‘ఆసియా’ మనదే

Asia cup 2018 final:india beat bangladesh - Sakshi

మళ్లీ టైటిల్‌ సాధించిన భారత్‌

ఉత్కంఠభరిత ఫైనల్లో 3 వికెట్లతో బంగ్లాదేశ్‌పై విజయం

గెలిపించిన లోయర్‌ ఆర్డర్‌

లిటన్‌ దాస్‌ సెంచరీ వృథా   

ఆసియా కప్‌ అద్భుతంగా ముగిసింది. అత్యంత ఉత్కంఠభరితంగా ఆఖరి బంతి వరకు సాగిన తుది పోరులో భారత్‌దే పైచేయి అయింది. స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో టీమిండియా తీవ్రంగా శమ్రించాల్సి వచ్చింది. చివరి వరకు పట్టుదలగా ఆడి పోరాడిన బంగ్లాదేశ్‌కు మరోసారి నిరాశ తప్పలేదు. రోహిత్‌ శర్మ నేతృత్వంలో టోర్నీలో అజేయంగా నిలిచిన భారత్‌ సగర్వంగా ఏడోసారి ఆసియా కప్‌ను అందుకోగా... 
మొర్తజా బృందం వరుసగా మూడోసారి రన్నరప్‌గానే సంతృప్తి చెందాల్సి వచ్చింది.    

దుబాయ్‌: భారత జట్టు విజయానికి 14 ఓవర్లలో 63 పరుగులు కావాలి. ధోనితో పాటు కేదార్‌ జాదవ్‌ క్రీజ్‌లో ఉన్నాడు. అంతా భారత్‌కు అనుకూలంగానే సాగుతోంది. అయితే ఈ స్థితిలో డ్రామా మొదలైంది. ధోని ఔట్‌ కాగా, జాదవ్‌ కండరాలు పట్టేయడంతో పెవిలియన్‌కు వెళ్లిపోయాడు. బంగ్లాదేశ్‌ విజయంపై ఆశలు పెంచుకుంది. అయితే జడేజా, భువనేశ్వర్‌ 45 పరుగుల భాగస్వామ్యం వాటిని తుంచేసింది. ఆఖరి బంతికి లెగ్‌బై ద్వారా సింగిల్‌ రావడంతో భారత్‌ విజయం ఖాయమైంది. శుక్రవారం జరిగిన ఆసియా కప్‌ ఫైనల్లో భారత్‌ 3 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌పై విజయం సాధించింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్‌ 48.3 ఓవర్లలో 222 పరుగులకు ఆలౌటైంది. లిటన్‌ దాస్‌ (117 బంతుల్లో 121; 12 ఫోర్లు, 2 సిక్సర్లు) కెరీర్‌లో తొలి సెంచరీతో చెలరేగాడు. భారత బౌలర్లలో కుల్దీప్‌ 3, జాదవ్‌ 2 వికెట్లు తీశారు. అనంతరం భారత్‌ 50 ఓవర్లలో 7 వికెట్లకు 223 పరుగులు చేసింది. రోహిత్‌ శర్మ (55 బంతుల్లో 48; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.  

శతక భాగస్వామ్యం... 
కెరీర్‌లో 17 వన్డేలు ఆడితే సగటు 14.06 కాగా అత్యధిక స్కోరు 41 మాత్రమే ఉన్న బ్యాట్స్‌మన్‌ ఒకరు... 16 వన్డేల్లో ఏనాడూ ఆరో స్థానం కంటే ముందుగా బ్యాటింగ్‌కు దిగని ఆటగాడు మరొకరు... వీరిద్దరిని ఆసియా కప్‌ ఫైనల్లో ఓపెనర్లుగా పంపి బంగ్లాదేశ్‌ సాహసం చేసింది. అయితే ఇది అద్భుత ఫలితాన్నిచ్చింది. లిటన్‌ దాస్, మెహదీ హసన్‌ (59 బంతుల్లో 32; 3 ఫోర్లు) కలిసి భారీ భాగస్వామ్యంతో జట్టుకు శుభారంభం అందించారు. ముఖ్యంగా బుమ్రా బౌలింగ్‌లో దాస్‌ వరుస బౌండరీలతో చెలరేగిపోయాడు. ఆ తర్వాత చహల్‌ ఓవర్లో కూడా రెండు భారీ సిక్సర్లు కొట్టిన దాస్‌ 33 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత 52 పరుగుల వద్ద మిడ్‌ వికెట్‌లో చహల్‌ క్యాచ్‌ వదిలేయడంతో దాస్‌ బతికిపోయాడు. ఇదే జోరులో ఓపెనింగ్‌ భాగస్వామ్యం వంద పరుగులు దాటింది. గత 27 వన్డేల్లో బంగ్లాదేశ్‌ ఓపెనర్లు తొలిసారి సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పడం విశేషం. 20 ఓవర్లు ముగిసేసరికి స్కోరు 116 పరుగులకు చేరింది.  

స్పిన్నర్ల జోరు... 
బంగ్లా ఇన్నింగ్స్‌ 21వ ఓవర్‌ నుంచి మ్యాచ్‌ ఒక్కసారిగా మలుపు తిరిగింది. తన తొలి ఓవర్లోనే మెహదీ హసన్‌ను ఔట్‌ చేసి కేదార్‌ జాదవ్‌ ఈ జోడీని విడదీశాడు. ఆ తర్వాత కైస్‌ (2)ను చహల్‌ ఎల్బీగా పెవిలియన్‌ పంపించాడు. బంగ్లా ఎన్నో ఆశలు పెట్టుకున్న ముష్ఫికర్‌ (5) పేలవ షాట్‌కు వెనుదిరగ్గా, తర్వాతి ఓవర్లోనే జడేజా అద్భుత ఫీల్డింగ్‌ నైపుణ్యానికి మిథున్‌ (2) రనౌటయ్యాడు. మహ్ముదుల్లా (4) కూడా జట్టును ఆదుకోలేకపోయాడు. 31 పరుగుల వ్యవధిలో బంగ్లా 5 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో సౌమ్య సర్కార్‌ (45 బంతుల్లో 33; 1 ఫోర్, 1 సిక్స్‌) కొద్దిసేపు దాస్‌కు అండగా నిలిచాడు. అయితే కుల్దీప్‌ వరుస ఓవర్లలో దాస్, మొర్తజా (7)లను ధోని స్టంపౌట్‌ చేయడంతో బంగ్లాదేశ్‌ భారీ స్కోరుపై ఆశలు కోల్పోయింది. దాస్‌ స్టంపింగ్‌ సందేహాస్పదంగా కనిపించినా చివరకు థర్డ్‌ అంపైర్‌ ఔట్‌గానే ప్రకటించారు. ఇన్నింగ్స్‌లో తొలి 100 పరుగులు చేసేందుకు 17.5 ఓవర్లు మాత్రమే తీసుకున్న బంగ్లాకు తర్వాతి 100 పరుగులు చేసేందుకు 26.5 ఓవర్లు పట్టడం ఆ జట్టు బ్యాటింగ్‌ వైఫల్యాన్ని చూపిస్తోంది. సమన్వయ లోపంతో ముగ్గురు ఆటగాళ్లు రనౌట్‌ కావడం విశేషం. 

గెలిపించిన జడేజా, భువనేశ్వర్‌... 
సాధారణ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో తొలి ఓవర్లోనే పది పరుగులు రాబట్టి భారత్‌ శుభారంభం చేసింది. కానీ టోర్నీలో తొలిసారి 50 పరుగుల లోపే మొదటి వికెట్‌ భాగస్వామ్యం ముగిసింది. దూకుడుగా ఆడే క్రమంలో శిఖర్‌ ధావన్‌ (15) వెనుదిరగ్గా, అంబటి రాయుడు (2) విఫలమయ్యాడు. మరోవైపు రోహిత్‌ మాత్రం దూకుడు కొనసాగిస్తూ భారీ షాట్లు ఆడాడు. అయితే అర్ధ సెంచరీకి చేరువైన సమయంలో మరోసారి పుల్‌ షాట్‌కు ప్రయత్నించి డీప్‌ స్క్వేర్‌లెగ్‌లో క్యాచ్‌ ఇవ్వడంతో అతని ఆట ముగిసింది. ఈ దశలో దినేశ్‌ కార్తీక్‌ (37; 1 ఫోర్, 1 సిక్స్‌), ధోని కలిసి ఇన్నింగ్స్‌ను నడిపించారు. ఆరంభంలో నిలదొక్కుకునేందుకు కొంత సమయం తీసుకున్నా... ఆ తర్వాత వీరిద్దరు చక్కటి సమన్వయంతో బ్యాటింగ్‌ చేశారు. తాను ఎదుర్కొన్న 23వ బంతికి ధోని తొలి ఫోర్‌ కొట్టాడు. ధోనితో నాలుగో వికెట్‌కు 14 ఓవర్లలో 54 పరుగులు జోడించిన అనంతరం కార్తీక్‌ వెనుదిరిగాడు. కొద్ది సేపటికే ముస్తఫిజుర్‌ చక్కటి బంతికి ధోని కూడా ఔటయ్యాడు. ఆ తర్వాత జాదవ్‌ కూడా గాయంతో తప్పుకోవడంతో ఉత్కంఠ ఒక్కసారిగా పెరిగిపోయింది. అయితే జడేజా, భువనేశ్వర్‌ తీవ్రమైన ఒత్తిడిని తట్టుకొని భారత్‌ను విజయానికి చేరువ చేశారు.  

 
►అంతర్జాతీయ క్రికెట్‌లో బంగ్లాదేశ్‌ ఇప్పటి వరకు ఆడిన తొమ్మిది నాకౌట్‌ మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయింది.  

►ఆసియా కప్‌ ఫైనల్లో సెంచరీ చేసిన ఐదో బ్యాట్స్‌ మన్‌గా లిటన్‌ దాస్‌ గుర్తింపు పొందాడు. గతంలో జయసూర్య (శ్రీలంక–125; భారత్‌పై కరాచీలో 2008)... ఫవాద్‌ ఆలమ్‌ (పాక్‌–114 నాటౌట్‌; శ్రీలంకపై మిర్పూర్‌లో 2014)... తిరిమన్నె (శ్రీలంక–101; పాక్‌పై మిర్పూర్‌లో 2014)... ఆటపట్టు (శ్రీలంక–100; పాక్‌పై ఢాకాలో 2000) ఈ ఘనత సాధించారు.  

►ఇంగ్లండ్‌ తర్వాత (194; విండీస్‌పై 1979 వరల్డ్‌ కప్‌ ఫైనల్‌) ఓ టోర్నీ ఫైనల్లో తొలి వికెట్‌కు 100 కంటే ఎక్కువ పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి తక్కువ స్కోరుకే ఆలౌటైన రెండో జట్టుగా బంగ్లాదేశ్‌ (222) నిలిచింది.  

►అంతర్జాతీయ క్రికెట్‌లో 800 ఔట్‌లలో పాలుపంచుకున్న మూడో వికెట్‌ కీపర్‌గా, ఆసియా నుంచి తొలి కీపర్‌గా ధోని నిలిచాడు. బౌచర్‌ (దక్షిణాఫ్రికా–998),  గిల్‌క్రిస్ట్‌ (ఆస్ట్రేలియా–905) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.   

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top