ఏపీలో జగన్‌ ప్రభంజనం

YSRCP 20 seats won in the Lok Sabha elections - Sakshi

లోక్‌సభ ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి 20, టీడీపీకి 5 స్థానాలు

తెలంగాణలో కాంగ్రెస్‌ కూటమికి 8, టీఆర్‌ఎస్‌కు 7 సీట్లు

కేంద్రంలో మెజారిటీకి స్వల్ప దూరంలో ఎన్డీయే

రిపబ్లిక్‌–సీ వోటర్‌ సర్వే

న్యూఢిల్లీ: రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్సీపీ ప్రభంజనం సృష్టించే అవకాశాలు మరింత మెరుగయ్యాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే ఏపీలోని మొత్తం 25 సీట్లలో వైఎస్సార్సీపీ 20 స్థానాలు, అధికార టీడీపీ 5 స్థానాలు కైవసం చేసుకుంటాయని రిపబ్లిక్‌–సీ వోటర్‌ సర్వే తేల్చింది. తెలంగాణలో మొత్తం 17 స్థానాల్లో కాంగ్రెస్‌ నేతృత్వంలోని మహాకూటమి  8, టీఆర్‌ఎస్‌ 7, బీజేపీ 1, మజ్లిస్‌ 1 సీటు చొప్పున గెలుస్తాయని పేర్కొంది. డిసెంబర్‌లో జరగబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అంచనాలు భిన్నంగా ఉండొచ్చని తెలిపింది.

‘నేషనల్‌ అప్రూవల్‌ రేటింగ్స్‌’ పేరిట తాజా అంచనాల్ని గురువారం విడుదల చేసింది. కేంద్రంలో ఎన్డీయే కూటమి సాధారణ మెజారిటీకి చేరువగా వస్తుందని సర్వే తెలిపింది. కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ ప్రదర్శన మెరుగవుతుందని, ఆ కూటమి వంద సీట్లకు పైగా గెలుచుకుంటుందని తెలిపింది. వరదల్లో మునిగిన కేరళకు తక్కువ సాయం చేశారనే ఆరోపణల నేపథ్యంలో బీజేపీ అక్కడ ఖాతా తెరవడం కష్టమేనని, పార్లమెంట్‌ రెండు సభల్లో మెజారిటీ సాధించేందుకు వ్యూహాత్మకంగా కీలకమైన యూపీలో బీజేపీకి, అఖిలేశ్, మాయావతిల కూటమితో ఎదురుదెబ్బ తగులుతుందని హెచ్చరించింది.  

సర్వే విశేషాలు..
2014 లోక్‌సభ ఎన్నికల్లో 8 సీట్లు గెలుచుకున్న వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి పార్టీ వైఎస్సార్సీపీ ఈసారి ఆ సంఖ్యను 20కి పెంచుకుంటుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ క్రమంగా ప్రభ కోల్పోతోంది. ఆ పార్టీ ఈసారి 5 సీట్లకే పరిమితమవుతుంది. 2014లో రెండు స్థానాలు దక్కించుకున్న బీజేపీకి ఈసారి రిక్తహస్తమే. ఓట్లశాతం పరంగా చూస్తే వైఎస్సార్సీపీకి 41.2 శాతం, టీడీపీకి 31.2 శాతం, బీజేపీకి 11.3 శాతం, కాంగ్రెస్‌కు 9.3 శాతం ఓట్లు దక్కుతాయి. తెలంగాణలో సీఎం కె.చంద్రశేఖర రావు నాయకత్వంలోని టీఆర్‌ఎస్‌ 7 సీట్లు (30.40% ఓట్లు) , కాంగ్రెస్‌ నేతృత్వంలోని మహాకూటమి 8 సీట్లు(32.2%), బీజేపీ 1 సీటు(19%), ఏఐఎంఐఎం 1 స్థానం( 3.9%) గెలుచుకుంటాయి.

ఇతరులకు 163 సీట్లు..
దేశవ్యాప్తంగా మొత్తం 543 లోక్‌సభ స్థానాల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి 261 సీట్లు సాధించి సాధారణ మెజారిటీ(272 సీట్లు)కి కొద్ది దూరంలో నిలుస్తుంది. గత ఎన్నికల్లో బీజేపీ ఒక్కటే సాధించిన సీట్ల(282) కన్నా ఇది 21 స్థానాలు తక్కువ కావడం గమనార్హం. కాంగ్రెస్‌ నాయకత్వంలోని యూపీఏ కూడా తన సీట్లను గణనీయంగా పెంచుకుని 119 స్థానాలు కైవసం చేసుకుంటుంది. అనూహ్యంగా 163 సీట్లు గెలుచుకునే ఇతరులే కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటులో నిర్ణయాత్మక పాత్ర పోషిస్తారు.  కేంద్రంలో అధికారం దక్కాలంటే అత్యంత కీలకమైన ఉత్తరప్రదేశ్‌లో అఖిలేశ్‌–మాయావతిల కూటిమిదే హవా. ఆ 2 పార్టీలు కలసి 44 సీట్లు గెలుచుకుంటాయి. గతంలో 71 సీట్లు కైవసం చేసుకున్న బీజేపీ ఈసారి 31 సీట్లకు మాత్రమే పరిమితంకానుంది.      ఢిల్లీలోని అన్ని స్థానాల్ని బీజేపీయే గెలుచుకుంటుంది.

రాజస్తాన్‌ కోట కాంగ్రెస్‌దే!
జైపూర్‌: ఐదేళ్ల విరామం తర్వాత రాజస్తాన్‌లో మళ్లీ కాంగ్రెస్‌ ప్రభుత్వం కొలువుదీరబోతోందని టైమ్స్‌ నౌ–సీఎన్‌ఎక్స్‌ సర్వే అంచనా వేసింది. 2013 ఎన్నికల్లో 80 శాతానికి పైగా సీట్లు గెలిచి భారీ విజయాన్ని నమోదు చేసిన బీజేపీకి ఈసారి అపజయమే ఎదురవుతుందంది. రాజస్తాన్‌ శాసనసభలో మొత్తం 200 స్థానాలుండగా గత ఎన్నికల్లో బీజేపీ ఏకంగా 163 చోట్ల విజయ దుందుభి మోగించింది. కాంగ్రెస్‌ కేవలం 21 స్థానాల్లో గెలిచి ఘోర అపజయం పాలైంది. వచ్చే నెలలో జరిగే ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్‌ 110–120 మధ్య సీట్లు గెలవనుందనీ, బీజేపీకి 70 నుంచి 80 సీట్లే వస్తాయని టైమ్స్‌ నౌ–సీఎన్‌ఎక్స్‌ సర్వే అంటోంది. అటు రాజస్తాన్‌లో కాంగ్రెస్‌తో పొత్తు ఉండదని ఇప్పటికే తేల్చి చెప్పిన మాయావతి పార్టీ బీఎస్పీకి గరిష్టంగా మూడు సీట్లు మాత్రమే రావొచ్చని తెలిపింది. మొత్తం 67 నియోజకవర్గాల్లో 8,040 మంది అభిప్రాయాలను సర్వే కోసం సేకరించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top