దక్షిణాఫ్రికా బౌలర్ల జోరు 

Bavuma bats South Africa into commanding position - Sakshi

ఆసీస్‌ 110/6  

జొహన్నెస్‌బర్గ్‌: ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో దక్షిణాఫ్రికా ఆధిపత్యం చాటుతోంది. రెండో రోజు మొదట బవుమా (95 నాటౌట్, 13 ఫోర్లు) వీరోచిత పోరాటంతో భారీ స్కోరు చేసిన సఫారీ జట్టు అనంతరం బౌలింగ్‌లోనూ చెలరేగింది. దీంతో ఆస్ట్రేలియా పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఓవర్‌నైట్‌ స్కోరు 313/6తో శనివారం ఆట కొనసాగించిన దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 488 పరుగుల వద్ద ఆలౌటైంది. సహచరులు ఔటవ్వడంతో బవుమా 5 పరుగుల తేడాతో సెంచరీ అవకాశం చేజార్చుకున్నాడు. కేశవ్‌ మహరాజ్‌ (45; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), డికాక్‌ (39; 4 ఫోర్లు) మెరుగ్గా ఆడారు. ఆసీస్‌ బౌలర్లలో కమిన్స్‌ 5 వికెట్లు పడగొట్టగా, లయన్‌ 3, సేయర్స్‌ 2 వికెట్లు తీశారు. 

ఆ ముగ్గురు చేసింది పన్నెండే... 
అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఆస్ట్రేలియాను ఫిలాండర్‌ దెబ్బ మీద దెబ్బ తీశాడు. దీంతో ఆసీస్‌ 96 పరుగులకే కీలకమైన 6 వికెట్లను కోల్పోయింది. ఆట ముగిసే సమయానికి 38 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 110 పరుగులు చేసింది. ఖాజా (53; 9 ఫోర్లు) ఒక్కడే కుదురుగా ఆడాడు. ఫిలాండర్‌ 3, రబడ, మోర్కెల్, కేశవ్‌ మహరాజ్‌ తలా ఒక వికెట్‌ తీశారు. బాల్‌ ట్యాంపరింగ్‌ ఉదంతంతో సస్పెన్షన్‌కు గురైన స్మిత్, వార్నర్, బాన్‌క్రాఫ్ట్‌ స్థానంలో ఈ టెస్టులో బరిలోకి దిగిన హ్యాండ్స్‌కోంబ్‌ (0), రెన్‌షా (8), బర్న్స్‌ (4) విఫలమయ్యారు. ఈ ముగ్గురు కలిసి కేవలం 12 పరుగులే చేశారు.   

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top