అర్జెంటీనా ఊపిరి పీల్చుకో..

Argentina Qualify For Round Of 16 In FIFA World Cup - Sakshi

ఐస్‌లాండ్‌పై క్రొయేషియా గెలుపు

నాకౌట్‌కు మెస్సీ సేన

మాస్కో : అర్జెంటీనాకు ఉపశమనం లభించింది. లియోనల్‌ మెస్సీ, అర్జెంటీనా అభిమానులు ఎప్పుడూ లేనంతగా ఐస్‌లాండ్‌పై క్రొయేషియా గెలవాలి.. కనీసం ఈ మ్యాచ్‌ డ్రా అవ్వాలని  ప్రార్ధించారు. వారి ప్రార్థనలు ఫలించాయి. ఐస్‌లాండ్‌పై 2-1తో క్రొయేషియా గెలిచి అర్జెంటీనాను నాకౌట్‌కు పంపించింది. ఫిఫా ప్రపంచకప్‌ తొలి నాకౌట్‌ పోరులో ఫ్రాన్స్‌తో అర్జెంటీనా శనివారం రోజు(జూన్ ‌30)న తలపడనుంది.

మంగళవారం అర్ధరాత్రి ఐస్‌లాండ్‌తో జరిగిన హోరాహోరి మ్యాచ్‌లో చివరకు క్రోయేషియా విజయం సాధించింది. తొలి భాగం ముగిసే సరికి ఇరు జట్లు ఒక్క గోల్‌ కూడా నమోదు చేయలేకపోయాయి. రెండో అర్థభాగం ప్రారంభమైన ఎనిమిది నిమిషాలకు క్రొయేషియా ఆటగాడు బాడెల్జ్ (53వ నిమిషంలో) తొలి గోల్‌ నమోదు చేశాడు. గోల్‌పోస్ట్‌పై ఇరుజట్లు పోటీపడీ దాడులు చేసినా, రక్షణశ్రేణి సమర్థవంతంగా అడ్డుకుంది. 76వ నిమిషంలో పెనాల్టీ కిక్‌ రూపంలో ఐస్‌లాండ్‌ను అదృష్టం వరించింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని  ఐస్‌లాండ్‌ ఆటగాడు సిగుర్గ్‌స్సన్‌ గోల్‌గా మలిచాడు.

రెండో అర్థభాగం పూర్తవుతుందనుకున్న సమయంలో క్రొయేషియా ఆటగాడు పెరిసిక్‌ కళ్లుచెదిరే రీతిలో గోల్‌ చేసి తన జట్టును ఆధిక్యంలోకి తీసుకొచ్చాడు. ఇంజ్యూరీ టైమ్‌లో ఇరుజట్లు మరో గోల్‌ నమోదు చేయకపోవడంతో క్రొయేషియా విజయం సాధించింది. ఇక ఈ మ్యాచ్‌లో ఐస్‌లాండ్‌ అత్యధిక సార్లు(17) గోల్‌ కోసం ప్రయత్నించగా, క్రొయేషియా రక్షణశ్రేణి విజయవంతంగా ఆడ్డుకుంది. క్రొయేషియా అనవసర తప్పిదాలు  12 చేయగా, ఐస్‌ లాండ్‌ 10 తప్పిదాలు చేసింది. ఈ మ్యాచ్‌లో రిఫరీలు ఇద్దరు క్రొయేషియా, ముగ్గురు ఐస్‌లాండ్‌ ఆటగాళ్లకు ఎల్లో కార్డు చూపించారు. 
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top