పవన్‌ సినిమా తక్కువ.. ఇంటర్వెల్‌ ఎక్కువ : వైఎస్‌ జగన్‌ | YS Jagan Slams Pawan Kalyan Over Ap Special Status | Sakshi
Sakshi News home page

పవన్‌ సినిమా తక్కువ.. ఇంటర్వెల్‌ ఎక్కువ : వైఎస్‌ జగన్‌

Apr 6 2018 9:20 PM | Updated on Mar 23 2019 9:10 PM

YS Jagan Slams Pawan Kalyan Over Ap Special Status - Sakshi

సాక్షి, గుంటూరు : గత నాలుగేళ్లుగా రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నా తెలుగుదేశం పార్టీ మిత్రపక్షం, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఏం చేశారని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రశ్నించారు. నాలుగేళ్లుగా వైఎస్సార్‌ సీపీ ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నా, చంద్రబాబు నాయుడు బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని వైఎస్‌ జగన్‌ మండిపడ్డారు. తాము హోదాతో వచ్చే ప్రయోజనాలను ప్రజలందరకీ వివరించి చైతన్య పరుస్తుంటే.. జనసేన అధినేత నాలుగేళ్లుగా ఏం చేశారని వైఎస్‌ జగన్‌ నిలదీశారు.

నాలుగేళ్లపాటు యువభేరీలు, సదస్సులు, దీక్షలు చేపట్టి హోదా ప్రాముఖ్యతను ప్రజలందరికీ తెలియచేశామని వైఎస్‌ జగన్‌ అన్నారు. పవన్‌ కల్యాణ్‌ ప్రత్యేక హోదా కోసం ఏకార్యక్రమాలు చేపట్టారని ప్రశ్నించారు. నాలుగేళ్లపాటు ఏ ధర్నాలు, దీక్షలు, కార్యక్రమాలు చేపట్టారని నిలదీశారు. అప్పుడప్పుడు ట్వీట్‌ చేస్తారని అదీ లేకపోతే ప్రెస్‌మీట్‌లు పె‍ట్టి చంద్రబాబుకు అనుకూలంగా మాట్లాడతారని విమర్శించారు. సినిమా తక్కువ.. ఇంటర్వెల్‌ ఎక్కువ అన్న చందంగా పవన్‌ తీరు ఉందని వైఎస్‌ జగన్‌ ఎద్దేవా చేశారు. 2014లో చంద్రబాబు, బీజేపీతో జతకట్టిన పవన్‌, వారికి ఓటు వేయమని అడగలేదా అంటూ ప్రతిపక్షనేత నిలదీశారు. నాలుగేళ్ల తర్వాత ఉనికి కోసం బీజేపీ, చంద్రబాబు రాష్ట్రాన్ని ముంచారని అంటున్నారని, అదే మేధావి పవన్‌ తీరు అని మండిపడ్డారు.

ప్రత్యేక  హోదా బదులు, ప్రత్యేక ప్యాకేజీ ఇస్తున్నామని జైట్లీ ప్రకటన చేసినప్పుడు పవన్‌ కల్యాణ్‌ ఏమయ్యారని, ఆ రోజే చంద్రబాబును ఎందుకు నిలదీయలేదని వైఎస్‌ జగన్‌ ప్రశ్నించారు. ఇన్నాళ్లు పార్టనర్‌ చంద్రబాబుకు సపోర్టు చేసిన పవన్‌ ఇప్పుడు ఏవిధంగా ప్రత్యేక హోదాపై మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. ప్రత్యేక హోదాపై తమ వైఖరి నాలుగేళ్లుగా ఏనాడు మారలేదని వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు. రాజీనామాలే తమ ఆఖరి అస్త్రమని చెప్పామని.. చెప్పినట్లుగానే పార్లమెంట్‌ సభ్యులతో రాజీనామాలు చేయించామని స్పష్టం చేశారు. ఎంపీలు రాజీనామా చేస్తే తనపై కేసులు వస్తే ఎవరు పోరాడతారనే భయం చంద్రబాబుకు పట్టుకుందని, అందుకే రాజీనామాలు చేయడం లేదని ప్రతిపక్ష నేత విమర్శించారు. ప్రత్యేక హోదా కోసం పదవులను తృణప్రాయంగా భావించి రాజీనామాలు చేసిన వైఎస్సార్‌ సీపీ ఎంపీలకు వైఎస్‌ జగన్‌ సెల్యూట్‌ చేస్తున్నానని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement