విజేత.. వర్మ

Varma Win in Teachers MLCs Election Visakhapatnam - Sakshi

ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందిన పాకలపాటి

రెండో ప్రాధాన్యత ఓట్లతో విజయం

తొలిసారి పోటీ చేసిన వర్మ చేతిలో గాదెకు భంగపాటు

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వర్మకు విజయం వరించింది. రెండు పర్యాయాలు ఎమ్మెల్సీగా చక్రం తిప్పిన గాదె ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించడంలో విఫలం కావడంతో.. కొత్తగా పోటీ చేసిన రఘువర్మకు ఉపాధ్యాయులు పట్టం కట్టారు. రెండో ప్రాధాన్యత ఓట్లతో గెలుపొందిన వర్మ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించేందుకు శాసనమండలిలో గళం విప్పుతానన్నారు.

విశాఖసిటీ: ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల సంరంభంలో పాకలపాటి రఘువర్మ ఘన విజయం సాధించారు. వరుసగా రెండుసార్లు ఎమ్మెల్సీగా పనిచేసిన గాదె శ్రీనివాసుల నాయుడిపై తొలిసారిగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసిన రఘువర్మ గెలుపొందారు. ఈ నెల 22న నిర్వహించిన ఎమ్మెల్సీ పోలింగ్‌కు సంబంధించిన ఓట్ల లెక్కింపు మంగళవారం ఉదయం 8 గంటల నుంచి స్వర్ణభారతి ఇండోర్‌ స్టేడియంలో ప్రారంభమైంది. మూడు జిల్లాలకు సంబంధించి మొత్తం 19,593 ఓట్లుండగా.. 17,293 ఓట్లు పోలయ్యాయి. ఇందులో 550 చెల్లని ఓట్లుగా లెక్కింపు అధికారులు పరిగణించారు. మిగిలిన 16,743 ఓట్లకు గాను.. 8,372 ఓట్లను గెలుపు కోటా ఓట్లుగా నిర్ధారించారు. ఎనిమిది మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొదటి ప్రాధాన్యత ఓట్లకు సంబంధించిన మొదటి రౌండ్‌లో పాకలపాటి రఘువర్మకు 6165 ఓట్లు, గాదె శ్రీనివాసుల నాయుడికి 4659, అడారి కిశోర్‌కుమార్‌కు 2,173, జన్నెల బాలకృష్ణకు 299, నూకల సూర్యప్రకాష్‌కు 122, డా.పాలవలస శ్రీనివాసరావుకు 60, గాది బాలగంగాధర్‌తిలక్‌కు 44, ఉప్పాడ నీలం 24 ఓట్లతో నిలిచారు. రెండు రౌండ్లు ముగిసేసరికి పాకలపాటి రఘువర్మ 7,834 ఓట్లు, గాదె శ్రీనివాసుల నాయుడు 5,632, అడారి కిశోర్‌కుమార్‌ 2,548, జన్నెల బాలకృష్ణకు 444, నూకల సూర్యప్రకాష్‌కు 135, డా.పాలవలస శ్రీనివాసరా>వుకు 66, గాది బాలగంగాధర్‌తిలక్‌కు 50, ఉప్పాడ నీలం 34 ఓట్లు సాధించారు. అయితే..  మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఏ అభ్యర్థీ కోటా ఓట్లయిన 8,372 ఓట్లకు చేరుకోకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లని లెక్కించారు.

