దగుల్బాజీ మాటలు.. ముదనష్టపు పాలన! | Sakshi
Sakshi News home page

దగుల్బాజీ మాటలు.. ముదనష్టపు పాలన!

Published Sat, Oct 13 2018 2:48 AM

Uttam kumar reddy fires on kcr - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నాలుగున్నరేళ్ల పాటు సీఎం కేసీఆర్‌ దగుల్బాజీ మాటలతో తెలంగాణలో రాజ్యమేలాడని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ధ్వజ మెత్తారు. ఉద్యమ ఆకాంక్షలు, అమరులు, యువత త్యాగాలను మరిచి విలాసాల్లో విహరించాడని దుయ్యబట్టారు. మళ్లీ అధికారం చేపట్టాలన్న దురాలోచనతో.. ప్రజలను మద్యం మత్తులో ముంచేం దుకు ప్రయత్నిస్తున్నాడన్నారు. టీఆర్‌ఎస్‌ చేస్తున్న డబ్బు, మద్యం పంపకాలను అడ్డుకుని.. కేసీఆర్‌ ముదనష్టపు పాలనకు చరమగీతం పాడాలని కార్య కర్తలకు పిలుపునిచ్చారు.

శుక్రవారం గాంధీభవన్‌లో నిజామాబాద్‌ టీఆర్‌ఎస్‌ నాయకుడు, ఎమ్మెల్సీ భూపతిరెడ్డి 30 మంది ఎంపీటీసీలు, 50 మంది మాజీ సర్పంచ్‌లు, 4వేల మంది అనుచరులతో టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్, మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డిల సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఉత్తమ్‌ మాట్లాడుతూ.. ‘కేసీఆర్‌ పాలనలో బంగారు తెలంగాణ సంగతి దేవుడెరుగు.. కేసీఆర్‌ కుటుంబం మాత్రం బంగారు కుటుంబంగా మారింది’అని దుయ్యబట్టారు.

సీఎం ప్రజాస్వామ్య వ్యవస్థలను అణచివేస్తూ నియంతలా వ్యవహరించాడన్నారు. రాష్ట్రంలో 4,500 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఒక్క కుటుంబాన్ని కూడా కేసీఆర్‌ పరామర్శించలేదని మండిపడ్డారు. ప్రజలను మోసం చేసిన టీఆర్‌ఎస్‌ పార్టీకి గోరీ కట్టాల్సిందేనన్నారు. తెలంగాణ వచ్చాక టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రచారం తప్ప ప్రజల కోసం చేసిందేమీ లేదన్నారు. రైతు బంధు ఎన్నికల డ్రామా అని.. ఈ పేరుతో పంపిణీ చేస్తున్న పెట్టుబడి రైతులకు మొదటి మూడు సంవత్సరాలు ఎందుకు ఇవ్వలేదని ఉత్తమ్‌ ప్రశ్నించారు.

100 రోజుల్లో షుగర్‌ ఫ్యాక్టరీ
కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో నిజాం షుగర్‌ ఫ్యాక్టరీని తెరిపిస్తామని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఈ ఫ్యాక్టరీని తెరిపిస్తామని చెప్పి మాట నిలబెట్టుకోని కేసీఆర్, కవితలకు నిజామాబాద్‌ ప్రజల ఓట్లను అడిగే నైతిక హక్కు లేదన్నారు. వీరిద్దరూ నిజామాబాద్‌ ఓటర్లకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు.

డిసెంబర్‌ 12న తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడటం ఖాయమని ఉత్తమ్‌ జోస్యం చెప్పారు. ప్రగతి భవన్‌ను ప్రభుత్వ ఆసుపత్రిగా మార్పు, రైతులకు రూ. 2లక్షల రుణమాఫీ చేసి తీరతామని భరోసా ఇచ్చారు. కేంద్రం ఇచ్చే సబ్సిడీతో కలిపి వరి, మొక్కజొన్న మిగిలిన పంటలకు ఎక్కువ మొత్తాన్ని రైతులకు చెల్లించి కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. మిగిలిన పంటలకు కూడా మద్దతు ధరకన్నా ఎక్కువ మొత్తాన్ని ఇచ్చి కొంటామన్నారు.

ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయే రైతులకు పంట భీమా ప్రీమియం, ఆరోగ్యశ్రీ పథకం కింద రూ.5 లక్షల వరకు ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. ప్రభుత్వరంగ సంస్థల్లో లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని, 100 రోజుల్లో 25వేల ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తామని ప్రకటించారు. ఎమ్మెల్సీ భూపతిరెడ్డి వెంట వచ్చిన వారి ఉత్సాహం చూస్తుంటే డిసెంబర్‌ 7న కాంగ్రెస్‌ పార్టీ నిజామాబాద్‌ జిల్లాలో ఉన్న 9 సీట్లు గెలుస్తుందన్న నమ్మకం కలిగిందన్నారు.

ఇది నిరుద్యోగ తెలంగాణ
రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేస్తానని చెప్పిన కేసీఆర్, అప్పుల తెలంగాణగా మార్చా రని ఎమ్మెల్సీ భూపతిరెడ్డి దుయ్యబట్టారు. ఉద్యోగ తెలంగాణగా రూపుదిద్దుతారని అనుకుంటే నిరుద్యోగ తెలంగాణ చేశారన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల్లో ప్రజలను మోసం చేశారని, ప్రజల ఆకాంక్షలను పూర్తిగా విస్మరించారన్నారు. రాష్ట్రంలో కుటుంబ పాలన సాగుతోందని, దీనికి చరమగీతం పాడాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ప్రజలకు అన్యాయం చేసిన టీఆర్‌ఎస్‌ను ఓడించేందుకే కాంగ్రెస్‌లో చేరినట్లు ఆయన వెల్లడించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement