కోడిపిల్లను బతికించమన్న చిన్నోడికి అవార్డు!

Mizoram Boy Runs Over Chicken And School Honours Him With Bravery Award - Sakshi

ఓ చేతిలో కోడిపిల్ల.. మరోచేతిలో 10 రూపాయలు పట్టుకుని డాక్టర్‌ అంకుల్‌ ఈ డబ్బులు తీసుకొని ఈ కోడిపిల్లను బతికించండి అంటూ ఆసుపత్రికి వెళ్లిన ఓ చిన్నోడి కథ సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేసిన విషయం తెలిసిందే. మిజోరాంలోని సైరంగ్‌కు చెందిన ఆ కుర్రాడు డెరెక్‌ లాల్‌చన్‌హిమా(6) .. ఓ కోడిపిల్ల తన సైకిల్‌ కింద పడటం చూసి చలించిపోయాడు. వెంటనే తన కిడ్డీబ్యాంకులో ఉన్న 10 రూపాయలు తీసుకుని ఆ కోడిపిల్లను ఆస్పత్రికి తీసుకువెళ్లాడు. ఓ చేతిలో కోడిపిల్ల.. మరోచేతిలో 10 రూపాయలు పట్టుకుని దీనంగా చూస్తున్నడెరక్‌ అమాయకత్వం చూసిన అక్కడి నర్స్‌ ఆ ఫొటో తీసి ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేసింది. ఇంకేముంది ఈ ఫొటో నెట్టింట హల్‌చల్‌ చేయడమే కాకుండా రోడ్డుపై నిర్లక్ష్యంగా వ్యవహరించే వారి కళ్లు తెరిపించింది. కళ్ల ముందే ప్రమాదాలు జరిగినా పట్టించుకోకుండా వెళ్లిపోయేవారికి బుద్ది చెప్పింది.

ఆ చిన్నోడి అమాయకంగా చేసిన పని ప్రతి ఒక్కరి మనసులను తాకేలా ఉండటంతో నెటిజన్లంతా ‘నీదెంత మంచి మనసురా చిన్నోడా!’ అంటూ ప్రశంసల జల్లు కురిపించారు. దీంతో ఈ బుడ్డోడు రాత్రికి రాత్రే సోషల్‌ మీడియా స్టార్‌ అయ్యాడు. అందరి మనసులను కదలించిన ఆ బుడ్డొడిని అతని స్కూల్‌ ఘనంగా సత్కరించింది. అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించిన యోధులను సత్కరించే శాలువాతో బుడ్డోని సత్కరించి, శౌర్య అవార్డును అందజేసింది. 

Read latest Social Media News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top