విహంగ విహారం!

Migratory birds hangama - Sakshi

నగర శివార్లలో వలస పక్షుల కోలాహలం

వేలాది కిలోమీటర్ల దూరం నుంచి వలసలు

ఏసిరెడ్డి రంగారెడ్డి :  భాగ్యనగరానికి కొత్త అతిథులొస్తున్నాయి. సుదూర ప్రాంతాల నుంచి అలుపుసొలుపు లేకుండా ప్రయాణం చేసి నగరానికి చేరుకుంటున్నాయి. నగర శివారు ప్రాంతాల్లోని పర్యాటక ప్రదేశాలు, జలాశయాలు మొదలైన ప్రాంతాల్లో ప్రశాంతంగా సేదదీరుతున్నాయి. ఇంతకీ ఎవరీ అతిథులు అనుకుంటున్నారా..? ఏటా శీతాకాలంలో మనదేశానికి వలస వచ్చే సైబీరియన్‌ కొంగలు.. ఆఫ్రికా డేగలు.. రాజహంసలు.. మచ్చల బాతులు.. గోరింకలు ఇలాంటి వలస పక్షులే ఇవి.

రాజధాని నగరానికి చుట్టూ ఉన్న పర్యాటక ప్రాంతాలు, జలాశయాలు ఈ వలస విహంగాలకు ఆలవాలంగా మారుతున్నాయి. ఏటా అక్టోబర్‌–ఫిబ్రవరి మధ్యకాలంలో కనువిందు చేస్తున్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకు 200 జాతులు, ప్రజాతులకు చెందిన పక్షులు ఇక్కడకు చేరుకోవడం గమనార్హం. అయితే ఈ సంవత్సరం వీటి సంఖ్య 30–40 శాతం తగ్గుముఖం పట్టినట్లు జంతు ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సుదూర తీరాల నుంచి..
సైబీరియా, యూరప్, ఆఫ్రికా, మయన్మార్, అప్గానిస్తాన్, పాకిస్తాన్‌ తదితర ప్రాంతాల నుంచి హైదరాబాద్‌ నగరంతోపాటు.. సిటీకి ఆనుకుని ఉన్న పలు పర్యాటక ప్రాంతాలు, జలాశయాలకు ఏటా అక్టోబర్‌–ఫిబ్రవరి మధ్య కాలంలో సుమారు 200 జాతులు, ప్రజాతులకు చెందిన రెండు లక్షల పక్షుల వరకూ వలస రావడం పరిపాటే. గ్రేటర్‌తోపాటు.. సిటీకి ఆనుకుని ఉన్న పలు జలాశయాలు, పర్యాటక ప్రాంతాలు ఈ వలస పక్షులను అక్కున చేర్చుకుని వాటికి ఆహారం.. వసతి సమకూరుస్తున్నాయి.

ప్రధానంగా కేబీఆర్‌ పార్క్‌.. అనంతగిరి హిల్స్‌.. ఫాక్స్‌సాగర్‌(జీడిమెట్ల).. అమీన్‌పూర్‌ చెర్వు.. హిమాయత్‌సాగర్‌.. ఉస్మాన్‌సాగర్‌.. మంజీరా జలాశయాలకు ఇవి తరలివస్తున్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకు 200 జాతులకు చెందిన 70 శాతం పక్షులు ఇక్కడకు చేరుకోవడం విశేషం. ఆ ప్రాంతాలను సందర్శించే పర్యాటకులకు ఈ వలస పక్షులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.

