టీఆర్‌ఎస్‌ దూకుడు | Sakshi
Sakshi News home page

Published Fri, Aug 31 2018 2:11 AM

TRS Trying To Ready For Elections By Announce MLA Candidates - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల సంకేతాల నేపథ్యంలో అధికార టీఆర్‌ఎస్‌ శరవేగంగా ఏర్పాట్లు చేసుకుంటోంది. ఇప్పటికే ఎన్నికల వాతావరణాన్ని సృష్టించిన టీఆర్‌ఎస్‌ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అదే దూకుడును కొనసాగించడానికి సమాయత్తమవుతున్నారు.ఎన్నికల ప్రక్రియలో కీలకమైన అభ్యర్థుల ప్రకటనను వీలైనంత వేగంగా పూర్తిచేయాలని నిర్ణయిం చుకున్నారు. అభ్యర్థులను ముందు గానే ప్రకటిస్తామని బహిరంగం గానే చెప్పిన కేసీఆర్‌... ఆ ప్రక్రియను వచ్చే నెల్లోనే దాదాపుగా పూర్తిచేయాలని భావిస్తున్నారు. దీనికి సెప్టెంబర్‌ రెండో పక్షంలోనే ముహూర్తాన్ని నిర్ణయించు కున్నట్టుగా విశ్వసనీయ సమాచారం.

రాష్ట్రంలోని 119 శాసనసభ, 19 లోక్‌సభ నియోజకవర్గాల్లో సగానికిపైగా అభ్యర్థులను వచ్చే నెల్లోనే ప్రకటించాలని కేసీఆర్‌ భావిస్తున్నారు. ప్రస్తుతం టీఆర్‌ఎస్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించనున్నారు. టీఆర్‌ఎస్‌కు ప్రస్తుతం 90 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వారిలో కాంగ్రెస్, టీడీపీ, వైఎస్సార్‌ కాంగ్రెస్, బీఎస్పీల నుంచి గెలిచి టీఆర్‌ఎస్‌లో చేరిన వారు 25 మంది దాకా ఉన్నారు. ప్రస్తుత శాసనసభ్యులందరికీ టికెట్లు ఇస్తామని కేసీఆర్‌ ఇప్పటికే పలుసార్లు ప్రకటించారు. అయితే వారిలో ఐదారుగురు మినహా మిగిలిన అందరి పేర్లను సెప్టెంబర్‌లోనే కేసీఆర్‌ ప్రకటిస్తారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ప్రతిపక్ష సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలపైనా సీఎం ప్రత్యేక దృష్టి సారించారు. కాంగ్రెస్, బీజేపీ ఎమ్మెల్యేలున్న నియోజకవర్గాలకు అభ్యర్థుల ఎంపికపైనా ఇప్పటికే కసరత్తు చేసినట్టు తెలిసింది.

తొలిదశలో మంత్రులు... ముఖ్యుల పేర్లు
వచ్చే నెల 2న ప్రగతి నివేదన సభలోనే ఎన్నికల శంఖారావాన్ని కేసీఆర్‌ పూరించనున్నారు. ఆ సభతో వచ్చిన ఊపును కొనసాగించే విధంగా ఎన్నికల ప్రక్రియను ప్రారంభించే వ్యూహంతో టీఆర్‌ఎస్‌ అధినేత ఉన్నారు. ఆ సభ జరిగిన ఒకటి లేదా రెండు రోజుల తర్వాత కేబినెట్‌ సమావేశాన్ని నిర్వహించే అవకాశముందని తెలుస్తోంది. అందులోనే కీలక నిర్ణయం తీసుకోనున్నట్టుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆ నిర్ణయం తీసుకున్న ఐదారు రోజుల్లోనే అభ్యర్థుల ప్రకటన ఉండనుంది. దీని ప్రకారం సెప్టెంబర్‌ 15వ తేదీకి కొంచెం అటుఇటుగా అభ్యర్థుల ప్రకటన ప్రారంభం కానుంది. తొలిదశలో మంత్రులు, తీవ్ర సమస్యలు లేని నియోజకవర్గాలకు కేసీఆర్‌ అభ్యర్థులను ప్రకటించనున్నారు.