ఊరించిన విజయం: కోటా ఓట్లకు ఇంకా 538 ఓట్ల దూరంలో రఘువర్మ నిలిచిపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్ల గణన ప్రారంభమైంది. అతి తక్కువ ఓట్లు వచ్చిన వారి నుంచి లెక్కింపు మొదలుపెట్టారు. రౌండ్లు పూర్తవుతున్నా.. మ్యాజిక్‌ ఫిగర్‌కు చేరువ కాకపోవడంతో వర్మ విజయం కాసేపు ఊరించింది. ఉప్పాడ నీలం అనే అభ్యర్థికి సంబంధించిన ఓట్లలో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించగా వర్మకు 12 ఓట్లు వచ్చాయి, ఆ తర్వాత గాది బాలగంగాధర్‌ ఓట్లలో 15, పాలవలస శ్రీనివాసరావు ఓట్లలో 9, నూకల సూర్యప్రకాష్‌ ఓట్లలో 45, బాలకృష్ణ ఓట్లలో 147 ఓట్లు వచ్చాయి. ఆరు రౌండ్లు ముగిసేసరికి 8062 ఓట్లతో రఘువర్మ నిలిచారు. దీంతో.. విజయానికి ఇంకా 310 ఓట్ల దూరంలో నిలిచారు. ఏడో రౌండ్‌లో అడారి కిశోర్‌కుమార్‌కు సంబంధించి 2,709 ఓట్లు లెక్కించాల్సి ఉంది. ఇవన్నీ లెక్కించినా.. గాదె విజయం సాధించే అవకాశం లేకపోవడంతో ఎన్నికల అధికారుల సూచన మేరకు రఘువర్మ కోటా ఓట్లను చేరుకునేంత వరకూ లెక్కించి విజేతను ప్రకటించాలని నిర్ణయించారు. అడారి ఓట్లలో 922 ఓట్లు లెక్కించే సరికి రఘువర్మ విజయం ఖరారైనట్లు అధికారులు ప్రకటించారు. రఘువర్మకు 8,372 ఓట్లు రాగా, గాదె శ్రీనివాసుల నాయుడు 6,044 ఓట్లతోనే సరిపెట్టుకున్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియను కలెక్టర్‌ కాటంనేని భాస్కర్, జాయింట్‌ కలెక్టర్‌ సృజన పర్యవేక్షించారు. విజయం ఖరారు చేసిన అనంతరం రఘువర్మకు ధ్రువపత్రాన్ని కలెక్టర్‌ భాస్కర్‌ అందించారు.

సమస్యలపరిష్కారానికి కృషి
ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించేందుకు తన గళాన్ని మండలిలో వినిపిస్తానని విజయం సాధించిన అనంతరం పాకలపాటి రఘువర్మ ప్రకటించారు. తన విజయం ఉపాధ్యాయులందరిదీ అని వ్యాఖ్యానించారు. గెలుపునకు కృషి చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. పాకలపాటి రఘువర్మకు ఉద్యమ సంఘాలైన యూటీఎఫ్, ఎస్‌టీయూ, గిరిజన ఉపాధ్యాయ సంఘాలు, కాంట్రాక్ట్‌ లెక్చరర్లు, కేజీబీవీ, మోడల్‌ స్కూల్‌ ఉపాధ్యాయులతో పాటు 20 వరకూ సంఘాలు మద్దతు ఇచ్చాయి. మరోవైపు... ఎమ్మెల్సీగా రెండు దఫాలుగా చేసిన గాదెపై ఉన్న వ్యతిరేకత ఓటింగ్‌లో తీవ్ర ప్రభావం చూపింది. ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించడంలో గాదె పూర్తిగా విఫలమయ్యారన్న విమర్శలూ గెలుపుపై ప్రభావం చూపాయి.

రఘువర్మకు అభినందనలు
మురళీనగర్‌(విశాఖ ఉత్తర): ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఎన్నికైన పాకలపాటి రఘువర్మను రామాటాకీస్‌ సమీపంలోని ఓ హోటల్‌లో నిర్వహించిన సమావేÔశంలో ఏపీటీఎఫ్, యూటీఎఫ్, ఎస్‌టీయూ సంఘాల ప్రధాన నాయకులు, కార్యకర్తలు అభినందించారు. ఉపాధ్యాయ సంఘాల ఉమ్మడి కృషి వల్లే తాను గెలుపొందానని రఘువర్మ తెలిపారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి నిరంతరం పనిచేస్తానని చెప్పారు. అందరిని స్వయంగా కలుసుకుని కృతజ్ఞతలు తెలుపుతానని అన్నారు. కార్యక్రమంలో ఏపీటీఎఫ్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు తమరాన త్రినా«థ్, బి.వెంకటపతిరాజు, యూటీఎఫ్‌ నాయకులు జాజులు, ఎస్టీయూ అధ్యక్షుడు పైడిరాజు పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top