
నాగపూర్: భారత బౌలర్ల ధాటికి లంక బ్యాట్స్‌మెన్ తోక ముడిచారు. స్వల్ప స్కోరుకే చాప చుట్టేశారు. శుక్రవారం ప్రారంభమైన రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక 205 పరుగులకే ఆలౌటైంది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న లంక టీమ్ 20 పరుగుల వద్ద తొలి వికెట్ నష్టపోయింది. టీమిండియా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో వరుసగా వికెట్లు కోల్పోయింది.
లంక ఆటగాళ్లలో కరుణరత్నె(51), చందిమాల్(57) మాత్రమే రాణించారు. మిగతా ఆటగాళ్లు అందరూ విఫలమవడంతో లంక స్పల్ప స్కోరుకే పరిమితమైంది. భారత బౌలర్లలో అశ్విన్ 4 వికెట్లు నేలకూల్చాడు. జడేజా, ఇషాంత్ శర్మ మూడేసి వికెట్లు పడగొట్టారు.
తర్వాత బ్యాటింగ్‌కు దిగిన భారత్ ఏడు పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. కేఎల్ రాహుల్ 7 పరుగులు చేసి అవుటయ్యాడు. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 8 ఓవర్లు ఆడి 11 పరుగులు చేసింది. విజయ్(2), పుజారా(2) క్రీజ్‌లో ఉన్నారు.