‘చంద్రబాబు, మోదీ ప్రజలను తప్పుదారి పట్టించారు’ | Sakshi
Sakshi News home page

Published Thu, Dec 27 2018 12:50 PM

YSRCP Leader Parthasarathy Speech At Vanchana Pai Garjana Deeksha At Delhi - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: విభజన వల్ల అన్నివిధాలా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడి అయిన ప్రత్యేక హోదా సాధన కోసం ప్రతిపక్ష వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ చేపట్టిన ‘వంచనపై గర్జన’ దీక్ష ఢిల్లీలో విజయవంతంగా కొనసాగుతుంది. ఏపీకి ప్రత్యేకహోదా కోసం కేంద్రంపై ఒత్తిడి పెంచడానికి వైఎస్సార్‌ సీపీ చేపట్టిన దీక్షకు పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. దీక్షలో ప్రసంగిస్తున్న వైఎస్సార్‌ సీపీ నాయకులు ఏపీకి జరుగుతున్న అన్యాయంపై గళమెత్తుతున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో యూ టర్న్‌ తీసుకున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వైఖరిపై నేతలు మండిపడుతున్నారు. నాలుగున్నరేళ్లుగా ఏపీకి ప్రత్యేక హోదా సాధించడానికి పోరాడుతున్నది వైఎస్సార్‌ సీపీ మాత్రమేనని నేతలు గుర్తుచేస్తున్నారు.

చంద్రబాబు, మోదీ ప్రజలను తప్పుదారి పట్టించారు
వైఎస్సార్‌ సీపీ నేత పార్థసారథి మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ, చంద్రబాబు నాయుడు ప్రజలను తప్పుదోవ పట్టించారని మండిపడ్డారు. హోదా తేలేని చేతగాని దద్దమ్మ చంద్రబాబేనని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు విడుదల చేస్తున్న శ్వేతపత్రాలన్నీ ఓ బోగస్‌ అని తెలిపారు. విభజన నష్టాలపై ఇప్పటివరకు చంద్రబాబు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. కులాలు, మతాలను అవమానించింది చంద్రబబాబేనని వ్యాఖ్యానించారు. 

నాలుగేళ్లలో చంద్రబాబు ఏం సాధించారో ప్రజలకు సమాధానం చెప్పాలని నిలదీశారు. చంద్రబాబు రైతుల ఆదాయం రెట్టింపు అయిందంటే ఎవరు నమ్మే పరిస్థితి లేదన్నారు. గిట్టుబాటు ధరలు లేక రైతులు అల్లాడుతున్నారని తెలిపారు. మైనార్టీల, అర్చకుల సమస్యలు ఇప్పటికీ తీరలేదన్నారు. చంద్రబాబు ఏం చేసినా ఎన్నికల కోసమే చేస్తారని విమర్శించారు. సంక్షేమ రాజ్యం రావాలంటే కేవలం వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌తోనే సాధ్యమని అన్నారు.
 

Advertisement
Advertisement