ఇక ఆపండి చాలు: షోయబ్‌ అక్తర్‌

All I Did Was Talk About One Or Two Black Sheep, Shoaib  - Sakshi

కరాచీ: తాను క్రికెట్‌ ఆడిన సమయంలో సహచర క్రికెటర్‌ దానిష్‌ కనేరియాపై వివక్ష చూపెట్టారంటూ పాక్తిసాన్‌ మాజీ పేసర్‌ షోయబ్‌ అక్తర్‌ చేసిన వ్యాఖ్యలపై పెద్ద దుమారమే చెలరేగింది. అక్తర్‌ వ్యాఖ్యలకు భారత్‌లోని పలువురు క్రికెటర్లు మద్దతుగా నిలవగా, పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్ల మాత్రం తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. జావెద్‌ మియాందాద్‌ మొదలుకొని ఇంజమాముల్‌ హక్‌, మహ్మద్‌ యూసఫ్‌, షాహిద్‌ అఫ్రిదిలు అక్తర్‌ వ్యాఖ్యలను తిప్పికొట్టారు. దానిష్‌ కనేరియా హిందూ అనే కారణంగా ఎవరూ అవమానించలేదని పేర్కొన్నారు.  అదే సమయంలో ఆ వివక్ష భారత్‌లో లేదా అంటూ కూడా అక్తర్‌ను నిలదీశారు.

ఇది పెద్ద వివాదంగా మారడంతో అక్తర్‌ వివరణ ఇచ్చుకునే యత్నం చేశాడు. తాను ఏ సందర్భంలో, ఎందుకోసం అన్నానో ముందు తెలుసుకోవాలన్నాడు.  తనపై వస్తున్న విమర్శలకు బాధ్యత వహిస్తూ అందుకు సమాధానం కూడా ఇవ్వాల్సి ఉందన్నాడు. పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్టులో మొత్తంగా మత వివక్ష ఉందని తాను అనలేదని,  కేవలం ఒకరో, ఇద్దరో కనేరియాను హిందూ అనే కారణంగా చిన్నచూపు చూసేవారని మాత్రమే తాను పేర్కొనట్లు అక్తర్‌ తెలిపాడు. తాను చేసిన వ్యాఖ్యలను తప్పుదోవ పట్టిస్తూ మొత్తం పాకిస్తాన్‌ క్రికెట్‌లోనే మత వివక్ష ఉందనే విధంగా తాను అన్నట్లు ఆపాదించడం తగదన్నాడు.

‘నేను రెండు రోజులుగా చూస్తున్నా. నా చుట్టూ పెద్ద వివాదాన్ని సృష్టించారు. దాన్ని నేను విన్నాను.. చూశాను కూడా. అది నాకు క్లియర్‌గా అర్థమైంది. అందుకోసమే మరొకసారి మాట్లాడుతున్నా. ఇక విమర్శలు ఆపుతారనే యూట్యూబ్‌ ద్వారా వివరణ ఇస్తున్నా. నేను యూట్యూబ్‌ చానల్‌ను ఆరంభించడానికి కారణమే క్రికెట్‌ టాక్‌ ద్వారా కేవలం వినోదాన్ని పంచడానికి మాత్రమే కాదు.. మన సమాజంలో అభివృద్ధికి సంబంధించి కూడా చెబుతూ ఉంటా.  పాక్‌ క్రికెట్‌ కల్చర్‌లో  ఒక రాయబడలేని ఒప్పందం ఏదైనా ఉందంటే అది మనం ఒకరినొకరు గౌరవం ఇచ్చి పుచ్చుకోవాలనే సంగతి. కాకపోతే కొంతమందిలో అలా గౌరవం ఇచ్చి పుచ్చుకోవడంలో సంశయం కనబడుతోంది. ఇది మన జట్టు కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ కూడా కాదు.. వివక్ష చూపెట్టారని నేను చెప్పింది.. ఒకరో-ఇద్దరో క్రికెటర్ల గురించి మాత్రమే చెప్పా. ఆ బ్లాక్‌ షీప్స్‌ ప్రతీ చోట ఉండవచ్చు. అది పాకిస్తానా, ఇండియానా, ఇంగ్లండా, ఐర్లాండా అనేది సమస్య కాదు. దీనికి ఇక్కడితోనైనా ముగింపు దొరుకుతుందని ఆశిస్తున్నా’ అని అక్తర్‌ పేర్కొన్నాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top