
కోల్‌కతా: అండర్–17 ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నీని విజయవంతంగా నిర్వహిస్తోన్న భారత్‌పై అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిఫా) ప్రశంసల వర్షం కురిపించింది. అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్‌ఎఫ్) అధ్యక్షుడు ప్రఫుల్ పటేల్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ‘ఫిఫా’ టోర్నీల హెడ్ జైమే యార్జా మాట్లాడుతూ భారత్ ఆతిథ్యం అద్వితీయమన్నారు. సమీప భవిష్యత్తులో సీనియర్ సాకర్ ప్రపంచకప్‌ను నిర్వహించే సత్తా భారత్‌కు ఉందని కితాబిచ్చారు. ‘ఈ టోర్నీ ఎంతటి విజయవంతమైందో వేలాది అభిమానుల హాజరు చూపుతోంది. కోట్లాది ప్రేక్షకుల టీవీ రేటింగ్ తెలుపుతోంది.
అత్యధిక సంఖ్యలో ప్రత్యక్షంగా మ్యాచ్‌లను చూసిన జూనియర్ ప్రపంచకప్‌గా ఘనతకెక్కింది. మ్యాచ్‌లు సాగిన తీరు, ఘనమైన నిర్వహణ, వాడిన సాంకేతిక నైపుణ్యం అన్ని అత్యున్నతంగా ఉన్నాయి. ఓ అద్భుతమైన టోర్నమెంట్‌ను భారత్ ఆవిష్కరించింది. ఇపుడు భారత్ కూడా ఫుట్‌బాల్ దేశమైంది’ అని యార్జా తెలిపారు. భారత జట్టు కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో పోరాడిందని కితాబిచ్చారు. ఏఐఎఫ్‌ఎఫ్ చీఫ్ ప్రఫుల్ పటేల్ మాట్లాడుతూ 2019లో జరిగే అండర్–20 ప్రపంచకప్‌కు బిడ్ వేస్తామని చెప్పారు.