వాన దోబూచులాట

13 overs possible in washed-out first ODI - Sakshi

భారత్, వెస్టిండీస్‌ తొలి వన్డే రద్దు

వరుస అంతరాయాలతో రెండు సార్లు ఓవర్ల కుదింపు

భారత్‌–వెస్టిండీస్‌ తొలి వన్డేను వరుణుడు వీడని నీడలా వెంటాడాడు. అటు కుండపోతగానైనా కురవక... ఇటు పూర్తిగానూ ఆగక ఒకటికి రెండు సార్లు అంతరాయం కలిగించాడు. ఇలా మ్యాచ్‌ మొదలైందో లేదో... అలా వస్తూ, పోతూ ఆటగాళ్లతో దోబూచులాడాడు. మొత్తమ్మీద 13 ఓవర్ల ఆటను మాత్రమే సాగనిచ్చాడు. భారత కాలమానం ప్రకారం గురువారం రాత్రి 12.30 గంటల సమయానికీ వర్షం పడుతుండటంతో మ్యాచ్‌ను రద్దు చేశారు.  

ప్రావిడెన్స్‌ (గయానా): కరీబియన్‌ పర్యటనలో టి20లను ఆడుకోనిచ్చిన వరుణుడు వన్డే సిరీస్‌కు మాత్రం అడ్డంకిగా నిలిచాడు. గురువారం భారత్‌– వెస్టిండీస్‌ తొలి వన్డే ఒక అడుగు ముందుకు... పది అడుగులు వెనక్కు తరహాలో సాగి చివరికి రద్దయింది. ప్రావిడెన్స్‌లో ఉదయం నుంచి వర్షం కురుస్తుండటంతో పిచ్‌ పరిసరాలను పూర్తిగా కవర్లతో కప్పి ఉంచారు. టాస్‌ గంటన్నర ఆలస్యమైంది. దీంతో మ్యాచ్‌ను 43 ఓవర్లకు కుదించారు. టాస్‌ గెలిచిన భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి బౌలింగ్‌ ఎంచుకున్నాడు. టి20 సిరీస్‌లో అవకాశం లభించని మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ను ఈ మ్యాచ్‌ తుది జట్టులోకి తీసుకున్నారు. 25 నిమిషాలు సాగిన వెస్టిండీస్‌ ఇన్నింగ్స్‌లో 5.4 ఓవర్లు ఆడి 7 పరుగులు చేసింది.

ఈ దశలో వాన గంటా 15 నిమిషాలు అంతరాయం కలిగించింది. అనంతరం మ్యాచ్‌ను 34 ఓవర్లకు తగ్గించారు. మరో 8 ఓవర్ల పాటు కొనసాగిన ఆటలో విండీస్‌ ఓపెనర్‌ క్రిస్‌ గేల్‌ (31 బంతుల్లో 4) వికెట్‌ కోల్పోయింది. చివరకు 13 ఓవర్లలో వికెట్‌ నష్టానికి 54 పరుగులు చేసింది.  అవతలి ఎండ్‌లో ఓపెనర్‌ ఎవిన్‌ లూయీస్‌ (36 బంతుల్లో 40 నాటౌట్‌; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) మాత్రం ధాటిని ప్రదర్శించాడు. ఖలీల్‌ అహ్మద్‌పై విరుచుకుపడ్డాడు. ఇంతలోనే చినుకులు పెద్దవి కావడంతో అంపైర్లు మైదానాన్ని వీడాల్సిందిగా ఆటగాళ్లకు సూచించారు. ఎంత వేచి చూసినా ఫలితం లేకపోవడంతో భారత కాలమానం ప్రకారం రాత్రి 12.45కు  మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. సిరీస్‌లో భాగంగా రెండో వన్డే ఆదివారం పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌లో జరుగుతుంది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top