చంద్రబాబు రైతు వ్యతిరేకి

ysrcp leader parthasarathy fires on cm chandrababu naidu - Sakshi

పోలవరం ప్రాజెక్టును ప్రహసనంగా  మార్చారు

చంద్రబాబు నటనకు నంది అవార్డు ఇవ్వాలి

నకిలీ విత్తనాలు, మందులకు నిలయంగా ఏపీ

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పార్థసారథి

విజయవాడ సిటీ: పోలీసులతో రైతుల్ని కాల్చి చంపించిన ఘనచరిత్ర ఉన్న చంద్రబాబుది ముమ్మాటికి రైతు వ్యతిరేక ప్రభుత్వమని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొలుసు పార్థసారథి ధ్వజమెత్తారు. నకిలీ మందుల కారణంగా నష్టపోయి పరిహారం కోసం ఉద్యమించిన రైతులను ఆత్మహత్యాయత్నం చేసుకునే విధంగా చేశారని మండిపడ్డారు. నకిలీ విత్తనాలకు ఆంధ్రప్రదేశ్‌ నిలయంగా మారిందని దుయ్యబట్టారు. విజయవాడ వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో ఆయన గురువారం విలేకరులతో మాట్లాడారు. కొన్ని కంపెనీలు నకిలీ విత్తనాల కారణంగా రైతులు కోట్లాది రూపాయలు నష్టపోయారని చెప్పారు. ప్రభుత్వం దృష్టికి తమ సమస్యను తీసుకెళ్తే పరిష్కారమవుతుందేమోనని ఆశించి అసెంబ్లీకి బయలు దేరిన రైతులను ఆత్మహత్య చేసుకునే విధంగా చంద్రబాబు చేశారని విమర్శించారు.

నష్ట పరిహారం కోసం రైతులు వస్తే చంద్రబాబు ఎందుకు భయపడ్డారో  చెప్పాలని డిమాండ్‌ చేశారు. రైతు బిడ్డనని నోటి నుంచి చెప్పుకోవడం కాదు చంద్రబాబూ... ఆలోచనా విధానాలూ రైతులకు మేలు చేసేలా ఉండాలని సూచించారు. రైతులను చంపిన నువ్వు రైతు బిడ్డవు ఎలా అవుతావని ఎద్దేవా చేశారు. నష్టపోయిన  రైతులకు మేలు చేయాల్సిన ప్రభుత్వం వారిపై అక్రమంగా కేసులు బనాయించడం దారుణమని మండిపడ్డారు. రైతులకు నిరసనలు తెలిపే హక్కులేదా? అని ప్రశ్నించారు. జిల్లాలో ఏం జరుగుతోందో తెలుసుకోలేని కృష్ణా జిల్లా మంత్రులు దద్దమ్మల్లా తయారయ్యారని, పోలీసులను వాడుకుంటూ రైతులను వేధిస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. నష్టపోయిన రైతులకు ఎప్పటిలోగా నష్టపరిహారం చెల్లిస్తారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. 

చంద్రబాబు నటనకు నంది అవార్డు...
పోలవరం ప్రాజెక్టును సీఎం చంద్రబాబుప్రహసనంగా మార్చేశారని పార్థసారథి ధ్వజమెత్తారు. పోలవరంపై అసెంబ్లీలో జరిగిన చర్చలో చంద్రబాబు నటించిన నటనకు నంది అవార్డు ఇవ్వాలని ఎద్దేవా చేశారు.  2018లో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని చంద్రబాబు గతంలో అసెంబ్లీ సాక్షిగా చెప్పిన విషయాన్ని గుర్తుచేశారు. ఇప్పుడేమో  కేంద్రం సహకరిస్తేనే పోలవరం పూర్తి చేస్తానని కొత్త పల్లవి అందుకున్నారని దుయ్యబట్టారు. పోలవరం పూర్తి చేయడానికి కేంద్రం సహకరించకపోతే ఎన్డీఏలో ఎందుకు కొనసాగుతున్నారని సూటిగా ప్రశ్నించారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top