండ్‌ పతనం ప్రారంభమైంది. ఆ తర్వాత ఒకే ఓవర్లో బెయిర్‌స్టో (15), వోక్స్‌ (8)లను అతను పెవిలియన్‌ పంపించాడు. తన తర్వాతి ఓవర్లోనే రషీద్‌ (5)తో పాటు బ్రాడ్‌ (0)ను వికెట్ల ముందు దొరికించుకొని ‘పాంచ్‌’ పూర్తి చేశాడు. అతని వికెట్లలో రెండు కీపర్‌ క్యాచ్‌లు, రెండు స్లిప్‌లు, ఒక ఎల్బీ కావడం చూస్తే ఆ బౌలింగ్‌ ఎంత పదునుగా ఉందో అర్థమవుతుంది.   

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top