కరీంనగర్, నిజామాబాద్, వరంగల్‌ ఉమ్మడి జిల్లాల్లో ప్రస్తుత ఎమ్మెల్యేలు, గతంలో పోటీ చేసి ఓడిపోయిన వారందరికీ టీఆర్‌ఎస్‌ అధినేత టికెట్లు ఖరారు చేసినట్టు తెలిసింది. మెదక్‌ జిల్లాలో ఆందోల్‌ మినహా అన్ని స్థానాలకూ అభ్యర్థులు వారే ఉంటారని తెలుస్తోంది. ఆదిలాబాద్‌ జిల్లాలో చెన్నూరుపై కొంత తకరారు ఉన్నట్టుగా చెబుతున్నారు. మహబూబ్‌నగర్‌ ఉమ్మడి జిల్లాలో ఒకటి మినహా మిగిలిన ప్రస్తుత ఎమ్మెల్యేలకు టికెట్లు ఖరారు అయినట్టుగానే తెలుస్తోంది, గద్వాల, అలంపూర్, వనపర్తి, కల్వకుర్తి వంటి వాటిపైనా కేసీఆర్‌ ఇప్పటికే నిర్ణయానికి వచ్చినట్టుగా సమాచారం. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఇద్దరు ఎమ్మెల్యేలు మినహా అందరికీ టికెట్లు దాదాపు ఖరారు చేసినట్టుగా సమాచారం. అయితే ఈ రెండు అసెంబ్లీ నియోజకవర్గాల విషయంలోనూ వ్యతిరేక నిర్ణయం ఏమీ లేకపోయినా, లోక్‌సభ అభ్యర్థుల ఎంపికపై ఆధారపడి మార్పుచేర్పులకు అవకాశముందని విశ్వసనీయ సమాచారం.

పనిచేసుకోవాలంటూ నేరుగా ఫోన్లు...
టికెట్లు రావని, టికెట్లు వచ్చినా గెలిచే పరిస్థితి లేదని కొందరు ఎమ్మెల్యేలపై విరివిగా ప్రచారం జరిగింది. టీఆర్‌ఎస్‌కు ఎమ్మెల్యేలు లేని నియోజకవర్గాల్లోనూ కొందరికి టికెట్లు రావనే ప్రచారం జరిగింది. అయితే గత ఎన్నికల్లో పోటీ చేసిన వారిలో కొందరికి, కొత్తగా పార్టీలో చేరిన మరికొందరికి టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ స్వయంగా ఫోన్లు చేశారని విశ్వసనీయ సమాచారం. టికెట్లు మీకే వస్తాయని, జాగ్రత్తగా పనిచేసుకోవాలని వారికి చెప్పినట్టుగా తెలిసింది. మరికొందరు స్వయంగా కలిసినప్పుడు టికెట్లపై భరోసా ఇచ్చినట్టుగా చెబుతున్నారు. అయితే బహిరంగ ప్రకటన చేసే దాకా ఓపికతో పనిచేసుకోవాలని గులాబీ బాస్‌ ఆదేశించినట్టుగా సమాచారం. పార్టీ అభ్యర్థుల ప్రకటన ప్రక్రియను సెప్టెంబర్‌లోనే సాధ్యమైనంత వరకూ పూర్తిచేసి ప్రచారంతోపాటు గెలుపు వ్యూహాలపై దృష్టి కేంద్రీకరించాలని కేసీఆర్‌ భావిస్తున్నారు. గతంలో టికెట్ల కేటాయింపు సందర్భంగా తలెత్తిన సమస్యలు, ఎదురైన చేదు అనుభవాలను పునరావృతం కాకుండా చేయడానికే ముందు జాగ్రత్తలను తీసుకుంటున్నామని పార్టీ నేతలు చెబుతున్నారు.

Advertisement
Advertisement