అమిత్, విక్కీలకు రజతాలు 

 Amit Dhankar, Vicky win silver after losing finals - Sakshi

కాంస్యాలు నెగ్గిన రాహుల్, దీపక్, సుమీత్‌

ఆసియా రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌

జియాన్‌ (చైనా): గత ఏడాది ఆసియా సీనియర్‌ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌లో పురుషుల ఫ్రీస్టయిల్‌ విభాగంలో కేవలం రెండు కాంస్య పతకాలు నెగ్గిన భారత రెజ్లర్లు ఈసారి మాత్రం అదరగొట్టారు. బుధవారం ముగిసిన ఫ్రీస్టయిల్‌ విభాగంలో రెండో రోజు భారత్‌కు రెండు రజతాలు, మూడు కాంస్య పతకాలు లభించాయి. ఓవరాల్‌గా భారత్‌కు ఈ విభాగంలో ఒక స్వర్ణం, మూడు రజతాలు, నాలుగు కాంస్యాలతో కలిపి మొత్తం ఎనిమిది పతకాలు వచ్చాయి. ఫలితంగా భారత్‌ 155 పాయింట్లతో టీమ్‌ చాంపియన్‌షిప్‌లో రన్నరప్‌గా నిలిచింది. 220 పాయింట్లతో ఇరాన్‌ ఓవరాల్‌ చాంపియన్‌ టైటిల్‌ను గెల్చుకుంది.  
బుధవారం జరిగిన ఐదు ఈవెంట్స్‌లో బరిలోకి దిగిన భారత రెజ్లర్లు పతకాలు నెగ్గడం విశేషం. అమిత్‌ ధన్‌కర్‌ (74 కేజీలు), విక్కీ (92 కేజీలు) రజత పతకాలు సొంతం చేసుకోగా... రాహుల్‌ అవారె (61 కేజీలు), దీపక్‌ పూనియా (86 కేజీలు), సుమీత్‌ (125 కేజీలు) కాంస్య పతకాలను దక్కించుకున్నారు.

74 కేజీల ఫైనల్లో 2013 ఆసియా చాంపియన్‌ అమిత్‌ 0–5తో కైసనోవ్‌ దానియర్‌ (కజకిస్తాన్‌) చేతిలో ఓడిపోయాడు. ‘ఫైనల్లో ఓడినందుకు నిరాశగా ఉంది. అయితే తాజా ప్రదర్శన నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. రాబోయే టోర్నీల్లో మరింత మెరుగ్గా రాణిస్తా. వచ్చే ఏడాది జరిగే టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధిస్తా’ అని అమిత్‌ అన్నాడు. 92 కేజీల ఫైనల్లో విక్కీ 0–11తో అలీరజా కరిమిమచియాని (ఇరాన్‌) చేతిలో ఓటమి పాలయ్యాడు. సెమీస్‌లో విక్కీ 3–2తో జియో సన్‌ (చైనా)పై గెలిచాడు. కాంస్య పతక బౌట్‌లలో రాహుల్‌ అవారె 9–2తో కిమ్‌ జిన్‌ చెయోల్‌ (కొరియా)పై, దీపక్‌ పూనియా 8–2తో కొదిరోవ్‌ బఖ్‌దుర్‌ (తజకిస్తాన్‌)పై, సుమీత్‌ 8–2తో అనకులోవ్‌ ఫర్ఖోద్‌ (తజికి స్తాన్‌)పై విజయం సాధించా రు. నేడు మహిళల ఫ్రీస్టయిల్‌ విభాగం పోటీలు మొదలవుతాయి. భారత్‌ తరఫున సీమా (50 కేజీలు), లలిత షెరావత్‌ (55 కేజీలు), మంజు (59 కేజీలు), దివ్య కక్రాన్‌ (68 కేజీలు), పూజా (76 కేజీలు) బరిలోకి దిగనున్నారు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top