కుట్ర కేసులు..ఆందోళన కేసులు!

Yellow Media Fake Campaign On YS Jagan - Sakshi

వీటిపైనే ఎల్లో సిండికేట్‌ రాద్ధాంతం

వైఎస్‌ జగన్‌పై పిచ్చి రాతలు

కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కై పెట్టిన కేసులు మళ్లీ ప్రస్తావన 

ఎన్నికల్లో ఓటమి భయంతో దిగజారుడు రాజకీయం 

వాస్తవాలకు మసిపూసి ప్రజలను మోసగించాలనే కుట్ర 

ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రజల కోసం నిలబడినందుకే 18 అక్రమ కేసులు 

ప్రజల కోసం ఉద్యమాలు చేసినందుకు చంద్రబాబు సర్కారు పెట్టిన కేసులు 13 

కానీ జగన్‌పై 31 కేసులు అంటూ టీడీపీ సిండికేట్‌ దుష్ప్రచారం  

వైఎస్సార్‌సీపీ అధినేత వ్యక్తిత్వ హననానికి పన్నాగం 

‘స్టే’ల చంద్రబాబుపై నోరెత్తని టీడీపీ అనుకూల మీడియా

సాక్షి, అమరావతి: రానున్న ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ప్రభంజనం ఖాయం అని జాతీయ సర్వేలు స్పష్టం చేస్తుండడంతో బెంబేలెత్తుతున్న టీడీపీ సిండికేట్‌ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతోంది... జగన్‌ వస్తే అంధకారమే అంటూ దుష్ప్రచారం చేస్తోంది... జగన్‌కు ఈసారి అవకాశం ఇద్దామని ప్రజలు ఇప్పటికే నిశ్చయించుకున్నారన్నది తేటతెల్లమైంది... అందుకే ఎల్లో మీడియా నానా యాగీ చేస్తోంది. జగన్‌పై 31 కేసులు అంటూ మళ్లీ విషం చిమ్ముతోంది. 

ఇంతకీ అసలు వాస్తవం ఏమిటంటే... 
పచ్చ ముఠా చెబుతున్న 31 కేసుల్లో 18 కేసులు కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కై పెట్టిన అక్రమ కేసులు అన్నది నిఖార్సైన నిజం. ప్రజలకు ఇచ్చిన మాట కోసం జగన్‌ కాంగ్రెస్‌ను వీడటంతోనే టీడీపీతో కుమ్మక్కై కుట్రపూరితంగా పెట్టిన కేసులు కాగా మిగిలిన 13 కేసులు ప్రతిపక్ష నేతగా జగన్‌ ప్రజల కోసం ఆందోళనలు, ఉద్యమాలు చేసినందుకు టీడీపీ ప్రభుత్వం పెట్టిన కక్షసాధింపు కేసులు. అయితే ఈ వాస్తవాలకు మసి పూసేసి దుష్ప్రచారంతో ప్రజలను మోసగించాలన్నదే టీడీపీ సిండికేట్, ఎల్లో మీడియా ప్రధాన కుట్ర.  

మాటకు కట్టుబడినందుకు 18 అక్రమ కేసులు 
తీవ్ర ప్రజావ్యతిరేకత ఎదుర్కొంటున్న చంద్రబాబు ప్రభుత్వం మరోసారి కుట్రలకు తెర తీస్తోంది. ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేయడం ద్వారా ఆయన వ్యక్తిత్వ హననానికి బరితెగిస్తోంది. జగన్‌పై 31 కేసులు అంటూ ఎల్లో మీడియా నానా యాగీ చేస్తోంది. పులివెందుల అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసేందుకు నామినేషన్‌ దాఖలు చేసిన సందర్భంగా సమర్పించిన అఫిడవిట్‌లో నిబంధనల ప్రకారం వైఎస్‌ జగన్‌ తనపై ఉన్న పెండింగ్‌ కేసులను వివరంగా పేర్కొన్నారు. వాటికి టీడీపీ ఎల్లో గ్యాంగ్‌ వక్రభాష్యం చెబుతూ ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు కుట్ర పన్నుతోంది. ఆ 31 కేసుల్లో 18 కేసులు కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కై పెట్టిన అక్రమ కేసులేనన్నది వాస్తవం. వైఎస్‌ రాజశేఖరరెడ్డి జీవించి ఉండగా వైఎస్‌ జగన్‌పై ఒక్క కేసూ లేదు. ఆ మహానేత మరణానంతరం వైఎస్‌ జగన్‌ ఏడాదిపాటు కాంగ్రెస్‌లో ఉన్నారు.

