విపక్షనేతకు ప్రొటోకాల్‌ పాటించని టీటీడీ

TTD Not Follows Protocol While YS Jagan Visiting Tirumala - Sakshi

శ్రీవారి దర్శనానికి వచ్చిన జగన్‌ను కలవని టీటీడీ ఉన్నతాధికారులు

వేద ఆశీర్వచనం సమయంలో సంప్రదాయాలకు నీళ్లు

వెల్లువెత్తుతున్న విమర్శలు

సాక్షి, అమరావతి: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనార్థం ప్రతిపక్షనేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తిరుమల వెళ్లిన సందర్భంగా తిరుమల–తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రొటోకాల్‌ పాటించలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో ముఖ్యమంత్రి తర్వాత స్థానం ప్రతిపక్షనేతదే. ప్రతిపక్షనేత స్వామి వారి దర్శనానికి వస్తే టీటీడీ ఉన్నతాధికారులు స్వాగతం పలకడం ఆనవాయితీగా వస్తోంది. వైఎస్‌ రాజశేఖరరెడ్డి విపక్షనేత హోదాలో పాదయాత్ర చేసి తిరుమలకు వచ్చిన సందర్భంగా అప్పటి కార్యనిర్వహణాధికారి (ఈవో) అజేయ కల్లం సాదరంగా ఆహ్వానించి సంప్రదాయాన్ని పాటించారు. (కాలిబాటన కొండపైకి..)

ప్రస్తుత విపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం తిరుమలకు వచ్చిన సందర్భంగా దీనికి పూర్తి విరుద్ధంగా జరిగింది. జాయింట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసరు (జేఈవో) స్థానికంగానే ఉండి కూడా కనీసం కలవకుండా ఎవరినో కిందిస్థాయి ఉద్యోగిని పంపి చేతులు దులుపుకున్నారు. జగన్‌ తిరుమల పర్యటన గురించి టీటీడీ అధికారులకు సమాచారం రాలేదా? అని వాకబు చేయగా పూర్తిగా పర్యటన, స్వామివారి దర్శనం గురించి ముందుగానే సమాచారం పంపించారని తెలిసింది. అయినా ప్రతిపక్షనేత జగన్‌ విషయంలో టీటీడీ ఉన్నతాధికారులు సంప్రదాయాలను పాటించకపోవడం గమనార్హం. రాజకీయాలకు అతీతంగా ఉండాల్సిన అతి పెద్ద థార్మిక సంస్థ టీటీడీలో ఇలా జరగడానికి ప్రభుత్వ పెద్దల ఆదేశాలే కారణమని విమర్శలు వినిపిస్తున్నాయి. 

ఇదేమి వైచిత్రి!
స్వామి వారిని దర్శించుకున్న ప్రముఖులను రంగనాయకుల మండపంలో టీటీడీ వేదపండితులు ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందించడం సంప్రదాయం. ఇలా ప్రముఖులను ఆశీర్వదించే సమయంలో టీటీడీనే ఫొటోలు తీయించి మీడియాకు విడుదల చేస్తుంది. విపక్షనేత జగన్‌ను ఆశీర్వదించి ప్రసాదం అందజేసిన ఫొటోలను టీటీడీ కనీసం విడుదల చేయకపోవడం గమనార్హం. ప్రొటోకాల్‌ లేని పారిశ్రామికవేత్తలు, సినీ రంగం వారికి ఇచ్చిన గౌరవం కూడా టీటీడీ ప్రతిపక్ష నేతకు ఇవ్వకపోవడం దారుణమని అన్ని వర్గాలూ విమర్శిస్తున్నాయి.

‘ఎవరి ఒత్తిడి వల్ల ఇలా చేశారోగానీ విపక్ష నేత విషయంలో ఇలా వివక్ష చూపడం తప్పిదమే. అధికార పార్టీ పెద్దలు చెప్పిన పనులు చేయడం, ఆ పార్టీ నేతలు చెప్పే అంశాలకు అధికారులు ప్రాధాన్యం ఇవ్వడం సాధారణమే. అత్యున్నత సర్వీసుకు చెందిన ఐఏఎస్‌ అధికారులు సైతం విచక్షణ మరచి పాలకుల ముందు మోకరిల్లుతూ గౌరవాన్ని కోల్పోయేలా వ్యవహరించడం సరికాదు. ఇలా బాస్‌ల అడుగులకు మడుగులొత్తుతూ సంప్రదాయాలను కాలరాయడం వల్ల ఐఏఎస్‌లపై గౌరవం సన్నగిల్లుతోంది’ అని సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు వ్యాఖ్యానించారు. ఈ పరిణామాలపై బయటి వ్యక్తులు కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top