అది హిందుత్వ విధానం కాదు: ఉద్ధవ్‌ ఠాక్రే

Uddhav Thackeray Says Creating Unrest In Country Is Not Version Of Hindutva - Sakshi

బీజేపీపై మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే విమర్శలు

ముంబై: మతం పేరిట అధికారం చేజిక్కించుకోవడం హిందుత్వ విధానం కాదని మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే అన్నారు. బీజేపీ భావజాలంతో తమకు ఎలాంటి సారూప్యాలు లేవని పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా నిరసనలకు కారణమవుతున్న జాతీయ పౌర రిజిస్టర్‌(ఎన్నార్సీ)ని తమ రాష్ట్రంలో అమలు చేయబోనివ్వమని ఉద్ధవ్‌ ఇప్పటికే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం ఆయన మాట్లాడుతూ.. నరేంద్ర మోదీ సర్కారుపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. ‘‘శాంతియుతంగా లేనటువంటి హిందూ దేశం నాకు అక్కర్లేదు. మతం పేరు చెప్పి అధికారం పొందడం నా హిందుత్వ విధానం కాదు. ఒకరిని ఒకరు చంపుకోవడం, దేశంలో కల్లోలం సృష్టించడం హిందుత్వ విధానం కానే కాదు’’ అని ఉద్ధవ్‌ ఠాక్రే మాజీ మిత్రపక్షం బీజేపీ తీరును ఎండగట్టారు.(ఎన్నార్సీ అమలుపై కేంద్రం కీలక ప్రకటన!)

ఇక ఎన్నార్సీకి తాము వ్యతిరేకమన్న ఉద్ధవ్ ఠాక్రే‌.. పౌరసత్వ సవరణ చట్టాని(సీఏఏ)కి మాత్రం మద్దతు ప్రకటించడం గమనార్హం. సీఏఏ దేశంలోని పౌరుల హక్కులకు భంగం కలిగించదని... ఇక్కడి పౌరులు తమ పౌరసత్వం గురించి ఆందోళన చెందాల్సిన పనిలేదని ఆయన పేర్కొన్నారు. శివసేన అధికారిక పత్రిక సామ్నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘పౌరసత్వాన్ని నిరూపించుకోవడం హిందువులు, ముస్లింలకు కష్టమే. అయితే సీఏఏ ఇతర దేశాల నుంచి శరణార్థులుగా వచ్చే మైనార్టీల కోసం. అది భారత పౌరుల పౌరసత్వాన్ని దూరం చేయదు’’ అని చెప్పుకొచ్చారు. కాగా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కూటమిగా పోటీ చేసిన బీజేపీ- శివసేన మధ్య ముఖ్యమంత్రి పీఠంపై విభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అనేక పరిణామాల అనంతరం ఎన్సీపీ, కాంగ్రెస్‌ పార్టీతో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసి శివసేన అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.(‘మర్యాదగా వెళ్తారా.. గెంటెయ్యమంటారా?’)

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top