‘ఫిఫా విజేత ఆఫ్రికా’ : బిగ్‌ బీపై విమర్శలు

Amitabh Bachchan Tweeted That Africa Won The World Cup On France Victory - Sakshi

ఫిఫా వరల్డ్‌ కప్‌ 2018 ఫైనల్‌లో అద్భుత ప్రదర్శనతో క్రొయేషియాను మట్టికరిపించి ఫ్రాన్స్‌ విశ్వవిజేతగా అవతరించిన విషయం తెలిసిందే. సుమారు రెండు దశాబ్దాల తర్వాత  ఫిఫా కప్‌ గెలిచిన ఫ్రాన్స్‌ జట్టుపై సోషల్‌ మీడియా వేదికగా ప్రశంసల జల్లు కురుస్తోంది. ఈ క్రమంలో.. ‘ టీ 2868- ఆఫ్రికా ప్రపంచ కప్‌-2018ని సొంతం చేసుకుంది’  అంటూ ట్వీట్‌ చేసి బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్‌ విమర్శల పాలవుతున్నారు. ప్రస్తుతం విజయం సాధించిన ఫ్రాన్స్‌ జట్టులో భాగస్వాములైన 16 మంది ఆటగాళ్లలో మొరాకో, అంగోలా వంటి పలు ఆఫ్రికన్‌ దేశాలకు చెందిన మూలాలు కలవారు ఉన్నారు. ఈ విషయాన్ని గుర్తు చేస్తూ అమితాబ్‌ చేసిన ట్వీట్‌పై ఆయన అభిమానులతో సహా పలువురు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

‘మీరంటే చాలా గౌరవం ఉంది. కానీ మీరిచ్చిన స్టేట్‌మెంట్‌ తప్పు. వాళ్ల(ఆటగాళ్ల) తాత ముత్తాతలు ఆఫ్రికాకు చెందిన వారు కావచ్చు. కానీ ప్రస్తుతం వారంతా ఫ్రెంచ్‌ పౌరులుగా గుర్తింపు పొందారు. శాస్త్రీయంగా చూస్తే మనం(భారతీయులం) కూడా ఆఫ్రికన్లమే. 3 లక్షల ఏళ్ల క్రితం నాటి హోమో సెపియన్స్‌ చరిత్రే అందుకు ఆధారం. కృతఙ్ఞతలు.’ అంటూ ఓ నెటిజన్‌ ట్వీట్‌ చేశారు. మరో నెటిజన్‌ స్పందిస్తూ... మీ నుంచి ఇలాంటి ట్వీట్‌ ఊహించలేదు. వలసవాదులను తమ దేశ పౌరులుగా ప్రపంచానికి సగౌరవంగా పరిచయం చేసిన ఫ్రాన్స్‌ను అభినందించాల్సిన అవసరం ఉంది. అంతేకానీ ఇలా ఆ జట్టును విడదీసి చూడటం బాగాలేదంటూ’ అమితాబ్‌ను విమర్శించారు.

కాగా ఫ్రాన్స్‌ జట్టును అభినందిస్తూ.. ‘పుదుచ్చేరి వాసులు(ఒకప్పటి ఫ్రెంచ్‌ పాలిత ప్రాంతం) ఫిఫా వరల్డ్‌ కప్‌ గెలిచారా...? అభినందనలు. క్రీడలే ఐక్యతకు చిహ్నం’ అంటూ పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌, మాజీ ఐపీఎస్‌ అధికారిణి కిరణ్‌ బేడీ ట్వీట్‌ చేశారు. ఈ ట్వీట్‌పై స్పందించిన ప్రముఖ జర్నలిస్టు శేఖర్‌ గుప్తా.. ‘చిన్న సవరణ మేడమ్‌. భారత భూభాగాన్ని ఫ్రాన్స్‌ ఆక్రమించు​కుంది. అంత మాత్రాన మీరన్నట్లు పుదుచ్చేరి ఫ్రెంచ్‌ పాలిత ప్రాంతం అయిపోదు కదా. పుదుచ్చేరిని ఫ్రెంచ్‌ పాలిత ప్రాంతం, గోవాను పోర్చుగీసు పాలిత ప్రాంతం అనడానికి ఎవరూ సాహసించలేరంటూ’ ట్వీట్‌ చేశారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top