మా దగ్గర మార్చాల్సిందే!

TRS disagree leaders are electoral campaign programs - Sakshi

టీఆర్‌ఎస్‌లో తగ్గని అసమ్మతి తలనొప్పి

ఆగని టికెట్ల డిమాండ్లు

స్థానాల్లో పోటీగా రెబెల్స్‌ ప్రచారాలు

చర్చలకు పిలిచినా స్పందించని అసంతృప్త నేతలు

కేసీఆర్‌ జోక్యం అనివార్యమేనా!

సాక్షి, హైదరాబాద్‌: ముందస్తు ఎన్నికల వ్యూహంలో ముందున్న టీఆర్‌ఎస్‌లో అసంతృప్తుల సమస్యకు ఎంతకీ తెర పడట్లేదు. డజను వరకు నియోజకవర్గాల్లో ఈ సమస్య కొనసాగుతూనే ఉంది. ఎనిమిది సెగ్మెంట్లలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి పోటీగా అసమ్మతి నేతలు ఏకంగా ఎన్నికల ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేస్తామని చెబుతున్నారు. అభ్యర్థులను మార్చాలని, లేకుంటే పార్టీ విజయం సాధించదని మరో 4 సెగ్మెంట్లలో ద్వితీయ శ్రేణి నేతలు కార్యక్రమాలు చేపడుతున్నారు.

105 అసెంబ్లీ స్థానాలకు టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ టికెట్లు ప్రకటించిన రోజే అసమ్మతి రాజకీయాలు మొదలయ్యాయి. ప్రతిరోజూ కేటీఆర్‌ చర్చ లు జరుపుతుండటంతో పార్టీ అభ్యర్థి గెలుపు కోసం పని చేసేందుకు అసమ్మతి, అసంతృప్త నేతలు అంగీకరిస్తున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం పరిస్థితి ఎంతకీ మారట్లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ అభ్యర్థిని మార్చాలని డిమాండ్‌ చేస్తున్నారు. మరికొందరు నేతలు సొంతంగా పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ జోక్యంతోనే అన్ని నియోజకవర్గాల్లో అసంతృప్తులు, అసమ్మతి నేతలు పార్టీ దారిలోకి వస్తారనే అభిప్రాయం ఉంది. ప్రచార సభలు నిర్వహించేలోపే అసంతృప్త, అసమ్మతి నేతల బుజ్జగింపుల కార్యక్రమం ముగించాలని టీఆర్‌ఎస్‌

అధిష్టానం నిర్ణయించింది.
► రామగుండంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సోమారపు సత్యనారాయణకు ప్రధాన పోటీదారుగా తిరుగుబాటు అభ్యర్థి కోరుకంటి చందర్‌ ప్రచారం చేస్తున్నా రు. మంత్రి కేటీఆర్‌ చర్చలకు పిలిచినా చందర్‌ రావట్లేదని, పోటీలో ఉంటానని తేల్చి చెప్పినట్లు తెలిసిం ది. ఒకే పార్టీ నుంచి ఇద్దరు ప్రచారం చేస్తుండటంతో ఇక్కడి శ్రేణుల్లో అయోమయ పరిస్థితి నెలకొంది.

► భూపాలపల్లిలోనూ ఇద్దరు టీఆర్‌ఎస్‌ నేతల ప్రచారం జరుగుతోంది. అసెంబ్లీ స్పీకర్‌ మధుసూదనాచారితో సమానంగా అసమ్మతి నేత గండ్ర సత్యనారాయణరావు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఏ హామీ ఇచ్చినా కచ్చితంగా పోటీలో ఉంటానని చెబుతున్నారు.

► వేములవాడలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి చెన్నమనేని రమేశ్‌బాబును మార్చాలని ద్వితీయ శ్రేణి నేతలు రోజూ డిమాండ్‌ చేస్తున్నారు. కరీంనగర్‌ జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ తుల ఉమ తనకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు.

► మిర్యాలగూడలో తాజా మాజీ ఎమ్మెల్యే భాస్కర్‌రావుకు టీఆర్‌ఎస్‌ మరో నేత పోటీ వచ్చే పరిస్థితి నెలకొంది. గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి అలుగుబెల్లి అమరేందర్‌రెడ్డి ఇక్కడ ప్రచారం కొనసాగిస్తున్నారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని మార్చకుంటే ఈ సెగ్మెంట్‌లో పార్టీ గెలవదని చెబుతున్నారు.

► సత్తుపల్లిలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పిడమర్తి రవికి పోటీగా ఆ పార్టీ మరో నేత మట్టా దయానంద్‌ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దయానంద్‌ గత ఎన్నికల్లో ఇక్కడ రెండో స్థానంలో నిలిచారు.

► ఉప్పల్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి బేతి సుభాష్‌రెడ్డిని మార్చాలని అక్కడి కార్పొరేటర్లు డిమాండ్‌ చేస్తున్నారు. సెగ్మెంట్‌లోని మొత్తం ఎనిమిది మంది కార్పొరేటర్లు బహిరంగంగా ఇదే డిమాండ్‌ చేస్తున్నారు. సుభాష్‌రెడ్డిని మార్చకుంటే ఇక్కడ టీఆర్‌ఎస్‌ గెలవదని.. గెలిచే వారికి అవకాశం ఇవ్వాలని అధిష్టానాన్ని కోరుతున్నారు.

► షాద్‌నగర్‌లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి అంజయ్య యాదవ్‌ను మార్చాలన్న డిమాండ్‌తో అసమ్మతి నేతలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. టీఆర్‌ఎస్‌ నేతలు వి.శంకర్, అందె బాబయ్య ఆధ్వర్యంలో అధికారిక అభ్యర్థికి పోటీగా ప్రచారం చేస్తున్నారు. తమలో ఒకరు పోటీలో ఉంటారని చెబుతున్నారు.

► ఇబ్రహీంపట్నంలో మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, గత ఎన్నికల అభ్యర్థి కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. స్వతంత్రంగా పోటీ చేసేందుకు చంద్రశేఖర్‌రెడ్డి ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

► నాగార్జునసాగర్‌లో నోముల నర్సింహయ్యను మార్చాలని డిమాండ్‌ కొనసాగుతోంది. మరో నేత ఎంసీ కోటిరెడ్డి ఆధ్వర్యంలో అన్ని మండలాల్లోనూ రోజూ కార్యక్రమాలు జరుగుతున్నాయి.

► జగిత్యాల టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సంజయ్‌కుమార్‌ను మార్చాలని అక్కడి నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. సంజయ్‌ను మార్చకుంటే టీఆర్‌ఎస్‌ విజయం సాదించదని మాజీ జడ్పీటీసీ ఎం.జితేందర్‌రావు, ఎం.గంగారెడ్డి, బి.భాస్కర్‌రెడ్డి, న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు బి.శంకర్, జగిత్యాల మున్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ టి.సరళాదేవీ అంటున్నారు.

► పటాన్‌చెరు నియోజకవర్గంలోనూ అభ్యర్థిని మార్చాలనే డిమాండ్‌ ఆగట్లేదు. తాజా మాజీ ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డికే ఇక్కడ టికెట్‌ ఇచ్చారు. టీఆర్‌ఎస్‌ నేతలు సఫాన్‌దేవ్, కొలను బాల్‌రెడ్డి, గాలి అనిల్‌కుమార్‌లు తమకే అవకాశం ఇవ్వాలని అధిష్టానాన్ని కోరుతున్నారు.

► ఆలేరులో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గొంగిడి సునీతకు వ్యతిరేకంగా అక్కడి స్థానిక నేతలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సీఎం కేసీఆర్‌ ఇక్కడి నుంచి పోటీ చేయాలని కోరుతూ ఆలేరు నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ మాజీ ఇన్‌చార్జి సుంకరి శెట్టయ్య, మాజీ జడ్పీటీసీ సభ్యులు గట్టు నరేందర్, కొంతం మోహన్‌రెడ్డి, మాజీ ఎంపీపీలు వంచ వీరారెడ్డి, బోల్ల కొండల్‌రెడ్డి. బి.ఉపేందర్‌రెడ్డి తదితరులు యాదగిరిగుట్ట లక్ష్మీనర్సింహస్వామి ఆలయ మెట్లపై కొబ్బరికాయలు కొట్టారు.

► మహబూబాబాద్‌ అభ్యర్థి శంకర్‌నాయక్‌ ప్రచారం సాగట్లేదు. ఏ ఊరికెళ్లినా ప్రజలు, టీఆర్‌ఎస్‌ శ్రేణులు అడ్డుకునే పరిస్థితి ఉంది. దీంతో రెండు రోజుల కింద హైదరాబాద్‌కు వచ్చి మంత్రి కేటీఆర్‌ను కలిశారు. నియోజకవర్గంలో పరిస్థితిని సమీక్షిస్తానని కేటీఆర్‌ చెప్పారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top