రూ.10లక్షలు దొరికితే ఏం చేశాడో తెలుసా? | Medical representative surrenders rs 10 lacs to police | Sakshi
Sakshi News home page

మెడికల్‌ రిప్‌ నిజాయితీ

Jan 21 2018 10:55 AM | Updated on Oct 9 2018 7:52 PM

Medical representative surrenders rs 10 lacs to police - Sakshi

ఒంగోలు క్రైం: ఓ మెడికల్‌ రిప్రజెంటేటివ్‌ బస్సులో ప్రయాణిస్తున్నాడు. పొరపాటున తన బ్యాగు అనుకొని మరో బ్యాగు తీసుకుని ఇంటికి వెళ్లిపోయాడు. అక్కడ బ్యాగు తనది కాదని గుర్తించాడు. బ్యాగు తీసి చూస్తే కళ్లు బైర్లు కమ్మాయి. రూ.10 లక్షల నగదుతో పాటు విలువైన వస్తువులు కనిపించాయి. రెండో ఆలోచన లేకుండా నేరుగా ఆర్టీసీ బస్టాండ్‌కు చేరుకున్నాడు. పోలీస్‌ ఔట్‌ పోస్ట్‌లో పోలీసులకు వివరించాడు. పోలీసులు ఒంగోలు డీఎస్పీ బి.శ్రీనివాసరావుకు సమాచారం అందించారు. ఆయన ఎస్పీ బి.సత్య ఏసుబాబు దృష్టికి తీసుకెళ్లారు. ఇది శనివారం ఒంగోలు నగరంలో జరిగిన సంఘటన.

వివరాలు.. దర్శి మండలం రాజంపల్లికి చెందిన వై.అనూషకు ఆమె తండ్రి రూ.10 లక్షలు, విలువైన వస్తువులు బ్యాగులో పెట్టి ఒంగోలులోని బాబాయ్‌కు ఇవ్వాలని ఆమెను పంపించాడు. అనూష దర్శి నుంచి పొదిలి వచ్చి పొదిలిలో ఒంగోలు వచ్చేందుకు ఆర్టీసీ బస్సు ఎక్కింది. బ్యాగును బస్సులోని లగేజీలు పెట్టే ప్రాంతంలో ఉంచి అనూష సీట్లో కూర్చుంది. అదే బస్సులో నగరంలోని రాజీవ్‌ నగర్‌లో నివాసం ఉంటున్న మెడికల్‌ రిప్రజెంటేటివ్‌ మారుతి వినయ్‌కుమార్‌ కూడా పొదిలి నుంచి ఒంగోలు వస్తున్నాడు. దిగే సమయంలో అతని బ్యాగు అనుకొని పొరపాటున అనూష బ్యాగు తీసుకెళ్లాడు. ఇంటికెళ్లి బ్యాగు చూసిన తర్వాత తనది కాదని నిర్ధారించుకుని పోలీసులకు సమాచారం అందించాడు.

అప్రమత్తమైన పోలీసులు
 రూ.10 లక్షల నగదు ఉన్న బ్యాగు మాయమైందని గుర్తించిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. డీఎస్పీ బి.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో తాలూకా సీఐ గంగా వెంకటేశ్వర్లు తమ సిబ్బందిని రంగంలోకి దించారు. ముగ్గురు ఎస్‌ఐలతో ప్రత్యేకంగా మూడు బృందాలను ఏర్పాటు చేశారు. అనూష చెప్పిన ఆధారాల ప్రకారం పోలీసులు అన్వేషణ ప్రారంభించారు. ఈ తంతు దాదాపు గంటపాటు కొనసాగింది. ఇంతలోనే డీస్పీకి ఫోన్‌ వచ్చింది. నగదుతో కూడిన బ్యాగుతో మెడికల్‌ రిప్రజెంటేటివ్‌ మారుతి వినయ్‌కుమార్‌ ఆర్టీసీ ఔట్‌ పోస్ట్‌కు వచ్చాడని. పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. అటు అనూషను, నగదు బ్యాగు తీసుకొచ్చిన మారుతి వినయ్‌కుమార్‌ను తీసుకొని ఎస్పీ బి.సత్య ఏసుబాబు వద్దకు తీసుకెళ్లారు. ఎస్పీ తన సమక్షంలోనే బ్యాగును అనూష, ఆమె బంధువులకు అప్పగించారు. మారుతి వినయ్‌కుమార్‌కు పుష్ప గుచ్ఛం ఇచ్చి మరీ ఎస్పీ సత్య ఏసుబాబు ప్రత్యేకంగా అభినందించారు. అంతేకాకుండా రూ.5 వేల నగదు ప్రోత్సాహకాన్ని కూడా అందించారు. డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐ వెంకటేశ్వర్లు, ఎస్‌ఐలు డి.రాజారావు, మేడా శ్రీనివాసరావు, ఎన్‌సీ ప్రసాద్‌తో పాటు ఐడీ  పార్టీ సిబ్బంది మౌలాలీ, శివను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement