ఇంగ్లండ్‌ గెలిచింది

3rd Test: England thrash West Indies but lose series 1-2 - Sakshi

మూడో టెస్టులో 232 పరుగులతో ఓడిన విండీస్‌ 

గ్రాస్‌ ఐలెట్‌: తొలి రెండు టెస్టుల్లో దారుణ పరాజయాలతో వెస్టిండీస్‌కు సిరీస్‌ను కోల్పోయిన ఇంగ్లండ్‌... మూడో టెస్టులో 232 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి పరువు దక్కించుకుంది. 485 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్‌ రెండో ఇన్నింగ్స్‌లో 69.5 ఓవర్లలో 252 పరుగులకు ఆలౌటైంది. మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌ రోస్టన్‌ ఛేజ్‌ (191 బంతుల్లో 102 నాటౌట్‌; 12 ఫోర్లు, 1 సిక్స్‌) అజేయ సెంచరీతో పోరాడినా ఫలితం లేకపోయింది. ఇంగ్లండ్‌ బౌలర్లలో వెటరన్‌ పేసర్‌ అండర్సన్‌ (3/27) ప్రత్యర్థి టాపార్డర్‌ను కూల్చగా, స్పిన్నర్‌ మొయిన్‌ అలీ (3/99) చివరి వరుస బ్యాట్స్‌మెన్‌ పనిపట్టాడు. స్టోక్స్‌ (2/30)కు రెండు వికెట్లు దక్కాయి. తొలి ఇన్నింగ్స్‌లో విండీస్‌ను దెబ్బకొట్టిన మార్క్‌ వుడ్‌ (5/41)కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ దక్కింది. సిరీస్‌లో 18 వికెట్లు పడగొట్టిన కరీబియన్‌ పేసర్‌ కీమర్‌ రోచ్‌ ‘మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌’గా ఎంపికయ్యాడు. సస్పెన్షన్‌ కారణంగా మూడో టెస్టుకు దూరమైన విండీస్‌ రెగ్యులర్‌ కెప్టెన్‌ హోల్డర్‌ సిరీస్‌ ట్రోఫీని అందుకున్నాడు. ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా రెండు జట్ల మధ్య తొలి మ్యాచ్‌ ఈ నెల 20న జరుగనుంది. 

గాబ్రియెల్‌పై నాలుగు వన్డేల సస్పెన్షన్‌ 
మూడో టెస్టులో ఇంగ్లండ్‌ కెప్టెన్‌ జో రూట్‌ను ఉద్దేశిస్తూ నోరుజారిన వెస్టిండీస్‌ పేసర్‌ షనన్‌ గాబ్రియెల్‌పై అంతర్జాతీయ క్రికెట్‌ మండలి బుధవారం నాలుగు వన్డేల సస్పెన్షన్‌ వేటు వేసింది. ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని 2.13 ఆర్టికల్‌ ఉల్లంఘనకు గాను గాబ్రియెల్‌ మ్యాచ్‌ ఫీజులో 75 శాతం కోత పెడుతూ, మూడు డీ మెరిట్‌ పాయింట్లు విధించింది. గత 24 నెలల్లో గాబ్రియెల్‌ డీ మెరిట్‌ పాయింట్లు ఎదుర్కోవడం ఇది మూడోసారి. మైదానంలో దురుసు ప్రవర్తనతో 2017 ఏప్రిల్‌లో పాకిస్తాన్‌తో టెస్టులో రెండు, గతేడాది నవంబర్‌లో బంగ్లాదేశ్‌తో టెస్టులో మూడు డీ మెరిట్‌ పాయింట్లు అతడి ఖాతాలో చేరాయి.    

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top