ధనబలంతో మార్చేద్దాం..

TDP Leaders Worry About Their Measures about Elections - Sakshi

టీడీపీ క్యాడర్‌కు ధైర్యం నూరిపోస్తున్న పెద్దలు 

పోలింగ్‌కు ముందు పసుపు–కుంకుమ, అన్నదాత సుఖీభవ సొమ్ము 

డ్వాక్రా మహిళలు,  రైతుల ఖాతాల్లో నగదు పడేలా ఏర్పాట్లు 

క్షేత్రస్థాయి పరిస్థితులు చూసి కంగారుపడొద్దని శ్రేణులకు సూచన 

డబ్బుతో ఓటర్లు ప్రభావితమయ్యే అవకాశం లేదంటున్న తెలుగు తమ్ముళ్లు 

సాక్షి, అమరావతి:  రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను పోలింగ్‌కు ముందు ధనబలంతో అధిగమించాలని, ప్రజల ఖాతాల్లో డబ్బులు వేస్తే పరిస్థితి తమకు అనుకూలంగా మారిపోతుందని అధికార తెలుగుదేశం పార్టీ పెద్దలు నిర్ణయానికొచ్చారు. ప్రచారంలో ప్రభుత్వంపై సానుకూలత కనిపించకపోగా అడుగడుగునా వ్యతిరేకత చవిచూస్తున్న టీడీపీ క్యాడర్‌లో ఉత్సాహం నింపేందుకు నాయకులు తంటాలు పడుతున్నారు. ఎంత ధైర్యం చెబుతున్నా అభ్యర్థిత్వాలు ఖరారయ్యాక, బీఫామ్‌లు తీసుకున్నాక కొందరు నాయకులు పోటీ చేయలేమని చేతులెత్తేస్తుండడంతో పార్టీ శ్రేణులు బెంబేలెత్తుతున్నాయి. రాష్ట్ర, నియోజకవర్గ స్థాయిల్లోని ముఖ్య నాయకులు ప్రతిపక్ష వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరుతుండడాన్ని టీడీపీ కార్యకర్తలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో ద్వితీయ శ్రేణి నాయకులు, క్యాడర్‌లో మనోస్థైర్యం దెబ్బతినకుండా చూసేందుకు ఆఖరి ఘడియాల్లో డబ్బుతో ఓటర్లను ప్రభావితం చేద్దామని చెబుతున్నారు. పసుపు–కుంకుమ, అన్నదాత సుఖీభవ పథకాల డబ్బులను పోలింగ్‌కు ముందు డ్వాక్రా మహిళలు, రైతుల ఖాతాల్లో వేస్తున్నామని, దీంతో రాజకీయ వాతావరణం మారిపోతుందని, కంగారు పడొద్దని టీడీపీ పెద్దలు తమ క్యాడర్‌కు సూచిస్తున్నారు. 

ఇదీ టీడీపీ వ్యూహం 
ఐదేళ్లలో ప్రజలకు ఉపయోగపడే ఒక్క పథకాన్ని కూడా అమలు చేయని చంద్రబాబు సర్కారు ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ ప్రకటించిన పథకాలను కాపీ కొట్టింది.  ఎన్నికల ముంగిట ప్రజలను మభ్యపెట్టేందుకు పింఛన్ల పెంపు, పసుపు– కుంకుమ, అన్నదాత సుఖీభవ పథకాలను తీసుకొచ్చింది. ప్రవేశపెట్టిన వెంటనే ఈ పథకాలను పూర్తిస్థాయిలో అమలు చేయకుండా పోస్ట్‌ డేటెడ్‌ చెక్కులిచ్చింది. పసుపు–కుంకుమ కింద డ్వాక్రా మహిళలకు రూ.10 వేలు ఇస్తామని చెప్పి రూ.2,500, రూ.3,500, రూ.4,000 చొప్పున పోస్ట్‌ డేటెడ్‌ చెక్కులిచ్చింది. మొదటి రెండు విడతల చెక్కులు రెండు నెలలుగా మహిళల ఖాతాల్లో జమ కాగా, ఏప్రిల్‌ ఐదో తేదీతో ఇచ్చిన రూ.4,000 చెక్కులు పెండింగ్‌లో ఉన్నాయి. పోలింగ్‌కు వారం ముందు ఏప్రిల్‌ ఐదో తేదీన మహిళల ఖాతాల్లో ఈ డబ్బులు పడేలా ఏర్పాట్లు చేశామని, దాని ప్రభావం ఎన్నికల్లో ఉంటుందని టీడీపీ నేతలు ఆశిస్తున్నారు. అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులకు రూ.3 వేలు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం గత నెలలో మొదటి విడతగా రూ.వెయ్యి వారి బ్యాంకు ఖాతాల్లో వేసింది. రైతు రుణమాఫీ కింద ఇంకా పెండింగ్‌లో ఉన్న నాలుగు, ఐదు విడతల మొత్తం రూ.8,500 కోట్లను సైతం రైతుల ఖాతాల్లో పోలింగ్‌కు ముందు జమ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని టీడీపీ నాయకులు అంటున్నారు. దీంతో ఎన్నికల్లో తమకు లబ్ధి చేకూరుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

డబ్బులిస్తే జనం మారిపోతారా? 
నేతలు చెబుతున్న ఈ డబ్బు లెక్కలు, అంచనాలపై టీడీపీ శ్రేణులు సంతృప్తి చెందడం లేదు. ఎన్ని డబ్బులిచ్చినా క్షేత్రస్థాయిలో అనూహ్య మార్పులు జరిగే పరిస్థితి లేదనే ఆందోళన కిందిస్థాయి టీడీపీ నాయకుల్లో వ్యక్తమవుతోంది. ప్రచారానికి తిరుగుతున్న సమయంలోనే జనం నాడి తమకు వ్యతిరేకంగా ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోందని టీడీపీ కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. అన్నదాత సుఖీభవ పథకంతో రైతుల్లో మార్పు కనిపించకపోగా, వ్యతిరేకత వస్తోందని, రుణమాఫీ కింద ఇవ్వాల్సిన రెండు విడతల సొమ్ము ఇంకా ఇవ్వకుండా ఇప్పుడు కొత్త నాటకమేంటని నిలదీస్తున్నారని టీడీపీ కార్యకర్తలు వాపోతున్నారు. డబ్బులు ఇస్తే జనం మారిపోతారనేది ఒట్టి భ్రమేనని అంటున్నారు. ఈ పథకాలన్నీ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన తర్వాతే చంద్రబాబు అమలు చేశారనే వాదన టీడీపీలోనే వినిపిస్తోంది. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top