
న్యూఢిల్లీ: గోల్డ్‌కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్‌లో కాంస్య పతకం గెలిచిన తెలంగాణ బాక్సర్ మొహమ్మద్ హుసాముద్దీన్‌ను ‘టార్గెట్ ఒలింపిక్ పోడియం’ (టాప్) పథకంలో ఎంపిక చేశారు. 2020 టోక్యో ఒలింపిక్స్‌లో పతకాలు సాధించే అవకాశాలున్న క్రీడాకారులను ఎంపిక చేసి, వారి సాధనకు అయ్యే ఖర్చులను ప్రభుత్వమే భరించే విధంగా కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఈ పథకాన్ని ప్రవేశ పెట్టింది. గత రెండేళ్లుగా అంతర్జాతీయ స్థాయిలో 56 కేజీల విభాగంలో హుసాముద్దీన్ నిలకడగా రాణిస్తూ పతకాలు సాధిస్తున్నాడు.
మరోవైపు కామన్వెల్త్ గేమ్స్‌లోనే స్వర్ణం నెగ్గిన మరో బాక్సర్ గౌరవ్ సోలంకి (బాక్సింగ్)తోపాటు షూటర్లు మను భాకర్, మెహులీ ఘోష్, అనీశ్ భన్వాలా, ఓంప్రకాశ్, షాజర్ రిజ్వీ, భారత మహిళల టెన్నిస్ నంబర్‌వన్ అంకిత రైనాలను కూడా ‘టాప్స్’లో ఎంపిక చేశారు. అంకిత ఇటీవలే టాప్–200లోకి ప్రవేశించింది. డబ్ల్యూటీఏ తాజా ర్యాంకింగ్స్‌లో ఆమె అత్యుత్తమంగా 197వ ర్యాంక్‌లో నిలిచింది. తద్వారా ఈ ఘనత సాధించిన మూడో భారత క్రీడాకారిణిగా గుర్తింపు పొందింది. గతంలో సానియా మీర్జా, నిరుపమా వైద్యనాథన్ మాత్రమే టాప్–200లో చోటు సంపాదించారు.