పెట్రో ధరలు పెరిగినపుడు వైఎస్‌ పన్నులు తగ్గించారు

Vijay Sai Reddy commented over Chandrababu Naidu - Sakshi

మీరు మాత్రం దండుకుంటున్నారు

చంద్రబాబుపై ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శ

అసెంబ్లీ రద్దుకు బాబు జంకుతున్నారు

అగ్రిగోల్డ్‌ బాధితుల గోడు పట్టించుకోవడంలేదు

సాక్షి, హైదరాబాద్‌: పెట్రోలు, డీజిల్‌ ధరల పెంపుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను దోచుకోవడం దారుణమని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ వి.విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా పెట్రోలు ధరలు పెరిగినపుడు ఆయన ఏం చేశారు? ఇపుడు మీరేం చేస్తున్నారు? అని చంద్రబాబును ఆయన ట్విట్టర్‌లో ప్రశ్నించారు.

‘రోజు రోజుకూ పెట్రోల్‌ డీజిల్‌ ధరల పెంపుతో అటు కేంద్రం... ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను ఎడాపెడా దోచుకోవడం దారుణం. లీటర్‌ పెట్రోలు ఉత్పత్తికి అయ్యే ఖర్చు సుమారు రూ 30. కానీ వాటిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పన్నుల రూపంలో వసూలు చేస్తోంది రూ. 45 పైనే. అంతకంటే దారుణం ఉంటుందా? నిత్యావసర సరుకులైన పెట్రోలు, డీజిల్‌తో ప్రభుత్వాలు వ్యాపారం చేయడం సిగ్గు చేటు. ఇదేనా ప్రజా సంక్షేమం? పదేళ్ల క్రితం ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్‌ ఏం చేశారు? కేంద్రం పెట్రోలు, డీజిల్, వంట గ్యాస్‌ ధరలను అమాంతంగా పెంచేస్తే ఆ భారం సామాన్య ప్రజలపై పడకుండా పన్నులను తగ్గించేశారు.

అందుకే ఆయన ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఆ విషయం మరచి పోయారా చంద్రబాబూ? ఇపుడు మీరేం చేస్తున్నారు?కేంద్రంతో పోటీపడి మరీ పెట్రోలు, డీజిల్‌పై పన్నులు పెంచుతూ ప్రజలను దండుకుంటూ పోతున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కడా లేనంతగా ఏపీలో పెట్రోలు, డీజిల్‌పై పన్నులు వసూలు చేస్తూ ఖజానాను నింపుకుంటున్నారు. నక్కకూ, నాకలోకానికీ పోలికా?’ అని విజయసాయిరెడ్డి ట్విట్టర్‌లో విమర్శించారు.

మీ పరిపాలన మీద మీకు నమ్మకం లేదా?
కేసీఆర్‌ తన పాలన మీద నమ్మకంతో ముందస్తుకు వెళ్లానని చెబుతున్నారని, చంద్రబాబు మాత్రం అసెంబ్లీ రద్దుకు ఎందుకు జంకుతున్నారని విజయసాయిరెడ్డి  ప్రశ్నించారు. చంద్రబాబు పరిపాలనపై ఆయనకే నమ్మకం లేకపోవడం వల్లే అసెంబ్లీ రద్దుకు జంకుతున్నారని ట్విటర్‌లో వ్యాఖ్యానించారు.

టూరిజం పడకేయడానికి చంద్రబాబే కారణం
ఏపీలో పెచ్చరిల్లుతున్న అవినీతి, నేరాల పెరుగుదల, మౌలిక సదుపాయాల కల్పనలో వైఫల్యం కారణంగా టూరిజం రంగం పూర్తిగా పడకేసిందని, ఈ పరిస్థితికి సీఎం చంద్రబాబే కారణమని ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్‌లో పేర్కొన్నారు. గత నాలుగేళ్లలో టూరిజం అభివృద్ధికి ఆయన ఏ మాత్రం కృషి చేయలేదు. ఏళ్ల తరబడి న్యాయం కోసం ఎదురు చూస్తున్న అగ్రిగోల్డ్‌ బాధితుల ఆవేదనను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. అగ్రిగోల్డ్‌ ఆస్తుల విలువ చంద్రబాబు మనుషులు తక్కువ చేసి చూపుతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయన్నారు. ఆస్తుల వేలం ప్రక్రియ జరగాలని కోర్టు స్పష్టమైన ఆదేశాలిచ్చినా.. అది ఇంతవరకు జరగలేదని చెప్పారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top