అర్జెంటీనా నిలిచింది

Argentina defeat Nigeria, face France in knockout stage - Sakshi

మెరిసిన మెస్సీ

గెలిపించిన రొజొ గోల్

నైజీరియాపై 2–1తో గెలుపు

30న ఫ్రాన్స్‌తో నాకౌట్‌ మ్యాచ్‌  

అర్జెంటీనా ఊపిరి పీల్చుకుంది! ఒక డ్రా, ఒక ఓటమితో... నాకౌట్‌ అవకాశాలను పీకల మీదకు తెచ్చుకున్న ఆ జట్టు... ఓ చక్కటి గెలుపుతో ప్రపంచ కప్‌ లీగ్‌ దశ గండాన్ని అధిగమించింది. ఢీ అంటే ఢీ అనేలా తలపడే నైజీరియాపై ఆధిపత్యం చాటుతూ లియోనల్‌ మెస్సీ మైమరపు గోల్‌ ఆధిక్యం అందించగా... మార్కొస్‌ రొజొ మెరుపు షాట్‌ గెలుపును కట్టబెట్టింది. 
 
సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌: తరుముకొస్తున్న పరాభవాన్ని అర్జెంటీనా తప్పించుకుంది. ‘డ్రా’ సైతం సరిపోనంతగా... గెలుపు అత్యవసరమైన స్థితిలో పైకి లేచింది. కెప్టెన్‌ మెస్సీ (14వ నిమిషంలో), డిఫెండర్‌ మార్కొస్‌ రొజొ (86వ నిమిషంలో) గోల్స్‌తో మంగళవారం అర్ధరాత్రి ఇక్కడ జరిగిన గ్రూప్‌ ‘డి’ మ్యాచ్‌లో 2–1 తేడాతో నైజీరియాను ఓడించి నాకౌట్‌కు చేరింది. నైజీరియా తరఫున మోసెస్‌ (51వ నిమి షంలో) పెనాల్టీ కిక్‌ను గోల్‌గా మలిచాడు. ఈ ఫలితంతో గ్రూప్‌లో రెండో స్థానంలో నిలిచిన అర్జెంటీనా (4 పాయింట్లు)... గ్రూప్‌ ‘సి’ విజేత ఫ్రాన్స్‌తో ఈ నెల 30న జరిగే నాకౌట్‌ మ్యాచ్‌లో తలపడనుంది.

మెస్సీ ‘బనేగా’ గోల్‌...
జట్టుగా ఎలా ఉన్నా మైదానంలోకి వచ్చేసరికి అర్జెంటీనాకు మెస్సీనే అన్నీ. దీనిని మరోసారి నిరూపిస్తూ అతడు ప్రారంభంలోనే గోల్‌ కొట్టి ఆధిక్యం అందించాడు. 14వ నిమిషంలో సహచరుడు బనేగా సుదూరం నుంచి ఇచ్చిన పాస్‌ను అందుకున్న మెస్సీ ముందు దానిని నియంత్రించి, ఆ తర్వాత ప్రత్యర్థి ఆటగాడిని ఏమారుస్తూ ముందుకెళ్లి నేరుగా గోల్‌పోస్ట్‌లోకి కొట్టా డు.  ఆధిక్యం కోల్పోయి, జట్టుగా ఆడలేకపోతున్న నైజీరియాకు రెండో భాగంలో అదృష్టం తోడైంది. 49వ నిమిషంలో బాక్స్‌ లోపల బలోగన్‌ను మాస్కెరనో అడ్డుకోవడంతో ఆ జట్టుకు పెనాల్టీ దక్కింది. దీనిని మోసెస్‌ పొరపాటు లేకుండా నెట్లోకి పంపాడు. మ్యాచ్‌ ముగియడానికి నాలుగు నిమిషాలు ఉందనగా కుడి వైపు కార్నర్‌ నుంచి అందిన పాస్‌ను అందుకున్న రొజొ... అంతే వేగంగా నెట్‌లోకి పంపి జట్టుకు రెండో గోల్‌తో పాటు అద్భుత విజయాన్ని అందించాడు.

గ్రూప్‌ ‘డి’ టాపర్‌ క్రొయేషియా
రొస్తావ్‌ ఆన్‌ డాన్‌: ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలుపొందిన క్రొయేషియా... గ్రూప్‌ ‘డి’లో అగ్రస్థానంలో నిలిచింది. మంగళవారం అర్ధరాత్రి ఐస్‌లాండ్‌తో జరిగిన పోరులో ఆ జట్టు 2–1తో నెగ్గింది. బడెల్జ్‌ (53వ నిమిషంలో), పెరిసిక్‌ (90వ ని.లో) క్రొయే షియాకు గోల్స్‌ చేశారు. మధ్యలో సిగుర్డ్‌సన్‌ (76వ ని.లో) పెనాల్టీని గోల్‌గా మలిచి ఐస్‌లాండ్‌ను పోటీలో నిలిపాడు. మ్యాచ్‌ డ్రాగా ముగిసేలా కనిపించినా పెరిసిక్‌ స్కోరు చేసి ఫలితాన్ని మార్చాడు. ఇంతకుముందే నైజీరియా, అర్జెంటీనాలపై నెగ్గిన క్రొయే షియా ఈ ఫలితంతో గ్రూప్‌లో అజేయంగా నిలిచింది. జూలై 1న నాకౌట్‌లో డెన్మార్క్‌తో ఆడనుంది.

ప్రపంచకప్‌లో నేడు
జపాన్‌ x పోలాండ్‌
రా.గం. 7.30 నుంచి
సెనెగల్‌ x కొలంబియా
రా.గం. 7.30 నుంచి
పనామా x ట్యూనిషియా
రా.గం. 11.30 నుంచి
ఇంగ్లండ్‌ x బెల్జియం
రా.గం. 11.30 నుంచి

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top