వలస వచ్చే ప్రధాన పక్షి జాతులివే..
ప్రధానంగా కొంగలు, బాతులు, డేగలు, గుడ్లగూబలు, నీటి కోళ్లు తదితర జాతులు, ప్రజాతులకు చెందిన విభిన్న రకాల పక్షులు వలస వస్తుంటాయి. ఇందులో గుజరాత్‌ రాజహంసలు(గ్రేటర్‌ ఫ్లెమింగోలు), ఎర్రకాళ్ల కొంగలు, గూడబాతులు, రివర్‌టెర్న్, పిన్‌టెయిల్డ్‌ డక్, షౌలర్, గార్గినే టేల్, హ్యారియర్స్‌ డేగలు, ఫ్లైక్యాచెస్, గోరింక ప్రజాతికి చెందిన రోజీపాస్టర్స్, స్టార్‌లింక్స్‌ పక్షులు, బార్మెడోగూస్‌ బాతు, పైడ్‌ క్రస్టడ్‌ కకూ మొదలైనవి ప్రధానమైనవి.

తగ్గుతున్న వలస పక్షుల సంఖ్య..
సుదూర ప్రాంతాల నుంచి నగరానికి వలస వచ్చే రాజహంసలు, మచ్చల బాతులు, ఎర్రకాళ్ల కొంగలు, గోరింకలు, డేగలు తదితర పక్షుల జాడ ఏటేటా తగ్గుముఖం పడుతోంది. ఈ ఏడాది వీటి సంఖ్య 30–40 శాతం తగ్గుముఖం పట్టాయి. ఇటీవలి కాలంలో వీటి సహజ ఆవాసాలైన ఆయా జలాశయాలు, చెరువులు, కుంటలు కాలుష్య కాసారాలుగా మారడం, గుర్రపుడెక్క పేరుకుపోవడం, కబ్జాలకు గురవ్వడం, నగరీకరణ ప్రభావం, పర్యాటక, మానవ కార్యకలాపాలు పెరగడం, వాతావరణ, శబ్ద, వాయు కాలుష్యం మొదలైనవి వలస పక్షుల పాలిట శాపంగా మారుతోంది.

ఏటా ఈ సమయానికి హిమాయత్‌సాగర్‌కు సుమారు 200 వరకు గుజరాత్‌ రాజహంసలు వలస వస్తాయి. ఈసారి వీటి సంఖ్య 50కి మించలేదని జంతు ప్రేమికులు చెబుతున్నారు. విభిన్న రకాల గోరింక ప్రజాతులదీ ఇదే పరిస్థితి. ఇక ఆఫ్రికా ఖండం నుంచి ఐదు వేల కిలోమీటర్లు ప్రయాణించి వచ్చే బార్‌హెడ్‌ గూస్‌(బాతు) జాడ కూడా ఈసారి కనిపించడం లేదు. ఆఫ్రికా నుంచే వలస వచ్చే డేగ ప్రజాతికి చెందిన పైడ్‌ క్రస్టెడ్‌ కకూ అనే పక్షి జాడ కూడా లేదు.

వలసలకు ప్రధాన కారణాలివే..
ఆయా దేశాల్లో అధిక ఉష్ణోగ్రతలు, శీతల వాతావరణం, మంచు ప్రభావం వల్ల ఆహారం, వసతి కష్టతరంగా మారడం తదితర కారణాలతో వేలాది కిలోమీటర్ల దూరం నుంచి నగరానికి పక్షులు వలస వస్తుంటాయి. పక్షులు వలస వచ్చే మన పర్యాటక ప్రాంతాల్లో సమశీతోష్ణ వాతావరణం ఉండటం, ఈ ప్రాంతంలో ఉన్న జలాశయాల్లో నీటి నిల్వలు తగ్గి నీటిలో వృక్ష, జంతు ప్లవకాలు, చిన్న కీటకాలు వీటికి ఆహారంగా లభ్యమవుతున్నాయి. వీటిలో పక్షులకు అవసరమైన పోషక విలువలు మెండుగా ఉంటాయి. ఈ కారణాల రీత్యా పక్షులు వలస వస్తాయని నిపుణులు చెబుతున్నారు.

నగరీకరణ, కాలుష్యమే ప్రధాన కారణం
నగరీకరణ ప్రభావం, వాతావరణ, శబ్ద, వాయు కాలుష్యాలే వలస పక్షుల పాలిటశాపంగా మారుతున్నాయి. రెండేళ్లుగా అమీన్‌పూర్‌ చెర్వు, ఇక్రిశాట్, మంజీరా జలాశయాల వద్ద వలస పక్షుల మనుగడను పరిరక్షించేందుకు పలు చర్యలు చేపట్టడం సంతోషకరం. ఇదే స్ఫూర్తితో ఇతర ప్రాంతాల్లోనూ వలస పక్షులకు ఆహారం, వసతి లభ్యమయ్యేలా చూడాలి.
– డాక్టర్‌ శ్రీనివాసులు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్, జంతుశాస్త్ర విభాగం, ఓయూ

వలస పక్షులకు నిలయాలు ఈ ప్రాంతాలు..
     ప్రాంతం              వలస పక్షుల జాతులు
    కేబీఆర్‌ పార్క్‌                  24
    అనంతగిరి హిల్స్‌              37
    ఫాక్స్‌సాగర్‌(జీడిమెట్ల)        38
    అమీన్‌పూర్‌ చెరువు         42
    హిమాయత్‌సాగర్‌            52
    ఉస్మాన్‌సాగర్‌                 99
    మంజీరా                      153

వివిధ దేశాల నుంచి పక్షులు వలస వచ్చే దూరం
     దేశం            కిలోమీటర్లు
    ఆఫ్రికా            5,637
    సైబీరియా       5,118  
    యూరప్‌        6,721
    మయన్మార్‌    3,497
    అప్గానిస్తాన్‌     2,130
    పాకిస్తాన్‌        1,715
    గుజరాత్‌         1,377

వలస పక్షులను అక్కున చేర్చుకోవాలంటే..
సహజసిద్ధమైన జలాశయాలు, చెరువులు, కుంటలు కాలుష్యకాసారం కాకుండా కాపాడుకోవాలి.
♦  గృహ, వాణిజ్య, పారిశ్రామిక ప్రాంతాల నుంచి ఆయా జలాశయాల్లోకి మురుగునీరు చేరకుండా చూడాలి.
ఆయా జలాశయాల చుట్టూ పెద్ద ఎత్తున హరితహారం చేపట్టాలి. జలాశయాలు కబ్జాల పాలు కాకుండా చూడాలి.
మానవ, పర్యాటక కార్యకలాపాలను పక్షులు నివాసం ఉండే ప్రాంతాలకు చాలా దూరంలోనే పరిమితం చేయాలి.
♦  శబ్దకాలుష్యం పెరగకుండా చూడాలి. చైనీస్‌ మాంజాను నిషేధించాలి.

ఈ ప్రాంతాల్లో పక్షులు మాయం
పదేళ్ల క్రితం హుస్సేన్‌సాగర్‌కు విభిన్న రకాల బాతులు, వాటి ప్రజాతులకు చెందిన పక్షులు వలస వచ్చేవి. ఇప్పుడు ఈ జలాశయం కాలుష్య కాసారం కావడంతో వలస పక్షుల జాడ కనుమరుగైంది. ఇబ్రహీంపట్నం, సరూర్‌నగర్, కాప్రా, రామకృష్ణాపూర్, బోయిన్‌పల్లి చెరువులదీ ఇదే దుస్థితి. ఆయా జలాశయాల్లోకి సమీప గృహ, వాణిజ్య, పారిశ్రామికవాడల నుంచి కాలుష్య, మురుగు నీరు చేరి యుట్రిఫికేషన్‌ చర్య జరుగుతోంది. దీంతో జలాశయాల ఉపరితలంలో గుర్రపుడెక్క మందంగా పరుచుకుంటుంది. దీంతో పక్షి జాతులకు ఆహార సేకరణ కష్టతరమై.. వాటి మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోంది.

Read latest Rangareddy News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top