సెమీస్‌లో బ్యాడ్మింటన్‌ జట్టు | Badminton team in semis | Sakshi
Sakshi News home page

సెమీస్‌లో బ్యాడ్మింటన్‌ జట్టు

Apr 8 2018 1:32 AM | Updated on Apr 8 2018 1:32 AM

Badminton team in semis - Sakshi

కామన్వెల్త్‌ గేమ్స్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ బ్యాడ్మింటన్‌ క్వార్టర్‌ ఫైనల్లో భారత్‌ 3–0తో మారిషస్‌పై నెగ్గింది. సింగిల్స్‌లో శ్రీకాంత్‌ 21–12, 21–14తో జార్జెస్‌ పాల్‌పై గెలుపొందగా, పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌ –చిరాగ్‌ షెట్టి 21–12, 21–3తో లుబా–క్రిస్టోఫర్‌ పాల్‌పై, మహిళల డబుల్స్‌లో సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప 21–8, 21–7తో ఎలీసా–నిక్కీ చాన్‌ లామ్‌పై నెగ్గారు. 

హుసాముద్దీన్‌ క్వార్టర్స్‌కు... 
వెటరన్‌ బాక్సర్లు సరితా దేవి (60 కేజీలు), మనోజ్‌ కుమార్‌ (69 కేజీలు)లతో పాటు తెలంగాణ బాక్సర్‌ హుసాముద్దీన్‌ (56కేజీలు) పతకానికి అడుగు దూ రంలో ఉన్నారు. ప్రిక్వార్టర్‌ ఫైనల్స్‌లో హుసాముద్దీన్‌ 5–0తో బోయె వరవర (వనుతు)పై, మనోజ్‌ 5–0తో ఎంబుడ్వికె (టాంజానియా)పై, సరిత 5–0తో కింబర్లీ గిటెన్స్‌ (బార్బడోస్‌)పై గెలిచారు.  

పాక్‌తో భారత్‌ హాకీ మ్యాచ్‌ డ్రా 
పురుషుల హాకీలో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో జరిగిన తొలి లీగ్‌ మ్యాచ్‌ను భారత్‌ 2–2తో ‘డ్రా’ చేసుకుంది. ఆరంభంలోనే రెండు గోల్స్‌ చేసి మ్యాచ్‌లో నిలిచిన భారత్‌ మధ్యలో పట్టు సడలించింది. చివరకు ఆలస్యంగా స్పందించినప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఫలితం... గెలవాల్సిన మ్యాచ్‌లో డ్రాతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. భారత్‌ తరఫున దిల్‌ప్రీత్‌ సింగ్‌ (13వ ని.), హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ (19వ ని.) చెరో గోల్‌ చేయగా, పాక్‌ జట్టులో ఇర్ఫాన్‌ (38వ ని.), ముబాషిర్‌ అలీ (59వ ని.) గోల్‌ చేశారు. 

రెండు జట్లూ సెమీస్‌కు... 
టేబుల్‌ టెన్నిస్‌ టీమ్‌ ఈవెంట్‌లో భారత పురుషుల, మహిళల జట్లు సెమీస్‌కు చేరాయి. క్వార్టర్‌ ఫైనల్స్‌లో భారత పురుషుల జట్టు 3–0తో మలేసియాపై... మహిళల జట్టు 3–0తో మలేసియాపైనే గెలిచాయి.  
అరుణకు నిరాశ 
ఆర్టిస్టిక్‌ జిమ్నాస్టిక్స్‌లో పురుషుల ఆల్‌ అరౌండ్‌ ఫైనల్స్‌లో పోటీపడిన యోగేశ్వర్‌ 14వ స్థానంలో... మహిళల ఆల్‌ అరౌండ్‌ ఫైనల్స్‌లో ప్రణతి దాస్‌ 16వ స్థానంలో, తెలంగాణ అమ్మాయి బుద్దా అరుణా రెడ్డి 14వ స్థానంలో నిలిచారు. వాస్తవానికి అరుణ ఆల్‌ అరౌండ్‌ ఫైనల్‌కు అర్హత పొందకపోయినా... ఫైనల్స్‌కు చేరిన మరో క్రీడాకారిణి చివరి నిమిషంలో తప్పుకోవడంతో ఆమెకు అవకాశం లభించింది.  

జోష్నా ఔట్‌ 
మహిళల స్క్వాష్‌ సింగిల్స్‌లో భారత స్టార్‌ జోష్నా చినప్ప పోరాటం ముగిసింది. క్వార్టర్‌ ఫైనల్లో జోష్నా 5–11, 6–11, 9–11తో జోలీ కింగ్‌ (న్యూజిలాండ్‌) చేతిలో ఓడిపోయింది.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement