సీఎల్పీ విలీనంపై హైకోర్టుకు వెళ్తాం : ఉత్తమ్‌

Uttam Kumar Reddy Fires On CM KCR Over CLP Merging - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : టీఆర్‌ఎస్‌లో సీఎల్పీ వీలీనం వ్యవహారంపై హైకోర్టును ఆశ్రయిస్తామని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. టీఆర్‌ఎస్‌లో సీఎల్పీ విలీన ప్రక్రియ పూర్తయినట్లు అసెంబ్లీ కార్యాలయం బులెటిన్‌ విడుదల చేసిన నేపథ్యంలో గాంధీభవన్‌లో భట్టి విక్రమార్క, వీహెచ్‌, షబ్బీర్‌ అలీ, పొన్నాలతో కలిసి ఉత్తమ్‌ మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. సీఎల్పీ విలీనాన్ని కాంగ్రెస్‌కు జరిగిన నష్టంగా కాకుండా తెలంగాణ సమాజానికి జరిగిన నష్టంగా మీడియా చూపించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ సమాజం నాశనం అయిన సరే మేము మాత్రమే బాగుండాలి అనేలా కేసీఆర్‌ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు టీడీపీ, సీపీఎం పార్టీల నేతలను టీఆర్‌ఎస్‌లో కలుపుకున్నారని గుర్తు చేశారు.

(చదవండి : టీఆర్‌ఎస్‌లో సీఎల్పీ విలీనం పూర్తి)

2018లో మంచి మెజారిటీతో గెలిచినందున ఫిరాయింపులకు టీఆర్‌ఎస్‌ దూరంగా ఉంటుందని భావించాం కానీ.. అహంకార పూరితంగా, అనైతికంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. తెరాస వైఖరిపై ఈనెల 9 నుంచి నిరసన కార్యక్రమాలు ఉద్ధృతం చేస్తామని ఉత్తమ్‌ వెల్లడించారు. తెలంగాణ స్పీకర్‌ ఈ రోజు వ్యవహరించిన తీరు గర్హనీయమన్నారు. పార్టీ మారబోతున్న ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోమని స్పీకర్‌కు ఇంతకు ముందే చెప్పామని గుర్తు చేశారు. ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాల్సిన అధికారం స్పీకర్‌ దగ్గర ఉన్నా సరే, సీఎల్పీ విలీనం ఎలా చేస్తారని ప్రశ్నించారు. దళిత నాయకుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉంటే ఎందుకు కేసీఆర్‌కు గిట్టడం లేదని నిలదీశారు. విలీనం వల్ల  అసెంబ్లీలో కేవలం సమయం తక్కువ ఉంటుంది కానీ పోరాటం మాత్రం ఎక్కువ చేస్తామన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలను నియోజకవర్గ ప్రజలే అసహ్యించుకుంటున్నారని చెప్పారు.

అవినీతి చేస్తున్నారు కాబట్టే ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. కేటీఆర్‌కు హరీశ్‌రావు అడ్డురాకూడదని ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారంటూ కేసీఆర్‌పై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రజా సమస్యలన్నింటినీ వదిలేసి ఎమ్మెల్యేలను కొనడంపైనే దృష్టి పెట్టారని ఉత్తమ్‌ ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ వైఖరికి నిరసనగా ఈ నెల 8న 36 గంటల పాటు ప్రజాస్వామ్య పరిరక్షణ పేరిట దీక్ష చేయబోతున్నామని తెలిపారు. ప్రజాస్వామం కోరుకునే అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు ఈ ధర్నాకు మద్దతు ఇవ్వాలని కోరారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top