టీఆర్‌ఎస్‌కు షాక్‌

Trs leaders joins into congress - Sakshi

నిర్మల్‌టౌన్‌/నిర్మల్‌రూరల్‌: నిర్మల్‌ నియోజకవర్గ రాజకీయం ఒక్కసారిగా రసకందాయంలో పడింది. ఆపద్ధర్మ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డికి ప్రధాన అనుచరుడైన నిర్మల్‌ మున్సిపల్‌ చైర్మన్‌ అప్పాల గణేశ్‌ చక్రవర్తి టీఆర్‌ఎస్‌కు గుడ్‌బై చెప్పి, పార్టీకి.. మంత్రి అల్లోలకు షాక్‌ ఇచ్చారు.

ఆయనతో పాటు 20 మంది కౌన్సిలర్లు, కోఆప్షన్‌ మెంబర్, ఇద్దరు మా జీ కౌన్సిలర్లు, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ టీఆర్‌ఎస్‌ను వీడారు. ఇప్పటికే కౌన్సిలర్లు నిర్మల్‌ డీసీసీ అధ్యక్షుడు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌ కండువాను కప్పుకోగా, మున్సిపల్‌ చైర్మన్‌ అప్పాల గణేశ్‌ చక్రవర్తి ఈ నెల 20న భైంసాకు రానున్న కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ సమక్షంలో పార్టీలో చేరనున్నారు. నిర్మల్‌ నియోజకవర్గంలో  మంత్రి అల్లోలకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టయిందని పలువురు భావిస్తున్నారు.  

ఉదయం నుంచే ఉత్కంఠ..
మంత్రి ప్రధాన అనుచరుడు, నిర్మల్‌ మున్సిపల్‌ చైర్మన్‌ గణేశ్‌ చక్రవర్తి పార్టీ మారతారని శనివారం నుంచే సోషల్‌ మీడియాలో ప్రచారం సాగింది. దీనికి బలాన్ని చేకూరుస్తూ ఆదివారం మధ్యాహ్నం గణేశ్‌ చక్రవర్తి తన సోదరుని నివాసంలో విలేకరులతో మాట్లాడతారని సమాచారం లీకైంది. దీంతో ఆదివారం ఉదయం నుంచే ఉత్కంఠ కొనసాగింది.

అనంతరం గణేశ్‌ చక్రవర్తి అందరూ అనుకున్న విధంగానే టీఆర్‌ఎస్‌ను వీడుతున్నట్లు ప్రకటించారు. అలాగే ఆయనతో పాటు 20 మంది కౌన్సిలర్లు, ముఖ్య నాయకులు కూడా పార్టీకి రాజీనామా చేసి, భవిష్యత్‌ ప్రణాళికను త్వరలోనే ప్రకటిస్తామని పేర్కొన్నారు. అయితే.. సాయంత్రం డీసీసీ అధ్యక్షుడు మహేశ్వర్‌రెడ్డి సమక్షంలో 20 మంది కౌన్సిలర్లు కాంగ్రెస్‌ కండువాను కప్పుకున్నారు. దీంతో మున్సిపల్‌ చైర్మన్‌ గణేశ్‌ చక్రవర్తి కాంగ్రెస్‌లో చేరడం లాంఛనప్రాయంగా మారి ఉత్కంఠకు తెరపడింది.

అగ్రవర్ణాల ఆధిపత్యం వల్లే..
ఆదివారం జిల్లాకేంద్రంలోని తన సోదరుడి నివాసంలో గణేశ్‌ చక్రవర్తి, తన మద్దతు దారులైన 20 మంది కౌన్సిలర్లతో కలసి విలేకరుల సమావేశం నిర్వహించారు.  ఆయన మాట్లాడుతూ  పార్టీలో అగ్రవర్ణాల ఆధిపత్యం పెరిగిపోయిందన్నారు.

బీసీలకు సము చిత ప్రాధాన్యం లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో టీఆర్‌ఎస్‌ పార్టీని వీడాల్సి వచ్చిందని చెప్పారు. దాదాపు 20 ఏళ్ల పాటు మంత్రి ఐకేరెడ్డికి వెన్నంటి ఉన్నానని పేర్కొన్నారు. 2014లో బీఎస్పీనుంచి పోటీచేసిన ఐకేరెడ్డి గెలుపుకోసం తీవ్రంగా కృషిచేసినట్లు తెలిపారు.  ప్రజల్లో పార్టీ, మంత్రి పట్ల తీవ్రమైన నిరాశ, నిస్పృహలు ఉన్నాయన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top