ఇద్దరు భారత అథ్లెట్ల బహిష్కరణ | Sakshi
Sakshi News home page

Published Fri, Apr 13 2018 10:09 AM

Commonwealth Games, Two Indian Athletes Suspended - Sakshi

గోల్డ్‌కోస్ట్‌ : ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్‌లో జరుగుతున్న ‘కామన్‌వెల్త్‌ గేమ్స్‌-2018’ లో ముందునుంచి పకడ్బందీగా అమలవుతున్న ‘నో నీడిల్‌ పాలసీ’ (సిరంజీల వాడకం నిషేదం)ని ఉల్లంఘించారనే కారణంగా ఇద్దరు భారత అథ్లెట్లు బహిష్కరణకు గురయ్యారు. ఏవీ రాకేష్‌ బాబు, ఇర్ఫాన్‌ కొలొత్తమ్‌ థోడిల పైన కామన్‌వెల్త్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ (సీజీఎఫ్‌) నిషేదం విధించింది. ఈ ఇద్దరూ క్రీడా గ్రామం విడిచి వెళ్లాలని నోటీసులు జారీ చేసింది. అంతేకాకుండా భారత బృందానికి నేతృత్వం వహిస్తున్న విక్రం సిసోడియా, జట్టు మేనేజర్‌ నామ్‌దేవ్‌ శిర్గావంకర్‌, అథ్లెటిక్స్‌ మేనేజర్‌ రవీందర్‌ చౌదరీలపై కూడా సీజీఎఫ్‌ మండిపడింది. ఇలాంటి చర్యలను ప్రోత్సహిస్తే శిక్ష తప్పదని సీజీఎఫ్‌ ప్రెసిడెంట్‌ లూయిస్‌ మార్టిన్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

క్రీడా గ్రామంలో సిరంజీలు వాడొద్దనే నింబధనల్ని బహిష్కరణకు గురైన భారత అథ్లెట్లు ఉల్లంఘించారని సీజీఎఫ్‌ తెలిపింది. దీనిని తాము యాంటీ డోపింగ్ నిబంధనల ఉల్లంఘనగా చూడలేదని, అయితే నీడిల్ ఉపయోగించకూడదన్న గేమ్స్ నిబంధనలను మాత్రం వీరు ఉల్లంఘించారని సీజీఎఫ్‌ తెలిపింది. ఒకవేళ డయాబెటిస్‌లాంటి వాటికోసం నీడిల్స్ ఉపయోగించాలనుకుంటే.. ముందుగానే అనుమతి తీసుకోవాలని సూచించింది. భారత ఆటగాళ్ల గదుల వద్ద వాడి పడేసిన సిరంజీలు బయటపడినపుడు తొలుత పెద్దగా పట్టించుకోని సీజీఎఫ్‌ కోర్టు.. ఈ విషయంపై పునర్విచారణచేపట్టి చర్యలు తీసుకుంది. కామన్‌వెల్త్‌ గేమ్స్‌ నుంచి బహిష్కరణకు గురైన రాకేష్‌ బాబు ట్రిపుల్‌ జంప్‌లో, ఇర్ఫాన్‌ రేస్‌ వాక్‌లో పాల్గొనాల్సి ఉంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement