
తిరువనంతపురం : ‘బాహుబలి - ది కంక్లూజన్’ సినిమాలో ప్రభాస్ ఏనుగుపై ఎక్కే స్టంట్‌ను ప్రయత్నించిన ఓ వ్యక్తిని ఏనుగు విసిరికొట్టింది. ఈ ఘటనలో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. ఏనుగు తొండంతో బలంగా కొట్టడంతో అతను స్పృహ కోల్పోయాడు. స్థానికులు అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాలు దక్కాయి. కేరళ రాష్ట్రం ఇడుక్కిలోని తోడుపుజాలో సోమవారం ఈ ఘటన చోటు చేసుకుంది.
ఏనుగును మచ్చిక చేసుకునేందుకు తొలుత అరటిపళ్లను తినిపించిన వ్యక్తి.. మద్యం మత్తులో ఏనుగును రెండు సార్లు ముద్దు పెట్టుకున్నాడు. అనంతరం తొండంపై కాలు మోపి బాహుబలి సినిమాలోలా పైకి ఎక్కేందుకు యత్నించాడు. తొండంపై కాలు పెట్టడంతో కోపగించుకున్న ఏనుగు అతడిని విసిరికొట్టింది. దీంతో అంత దూరంలో ఎగిరిపడి స్పృహ కోల్పోయాడు.
అంతకుముందు తాను చేసేది మొత్తం మొబైల్‌లో చిత్రీకరించాలని ఓ యువకుడిని కోరడంతో జరిగిన ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
బాహుబలిలో ప్రభాస్‌లా చేద్దామని ట్రై చేస్తే..