
సంతోషంతో వెళ్లాలి... విజయంతో కాదు: గేల్
వెస్టిండీస్‌తో రెండు టెస్టులు గెలిచి మాస్టర్ బ్లాస్టర్ సచిన్‌కు ఘనమైన వీడ్కోలు ఇవ్వాలని టీమిండియాతో పాటు యావత్ భారతదేశం భావిస్తుంటే...
కోల్‌కతా: వెస్టిండీస్‌తో రెండు టెస్టులు గెలిచి మాస్టర్ బ్లాస్టర్ సచిన్‌కు ఘనమైన వీడ్కోలు ఇవ్వాలని టీమిండియాతో పాటు యావత్ భారతదేశం భావిస్తుంటే... కరీబియన్ జట్టు దాన్ని అడ్డుకోవడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. మాస్టర్ సంతోషంగా రిటైర్‌కావాలిగానీ, విజయంతో కాదని డాషింగ్ బ్యాట్స్‌మన్ క్రిస్‌గేల్ అన్నాడు. ‘సచిన్ 200వ టెస్టు ముంబైలో ఆడనుండటం అద్భుతం.
అక్కడి వాతావరణం, అభిమానుల ఉత్సాహం అమోఘంగా ఉంటుంది. భారత అభిమానులు క్రికెట్‌తోపాటు సచిన్‌కూ చాలా మద్దతిస్తారు. ఇప్పుడు ఈ అభిమానం రెట్టింపుకానుంది. విండీస్ కూడా సిరీస్‌పై దృష్టిపెట్టింది కాబట్టి మాస్టర్ వీడ్కోలును కాస్త పాడు చేసే అవకాశం ఉంది’ అని గేల్ వెల్లడించాడు. టెస్టుల్లో విండీస్ ప్రదర్శన ఏమిటో భారత్‌తో సిరీస్‌లో భయటపడుతుందన్నాడు. ఐసీసీ ర్యాంకింగ్స్‌ను మెరుగుపర్చుకునేందుకు ప్రయత్నిస్తామన్నాడు. భారత్‌పై ఇంతవరకు తాను సెంచరీ కొట్టలేదని ఈసారి ఆ వ్యక్తిగత ఘనతపై దృష్టిపెట్టానన్నాడు. ధోనిసేనపై రాణించడం తన కెరీర్‌కు కూడా మలుపు అవుతుందని గేల్ ఆశాభావం వ్యక్తం చేశాడు.
ప్రతి పరుగుకు కష్టపడాలి: రిచర్డ్‌సన్
ఈ సిరీస్‌లో సచిన్ ప్రతి పరుగును కష్టపడి సంపాదించుకోవాలని విండీస్ టీమ్ మేనేజర్ రిచీ రిచర్డ్‌సన్ అన్నారు. ‘ఓ అరుదైన టెస్టు సిరీస్‌కు మమ్మల్ని ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు. ఈ సిరీస్‌లో ఆడేందుకు మా జట్టు మొత్తం చాలా ఉత్సాహంగా ఎదురుచూస్తోంది. సిరీస్ గెలవడం లక్ష్యంగా పెట్టుకున్నాం. మాస్టర్‌ను పరుగులు చేయకుండా అడ్డుకుంటాం. ప్రతి పరుగును కష్టపడి సాధించుకోవాలి’ అని రిచర్డ్‌సన్ వ్యాఖ్యానించారు.