డేవిస్ కప్ జట్టునుంచి తనను అకారణంగా తప్పించడంపై భారత అగ్రశ్రేణి టెన్నిస్ ఆటగాడు రోహన్ బోపన్న తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు.
భారత జట్టు నుంచి తొలగించడంపై బోపన్న స్పందన
బెంగళూరు: డేవిస్ కప్ జట్టునుంచి తనను అకారణంగా తప్పించడంపై భారత అగ్రశ్రేణి టెన్నిస్ ఆటగాడు రోహన్ బోపన్న తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. జట్టును ప్రకటించిన విషయం తనకు మీడియా ద్వారానే తెలిసిందని అతను అన్నాడు. ‘న్యూజిలాండ్‌తో జరిగే మ్యాచ్‌కు నేను అందుబాటులో ఉండగలనా అని మెయిల్ పంపించారు. నేను సిద్ధమేనని రెండు రోజుల్లోనే జవాబిచ్చాను. కానీ జట్టును ఎంపిక చేసినట్లు గానీ, నన్ను తప్పించిన విషయం గానీ ‘ఐటా’ లేదా కోచ్ జీషాన్ అలీ ఎవరూ సమాచారం ఇవ్వలేదు. అసలు ఏ ప్రాతిపదికన జట్టును ఎంపిక చేశారో కూడా తెలీదు’ అని బోపన్న వ్యాఖ్యానించాడు.
మరోవైపు రాబోయే సీజన్‌లో బోపన్న డబుల్స్‌లో కొత్త భాగస్వామితో బరిలోకి దిగనున్నాడు. ఉరుగ్వేకు చెందిన పాబ్లో క్వాస్‌తో కలిసి అతను ఆడతాడు. ప్రపంచ 28వ ర్యాంకర్ బోపన్న, గత రెండేళ్లుగా రొమేనియా ఆటగాడు ఫ్లోరిన్ మెర్జియాతో కలిసి ఆడాడు. వీరిద్దరు కలిసి రెండు టైటిల్స్ గెలుచుకోగా, మరో ఐదుసార్లు రన్నరప్‌గా నిలిచారు.