అప్పుడు కూడా ఆయనపై ఎలాంటి కేసులు లేవు. కాగా తన తండ్రి హఠాన్మరణాన్ని తట్టుకోలేక ప్రాణాలు విడిచిన అభిమానుల వద్దకు వస్తానన్న మాటకు వైఎస్‌ జగన్‌ కట్టుబడటం ఆనాటి కాంగ్రెస్‌ అధిష్టానానికి నచ్చలేదు. దాంతో ఇచ్చిన మాట కోసం ఆయన  కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసి ప్రజల్లోకి వెళ్లారు. దీనిపై కక్షగట్టిన కాంగ్రెస్‌ అధిష్టానం వైఎస్‌ జగన్‌పై అక్రమంగా కేసులు బనాయించింది. అప్పటికే రెండుసార్లు ఓడిపోయి రాజకీయంగా కుదేలైపోయిన చంద్రబాబు కాంగెస్ర్‌ అధిష్టానంతో కుమ్మక్కయ్యారు. వైఎస్‌ జగన్‌ ప్రజానేతగా ఆవిర్భవిస్తుండటంతో బెంబేలెత్తిన టీడీపీ అప్పటికే కాంగ్రెస్‌ వేసిన పిటిషన్‌లో ఇంప్లీడ్‌ అయి అక్రమ కేసులు పెట్టించింది. ఆ విధంగా సీబీఐ 11 కేసులు, ఈడీ 7 కేసులు కలిపి మొత్తం 18 అక్రమ కేసులు బనాయించారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2012 ఉప ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీని దెబ్బతీసేందుకు వైఎస్‌ జగన్‌ను ఆ కేసుల పేరుతో అరెస్టు చేశారు. సహజ న్యాయ సూత్రాల ప్రకారం 3 నెలల్లో బెయిల్‌ రావాల్సి ఉండగా దాన్ని కూడా అడ్డుకుని 16 నెలలు అక్రమంగా జైల్లో ఉంచారు. కానీ వైఎస్‌ జగన్‌ వెరవకుండా ప్రజల పక్షాన నిలబడ్డారు. జగన్‌పై పెట్టిన అక్రమ కేసుల్లో ఈ తొమ్మిదేళ్లలో ఇంతవరకు ఒక్కటి కూడా నిరూపించలేకపోయారు. ఆ కేసుల్లో పేర్కొన్నవన్నీ కేవలం అభియోగాలు మాత్రమే. ఆ కేసులపై న్యాయస్థానాల తీర్పు ఇంకా వెలువడాల్సి ఉంది. ఇప్పటికే ఈ కేసుల్లో పాత్ర లేదంటూ కొందరు ఉన్నతాధికారులను న్యాయస్థానాలు విముక్తులను చేయడం కూడా గమనార్హం. వాస్తవాలు ఇలా ఉంటే.. జగన్‌పై కేసులు అని తన అనుకూల మీడియాతో రాద్ధాంతం చేయిస్తూ, తన ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు చంద్రబాబు పన్నాగం పన్నారు.   

ప్రజా పోరాటాలు చేసినందుకు 13 కేసులు  
వైఎస్‌ జగన్‌పై ఉన్న మిగిలిన 13 కేసులు కూడా ఆయన ప్రజల కోసం చేసిన ఉద్యమాలను అణచివేసేందుకు టీడీపీ, కాంగ్రెస్‌ ప్రభుత్వాలు పెట్టినవే కావడం గమనార్హం. బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నేతగా జగన్‌ ప్రజల పక్షాన నిలబడ్డారు. టీడీపీ ప్రభుత్వ విచ్చలవిడి అవినీతిని, వైఫల్యాలను ఎప్పటికప్పుడు నిలదీస్తూ ఉద్యమాలు చేశారు. ఆ ఉద్యమాలను అణచివేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం ఆయనపై కేసులు పెట్టింది. 

దివాకర్‌ ట్రావెల్స్‌ దందాను ప్రశ్నించినందుకు..  
నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి కుటుంబానికి చెందిన దివాకర్‌ ట్రావెల్స్‌ బస్సు 2017, ఫిబ్రవరి 28న ప్రమాదానికి గురి కావడంతో 11మంది దుర్మరణం చెందారు. జగన్‌ హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ట్రావెల్స్‌ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్‌తో ఆందోళనకు సిద్ధమయ్యారు. దాంతో విధినిర్వహణలో ఉన్న అధికారులను అడ్డుకున్నారనే పేరిట ప్రభుత్వం అక్రమ కేసు బనాయించింది. 

సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొన్నందుకు.. 
2013–14లో సమైక్యాంధ్ర ఉద్యమంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చురుగ్గా పాల్గొన్నారు. ఆ సందర్భంగా అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం రెండు కేసులు నమోదు చేసింది. 2014 ఎన్నికల సందర్భంగా నల్గొండ జిల్లా కోదాడలో నిర్వహించిన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్‌ కాన్వాయ్‌లో పరిమితికి మించి వాహనాలు ఉన్నాయని పోలీసులు కేసు పెట్టారు. ఈ విధంగా వైఎస్‌ జగన్‌పై నమోదు చేసిన 13 కేసులు కూడా ఆయన ప్రజల తరఫున పోరాడినందుకు ప్రభుత్వాలు కక్షగట్టి పెట్టినవే. వాటిలో ఒక్కదానిలో కూడా ఆయన దోషంగానీ స్వార్థంగానీ లేవు. ఆ కేసులను కోర్టులు విచారణకు స్వీకరించ లేదు కూడా. 

ఉద్యమ కేసులు సాధారణం 
ప్రజా జీవితంలో ఉన్న నాయకులు ఉద్యమాలు చేసినప్పుడు ప్రభుత్వం కేసులు పెట్టడం సాధారణం. చంద్రబాబు తొలిసారి సీఎంగా ఉన్నప్పుడు విద్యుత్తు చార్జీల పెంపునకు నిరసనగా చేపట్టిన భారీ ప్రజాందోళనను అణచివేయడానికి కాంగ్రెస్, వామపక్ష నేతలపై కేసులు పెట్టారు. కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వంలో శ్రీకాకుళం జిల్లాలో థర్మల్‌ ప్లాంట్లకు వ్యతిరేకంగా ఉద్యమించినప్పుడు వైఎస్సార్‌సీపీ, వామపక్ష నేతలు, ప్రజా సంఘాల నేతలపై కేసులు పెట్టారు. 2014 తరువాత ప్రత్యేక హోదా సాధన కోసం ఉద్యమాలు నిర్వహించిన విపక్ష నేతలపై కూడా టీడీపీ ప్రభుత్వం కేసులు పెట్టింది. ప్రజల పక్షాన పోరాటాలు చేసినందుకు ఆనాటి కాంగ్రెస్, ప్రస్తుత టీడీపీ ప్రభుత్వాలు తనపై పెట్టిన కేసులకు జగన్‌ ఏమాత్రం వెరవకుండా ప్రజాజీవితంలో నిబద్ధతతో కొనసాగుతున్నారు.  

వైఎస్సార్‌సీపీ ప్రభంజనంతో బెంబేలు 
రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ ప్రభంజనం సృష్టించనుందని జాతీయ చానళ్ల సర్వేల్లో తేలడం, ఐదేళ్లలో తమ ప్రభుత్వ అవినీతి, ఆరాచక పాలనపై ప్రజలు ఆగ్రహావేశాలతో ఉన్నారని అవగతం కావడంతో చంద్రబాబు బెంబేలెత్తిపోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చడానికి తన పార్టనర్‌ పవన్‌ కల్యాణ్‌తో కలసి చేసిన రాజకీయ కుతంత్రం బట్టబయలైంది. కేసీఆర్‌ను బూచిగా చూపిస్తూ ప్రజల  భావోద్వేగాలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధిపొందాలన్న పాచికా పారడం లేదు. ఇలా అన్ని ఆశలు ఆవిరవుతుండటంతో చంద్రబాబు తనకు అలవాటైన రీతిలో ద్విముఖ రాజకీయ కుట్రకు తెగిస్తున్నారు. ఓ వైపు టీడీపీ రౌడీమూకల ద్వారా రాష్ట్రంలో అలజడులు సృష్టించి విపక్ష వైఎస్సార్‌సీపీపై అభాండాలు మోపేందుకు ఇప్పటికే స్కెచ్‌ వేశారు. మరోవైపు తన అనుకూల మీడియా సహకారంతో కుట్రకు పాల్పడుతున్నా రు. చంద్రబాబు రాజకీయ కుతంత్రం లో భాగంగానే  ఎల్లో మీడియా పెద్ద ఎత్తున దుష్ప్రచారానికి తెరతీసింది. పోలింగ్‌ తేదీ వరకు ఆ దుష్ప్రచారాన్ని తమ అనుకూల పత్రికల్లో రోజూ పేజీలకు పేజీలు ప్రచురింపజేయడం, టీవీ చానళ్లలో రోజూ గంటల తరబడి నానా యాగీ చేయించడం, టీడీపీ సోషల్‌ మీడియా విభాగం ద్వారా విషం కక్కించడం... ఇలా రాజకీయ రాద్ధాంతం చేస్తూ  ప్రజల్ని మోసగించడానికి చంద్రబాబు పక్కా పన్నాగం పన్నారు. ఆయన పార్టనర్‌ పవన్‌ కల్యాణ్‌ కూడా తానా అంటే తందాన అంటూ ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టేందుకు బరితెగిస్తున్నారు. 

17 అవినీతి కేసుల్లో స్టే తెచ్చుకుని .. ‘ఓటుకు కోట్లు’ కేసులో అడ్డంగా దొరికి.. 
ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌పై పెట్టిన కేసులన్నీ కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కై పెట్టినవి, ప్రజా ఉద్యమాల సందర్భంగా నమోదు చేసినని కాగా.. సీఎం చంద్రబాబు అవినీతి బాగోతంపై ఏకంగా 17 కేసులుంటే.. వాటి దర్యాప్తుపై బాబు స్టే తెచ్చుకోవడం గమనార్హం. ఆ కేసుల్లో విచారణ జరిగితే తన బండారం బట్టబయలవుతుందని, పదవిని కోల్పోయి జైల్లో గడపాల్సి వస్తుందని చంద్రబాబు తెలుసు. అందుకే ఏళ్ల తరబడి వ్యవస్థలను మేనేజ్‌ చేస్తూ వస్తున్నారు. తనపై ఉన్న కేసుల్లో స్టే తెచ్చుకున్నారు. అదే విధంగా 2015లో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా  ‘ఓటుకు కోట్లు ’ కేసులో చంద్రబాబు ఆడియో, వీడియో ఆధారాలతో సహా దొరికారు. ఆ కేసుకు భయపడే ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌లో పదేళ్లు ఉండే హక్కును విడిచిపెట్టి మరీ అమరావతికి పారిపోయివచ్చారు. కేంద్రంలో బీజేపీతో నాలుగేళ్లకు పైగా అధికారాన్ని పంచుకుని ఆ కేసులు విచారణకు రాకుండా వ్యవస్థలను మేనేజ్‌ చేశారు. రాజధాని భూకుంభకోణాలు, పోలవరం తదితర ప్రాజెక్టుల్లో అక్రమాలు, అవినీతిపై కేంద్ర ప్రభుత్వం వద్ద ఉన్న ఫిర్యాదులపై కేసులు నమోదు కాకుండా చూసుకున్నారు. బాబుపై ఉన్న ఇవన్నీ కీలక కేసులు. 

రాజధాని అక్రమాలను నిలదీసినందుకు 8 కేసులు  
చంద్రబాబు ప్రభుత్వం రాజధాని నిర్మాణం పేరిట భారీ భూ కుంభకోణానికి పాల్పడింది. గుంటూరు జిల్లాలో కృష్ణానదిని ఆనుకుని ఉన్న ప్రాంతాన్ని రాజధాని ప్రాంతంగా ఎంపిక చేయాలని చంద్రబాబు ముందే నిర్ణయించారు. ఆ విషయం అధికారికంగా ప్రకటించడానికి ముందే తన కుటుంబసభ్యులు, సన్నిహితులు, బినామీలకు చెప్పేసి ఆ ప్రాంతంలో రైతుల నుంచి తక్కువ ధరకు భూములు కొనుగోలు చేయించారు. అనంతరం ఆ భూములను ఆనుకునే రాజధాని ప్రాంతాన్ని ఎంపిక చేశారు. స్థానిక రైతులను భయపెట్టి 33 వేల ఎకరాలు బలవంతంగా ల్యాండ్‌ పూలింగ్‌ పేరిట తీసుకున్నారు. తద్వారా లక్షల కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారు. దీనిపై సాక్షి పత్రిక, టీవీ ఛానల్‌ ఆధారాలతో సహా కథనాలను ప్రచురించాయి. ప్రభుత్వ భూదందాకు వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ, ప్రజాసంఘాలు ఉద్యమాలు చేశాయి. దాంతో ఆ ఉద్యమాలను అణచివేసేందుకు చంద్రబాబు సూచనల మేరకు టీడీపీ నేతలు జగన్‌పై గుంటూరు, మంగళగిరిలో 8  కేసులు పెట్టారు. 

యువకుని అక్రమ నిర్బంధాన్ని నిలదీసినందుకు... 
2014కు ముందు ప్రజా పోరాటాలు చేసినందుకు గాను అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం వైఎస్‌ జగన్‌ను వేధించేందుకు కేసులు పెట్టింది. పులివెందులలో పోలీసులు 2011లో ఓ యువకుడిని అక్రమంగా నిర్బంధించి తీవ్రంగా కొట్టారు. దీన్ని ప్రశ్నిస్తూ జగన్‌ పోలీస్‌ స్టేషన్‌ వద్ద నిరసన తెలిపారు. దాంతో పోలీసు స్టేషన్‌ వద్ద ఉన్న పూలకుండీలను ధ్వంసం చేశారనే తప్పుడు నెపం మోపి కేసు నమోదు చేశారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top