చట్టవ్యతిరేక పనులను సహించం | We Will not Tolarate Illeagal Activities, Says Buggana Rajendranath Reddy | Sakshi
Sakshi News home page

చట్టవ్యతిరేక పనులను సహించం

Jul 29 2019 4:11 PM | Updated on Jul 29 2019 6:37 PM

We Will not Tolarate Illeagal Activities, Says Buggana Rajendranath Reddy - Sakshi

సాక్షి, అమరావతి: చట్టవిరుద్ధమైన కార్యకలాపాలను ఎంతమాత్రం​ సహించవద్దని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన మొట్టమొదటి కలెక్టర్లు, ఎస్పీల సదస్సుల స్పష్టం చేశారని ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు. అధికార పార్టీకి చెందిన వారు కూడా ఏదైనా అవకతవకలు చేసిన దాఖలాలు ఉంటే.. చర్యలు తీసుకోవాల్సిందేనని వైఎస్‌ జగన్‌ తేల్చి చెప్పారని తెలిపారు. ద్రవ్యవినిమయ బిల్లుపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా ప్రతిపక్ష టీడీపీ సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు బుగ్గన సమాధానమిచ్చారు. చర్చ అనంతరం ద్రవ్యవినిమయ బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. 

మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ మాట్లాడుతూ.. జన్మభూమి కమిటీలతో అనేక గ్రామాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని, పెన్షన్లు మొదలు.. ప్రభుత్వ పథకాలు పొందేందుకు జన్మభూమి కమిటీలకు లంచాలు, ముడుపులు ఇవ్వాల్సి రావడంతో ప్రజలు తీవ్ర అసహనానికి లోనయ్యారని, ఈ కోపం వల్ల చిన్నాచితక ఘటనలు జరిగి ఉండవచ్చునని  అన్నారు. గతంలో చంద్రబాబు తాను సీఎం అయ్యాక మొదటి కలెక్టర్లు, ఎస్పీల సదస్సులో తమ పార్టీ కార్యకర్తలే ముఖ్యమని, మీరు ముఖ్యం కాదని అన్నారని, కానీ, సీఎం జగన్‌ మాత్రం శాంతిభద్రతల విషయంలో పోలీసులు, అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారని తెలిపారు. 

వైఎస్సార్‌ రైతు భరోసా పథకాన్ని రెండేళ్ల కిందట వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారని, ఆ తర్వాత ఎన్నికలకు రెండు నెలల ముందు కేంద్ర ప్రభుత్వం రైతులకు రూ. 6వేల చొప్పన ఇస్తామని ప్రకటించిందని, ఈ నిధులను కేంద్రం సహాయం కింద రాష్ట్రం తీసుకుంటుందని, రాష్ట్రంలోని పన్నుల మొత్తాన్నే కేంద్రం పథకాల రూపంలో తిరిగి రాష్ట్రానికి ఇస్తుందని బుగ్గన వివరించారు. పోలవరం ప్రాజెక్టు టీడీపీ ప్రభుత్వం కారణంగానే ఆలస్యమైందని, మొదటి రెండున్నరేళ్లు పోలవరం విషయంలో చంద్రబాబు సర్కారు జాప్యం చేసిందని, పోలవరాన్ని సత్వరమే పూర్తి చేసేందుకు తమ ప్రభుత్వం అన్నిరకాల చర్యలు తీసుకుంటోందని వివరించారు.

ద్రవ్య వినిమయ బిల్లు కంటే కూడా కేసీఆర్‌ గురించి ప్రతిపక్ష సభ్యుడు వాసుపల్లి గణేశ్‌ ఎక్కువ మాట్లాడారని, కేసీఆర్‌ అంటే ఎందుకంత భయమని ప్రశ్నించారు. కేసీఆర్‌, నవీన్‌ పట్నాయక్‌ తదితరులు పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాత్రమేనని, వారితో అవసరమైన మేరకు సంప్రదింపులు కొనసాగుతాయని తెలిపారు. అమ్మఒడి పథకాన్ని విద్యార్థులకు కాకుండా.. వారిని బడికి పంపించే తల్లులకు అందిస్తామని, ఇది పిల్లలను బడికి పంపి.. వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దాలని తపించే తల్లుల కోసమేనని వివరించారు. పిల్లలను చదివించుకోవడానికి ఆరాపడే తల్లులను ప్రోత్సాహించేందుకు ఇలాంటి ఒక పథకం తీసుకురావడం దేశంలోనే ప్రప్రథమం అన్నారు. 

