‘కన్నా’పై వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా

Vijaya Sai Reddy Fires On Kanna Lakshmi Narayana and TDP - Sakshi

కాణిపాకం, వెంకటేశ్వరస్వామి సాక్షిగా ప్రమాణానికి రెడీ

రూ.20 కోట్లకు ఆయన చంద్రబాబుకి అమ్ముడుపోయారు

ఎన్నికల్లో బీజేపీ ఇచ్చిన డబ్బుని ఆయనేం చేశారో లెక్క ఉంది

సుజనాలాంటి వారివల్లే బ్యాంకుల దివాలా, విలీనాలు

వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి 

సాక్షి, విశాఖపట్నం: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలు సుహృద్భావ వాతావరణంలో కొనసాగుతున్నాయని.. అయితే, సమస్యల్లా చంద్రబాబుకి అమ్ముడుపోయిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, బీజేపీకి వలస వెళ్లిన టీడీపీ గుంటనక్కలవల్లే వస్తున్నాయని రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. విశాఖలో మంగళవారం ఆయన మీడియా ప్రతినిధులతో జరిగిన ఇష్టాగోష్టిలో  మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.. 

► నా జీవితంలో నేను ఎక్కడా ఇంతవరకూ అవినీతికి పాల్పడలేదు. కాణిపాకమే కాదు.. నా ఇష్టదైవమైన వెంకటేశ్వరస్వామి సాక్షిగానే కాదు.. ఏ దేవుడు ముందు ప్రమాణం చెయ్యమన్నా సిద్ధంగానే ఉన్నా.  
► ‘కన్నా’పై నేను చేసిన వ్యాఖ్యలకి ఇప్పటికీ కట్టుబడి ఉన్నాను. ఆయన రూ.20 కోట్లకు చంద్రబాబుకి అమ్ముడుపోయారు. ఇది రుజువు చెయ్యగలను.  
► గత ఎన్నికల్లో రాష్ట్రానికి బీజేపీ పంపిన నిధుల్లో పురంధేశ్వరి ఎంత తీసుకున్నారో.. ‘కన్నా’ ఏ నియోజకవర్గానికి ఎంతిచ్చారు? ఎంత ఖర్చు చేశారు అన్న వివరాలు నేను చెప్పగలను. కానీ.. ఆ పార్టీ అంతర్గత వ్యవహారం కాబట్టి బయటపెట్టడంలేదు.  
► ఇక సుజనా చౌదరి విషయానికి వస్తే.. నేను చెన్నైలో ప్రాక్టీస్‌ చేస్తున్నప్పుడు ఆయనకు ఆడిటర్‌గా వ్యవహరించాను. వందల సంఖ్యలో బోగస్‌ కంపెనీల్ని సృష్టించి.. రూ.వేల కోట్లు బ్యాంకుల్ని మోసం చేసిన ప్రతీదానికీ నా వద్ద ఆధారం ఉంది. 
► బ్యాంకులు దివాలా తీయడానికి, విలీనం చేసే స్థితికి రావడానికి సుజనా వంటి వ్యక్తులే కారణం. 
► చంద్రబాబు ప్రోద్బలంతో టీడీపీ గుంటనక్కలు బీజేపీలో చేరి ఆ పార్టీ ఇమేజ్‌ని దెబ్బతీస్తున్నారు.  
► సీఎం జగన్‌.. లాక్‌డౌన్‌పై కచ్చితమైన విధానంతో వెళ్తున్నారు. ఎప్పుడు ఏ ప్రాంతంలో వెసులుబాటు కల్పించాలనే దానిపై ప్రణాళికలు రూపొందించారు. 
► చంద్రబాబులా చెయ్యని పనులు చేసుకున్నట్లు ప్రచారం చేసుకోవడం, కష్టకాలంలో ప్రజల గురించి ఆలోచించకుండా ప్రచారంపైనే దృష్టిసారించే పనులు ఈ ప్రభుత్వానికి అనవసరం. ఆయనకు అల్జీమర్స్‌ వచ్చినట్లు కనిపిస్తోంది.  
కోవిడ్‌–19పై కొన్ని రాష్ట్రాలు జిల్లాని క్లస్టర్‌గా తీసుకుంటుంటే.. మనం మాత్రం మండలాలను క్లస్టర్లుగా తీసుకున్నాం. పరీక్షలు నిర్వహించేందుకు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు సీఎం వైఎస్‌ జగన్‌ ఈ విధంగా ఏర్పాటు చేశారు.  
► రాజధాని తరలింపు కోసమంటూ టీడీపీ నేతలు అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా విశాఖకు రాజధాని తరలిస్తారు. 
ఈ ఇష్టాగోష్టిలో మంత్రి ముత్తంశెట్టి, వీఎంఆర్‌డీఏ చైర్మన్‌ ద్రోణంరాజు శ్రీనివాసరావు, వైఎస్సార్‌సీపీ విశాఖ నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

విరాళమిచ్చే ప్రతి పైసాకీ జవాబు దారీతనం
అలాగే, ఫ్యాక్టరీలు, పరిశ్రమలు, ప్రభుత్వ రంగ సంస్థల ప్రతినిధులు, ముస్లిం మతపెద్దలతో జరిగిన వేర్వేరు సమావేశాల్లో కూడా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. విరాళాల రూపంలో ప్రభుత్వానికి వచ్చే ప్రతి పైసాకీ జవాబుదారీతనంగా ఉంటామని స్పష్టంచేశారు. కరోనా కారణంగా ముస్లింలు రంజాన్‌ పండుగను ఇళ్ల వద్దనే జరుపుకోవాలని మతపెద్దలకు సూచించారు. త్వరలో సీఎం వైఎస్‌ జగన్‌ ముస్లిం పెద్దలు, కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడతారన్నారు. విశాఖలోని ముస్లింలందరికీ ప్రగతి భారత్‌ ఫౌండేషన్‌ ద్వారా నిత్యావసర సరకులను అందజేస్తామన్నారు. అనంతరం నగరంలోని పలు వార్డుల్లో వికలాంగులు, ప్రజలకు నిత్యావసర సరుకులు, కూరగాయల పంపిణీలో విజయసాయిరెడ్డి పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top