వెంకటేశ్‌ ప్రసాద్‌ స్థానంలో ఆశిష్‌..!

Ashish Kapoor likely to come back in place of Venkatesh Prasad - Sakshi

న్యూఢిల్లీ:పరస్పర విరుద్ధ ప్రయోజనాల్లో భాగంగా భారత జూనియర్‌ క్రికెట్‌ జట్టు సెలక్షన్‌ కమిటీ చైర్మన్‌ పదవికి మాజీ పేసర్‌ వెంకటేశ్‌ ప్రసాద్‌ రాజీనామా చేసిన నేపథ్యంలో అతని స్థానంలో భారత మాజీ ఆఫ్‌ స్పిన్నర్‌ ఆశిష్‌ కపూర్‌ పేరును పరిశీలిస్తున్నారు. గతంలో ఐదుగురు సభ్యుల సెలక్షన్‌ కమిటీ ప్యానల్‌లో పని చేసిన ఆశిష్‌ను చైర్మన్‌గా చేయాలని బీసీసీఐ పరిపాలన కమిటీ(సీఓఏ) భావిస్తోంది.

వెంకటేశ్‌ ప్రసాద్‌ ఉన్నపళంగా తప్పుకోవడంతో  ప్రస్తుత సెలక్షన్‌ కమిటీ ప్యానల్‌లో జ్ఙానేంద్ర పాండే, రాకేశ్‌ పారిక్‌లు మాత్రమే మిగిలారు. అంతకుముందు ఐదుగురు సభ్యులతో కూడిన జూనియర్‌ సెలక్షన​ కమిటీ ప్యానల్‌ ఉండేది. లోధా నిబంధనలు అమల్లోకి వచ్చిన తర్వాత అందులో ముగ్గురు సభ్యులు మాత్రమే మిగిలారు. ఆ క్రమంలోనే ఆశిష్‌ కపూర్‌, అమిత్‌ శర్మలు ప్యానెల్‌ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.  కాగా, వెంకీ రాజీనామాతో ఆశిష్‌, అమిత్‌లు పేర్లు మరోసారి తెరపైకి వచ్చాయి. అయితే ఇక్కడ ఆశిష్‌కే కమిటీ చైర్మన్‌ అ‍య్యేందుకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. అర్హత పరంగా చూస్తే ఆశిష్‌ మాజీ టెస్టు క్రికెటర్‌ కూడా కావడం  అతనికి కలిసొచ్చే అంశం. మిగతా వారికి టెస్టు ఆడిన అనుభవం లేకపోవడంతో ఆశిష్‌ వైపే సీఓఏ మొగ్గుచూపే అవకాశం ఉంది.

అండర్-19 ప్రపంచకప్ గెలిచి నెల కూడా తిరుగకుండానే జూనియర్ సెలెక్షన్ కమిటీ చైర్మన్ పదవికి మాజీ పేసర్ వెంకటేశ్ ప్రసాద్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. సుమారు 30 నెలలుగా ఈ పదవిలో కొనసాగిన వెంకటేశ్‌ ప్రసాద్‌ వ్యక్తిగత కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. పరస్పర విరుద్ద ప్రయోజనాల అంశాన్ని ప్రసాద్‌ ప్రస్తావించడం చర్చనీయాంశమైంది. వచ్చే ఐపీఎల్లో వెంకటేశ్‌ ప్రసాద్‌ కింగ్స్‌ పంజాబ్‌ జట్టుకు బౌలింగ్‌ కోచ్‌గా వ్యవహరించనున్నారు. దీనిలో భాగంగానే తన పదవికి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top