నిరుద్యోగ భృతి కోసం ఖర్చుచేసిందెంత?
తమ ప్రతిష్టాత్మక పథకంగా ఎన్నికల్లో ప్రచారం చేసుకొని.. అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. గడిచిన నాలుగేళ్లు నిరుద్యోగ భృతిని చెల్లించకుండా మోసం చేశారని, ఎన్నికలకు కేవలం రెండు నెలల ముందు నిరుద్యోగ భృతిని అమలుచేశారని, ఇందుకోసం కేవలం రూ. 273 కోట్లు మాత్రమే ఆయన ఖర్చు చేశారని, మళ్లీ ఇప్పుడు నిరుద్యోగ భృతి ఏమైందని ప్రతిపక్షం అడుగుతుందని, చంద్రబాబు మీద కోపంతోనే, ఆయన చేసిన నిర్వాకాన్ని బయటపెట్టేలా టీడీపీ సభ్యులు ఈ ప్రశ్నలు అడుగుతున్నారా? అనే సందేహం కలుగుతోందని బుగ్గన ఎద్దేవా చేశారు. 

వెయ్యి నుంచి రూ. 2250కి పెంచాం
మద్యపాననిషేధాన్ని దశలవారీగా అమలు చేస్తామని, ఇందులో భాగంగానే ప్రభుత్వ దుకాణాల ద్వారా అమ్మడం, మద్యం ధరలను పెంచడం, అక్రమ మద్యం అమ్మకాలను నిరోధించడం వంటి చర్యలను చేపడుతున్నామన్నారు. ఇక, పెన్షన్ల విషయమై స్పందిస్తూ.. తాము అధికారంలోకి వచ్చాక అవ్వా-తాతలకు ఇస్తున్న పెన్షన్‌ను రూ. 2వేలకు పెంచుతామని వైఎస్‌ జగన్‌ ఇచ్చాపురం సభలో ప్రకటించడంతో గత్యంతరంలేక హడావిడిగా చంద్రబాబు ప్రభుత్వం రూ. వెయ్యి నుంచి రెండువేలకు పెంచిందని, అది కూడా ఎన్నికలకు ముందే పెంచుతున్నట్టు ప్రకటించిందని తెలిపారు. వైఎస్‌ జగన్‌ ప్రకటన వల్లే పింఛన్‌ రెండువేలకు పెరిగిందని, తాము అధికారంలోకి వచ్చాక దానిని రూ. 2250కి పెంచామని, దశల వారీగా దానిని రూ. మూడువేలకు పెంచుతామని వివరించారు. పైగా పెన్షన్‌ను పెంచి.. అది జేబుల్లోంచి తీసి ఇచ్చినట్టు.. టీడీపీకే ఓటు వేయాలంటూ అవ్వా-తాతల ఆత్మాభిమానం దెబ్బతినేలా ఆ పార్టీ నేతలు  ప్రమాణం చేయించారని తెలిపారు. రైతులకు రూ. 87వేల కోట్లు రుణాలు మాఫీ చేస్తామని చెప్పి.. మోసం చేసి, లెక్కలు ఏమార్చి రూ. 24వేల కోట్లకు చంద్రబాబు సర్కారు కుదించిందని, అందులోనూ కేవలం రూ. 15,275 కోట్లు మాత్రమే రుణమాఫీకి ఖర్చు చేశారని, అంతేకాకుండా ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌లోనూ రుణమాఫీకి రూపాయి కూడా కేటాయించలేదని,  ఇప్పుడు రుణమాఫీ ఏమైందని ప్రతిపక్ష సభ్యులు అడుగుతున్నారని తప్పుబట్టారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement