ఎవరికో.. ఆ రెండు పీఠాలు

Telangana ZPTC And MPTC Womens Candidates - Sakshi

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌: ఉమ్మడి కరీంనగర్‌లోని నాలుగు జిల్లా పరిషత్‌లపై కన్నేసిన టీఆర్‌ఎస్‌ నాయకత్వం చైర్‌పర్సన్‌ అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తోంది. పెద్దపల్లి జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ అభ్యర్థిగా మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధును ఇప్పటికే ప్రకటించగా, మిగతా మూడు జిల్లాల్లో సందిగ్ధత కొనసాగుతోంది. జెడ్‌పీటీసీ అభ్యర్థుల ఎంపిక నుంచి గెలిపించుకునే దాకా బాధ్యతను స్థానిక ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జి మంత్రులకు అప్పగించిన పార్టీ అధినేత కేసీఆర్‌ అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటేనే చైర్‌పర్సన్‌ అభ్యర్థులను ప్రకటిస్తున్నారు. పెద్దపల్లి జెడ్‌పీ చైర్‌పర్సన్‌ రిజర్వేషన్‌ కేటగిరీలో బీసీ జనరల్‌కు కేటాయించడంతో పుట్ట మధు ఎంపిక సులభమైంది. ఓడిపోయిన ఎమ్మెల్యేకు అవకాశం ఇవ్వాలని కేసీఆర్‌ భావించడంతో ఆయన పేరును ముందే ప్రకటించారు. కమాన్‌పూర్‌ జెడ్‌పీటీసీగా ఆయన పోటీ చేయనున్నారు.

జగిత్యాలలో తుల ఉమకే అవకాశం
ఉమ్మడి జిల్లా పరిషత్‌ చివరి జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌గా ఐదేళ్లు కొనసాగిన తుల ఉమ ఈసారి జగిత్యాల జిల్లాకే పరిమితం కానున్నారు. బీసీ జనరల్‌కు కేటాయించిన జగిత్యాల జిల్లా పరిషత్‌ అధ్యక్ష పదవికి టీఆర్‌ఎస్‌ నాయకుడు బాలినేని రాజేందర్, మల్యాల సర్పంచి మిట్టపల్లి సుదర్శన్‌ కూడా పోటీ పడుతున్నారు. రాజేందర్‌ సతీమణి రాజ్యలక్ష్మి ప్రస్తుతం జెడ్‌పీటీసీగా కొనసాగుతున్నారు. కాగా ఈసారి బీసీ జనరల్‌ సీటుగా మారిన కొత్త మండలం బుగ్గారం నుంచి రాజేందర్‌ పోటీ చేస్తున్నారు. మల్యాలకు చెందిన మిట్టపల్లి సుదర్శన్‌ కూడా ఈసారి జెడ్‌పీటీసీగా పోటీ చేసి జిల్లా పరిషత్‌ చైర్మన్‌ కావాలని భావిస్తున్నారు. సిట్టింగ్‌ జెడ్‌పీ చైర్‌పర్సన్‌గా ఉన్న తుల ఉమ పట్లనే నిజామాబాద్‌ ఎంపీ కల్వకుంట్ల కవిత సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. వివాదరహితురాలుగా ఐదేళ్లు కరీంనగర్‌ జెడ్‌పీని నడిపించిన తుల ఉమకే మరోసారి అవకాశం దక్కనున్నట్లు సమాచారం. ఆమె కథలాపూర్‌ మండలం నుంచి పోటీ చేయనున్నారు.

సిరిసిల్లపై తేల్చని పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌
సిరిసిల్ల జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ పదవి జనరల్‌ మహిళకు రిజర్వుడ్‌ కావడంతో ఇక్కడ నుంచి రాజకీయంగా ఎదగాలని భావించిన నాయకుల ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె.తారకరామారావు ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లతోపాటు వేములవాడ నియోజకవర్గాలు ఈ జిల్లాలో ఉండగా, ఎక్కడి నుంచి చైర్‌పర్సన్‌ను ఎంపిక చేస్తారనే విషయంలో స్పష్టత లేదు. వేములవాడ నియోజకవర్గం కోనరావుపేట నుంచి మండల టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు రాఘవరెడ్డి భార్య అరుణ పోటీ చేస్తున్నారు. ఆమెకు అవకాశం లభించవచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సిరిసిల్ల నియోజకవర్గం తంగెళ్లపల్లి నుంచి సిట్టింగ్‌ జెడ్‌పీటీసీ పి.మంజుల కూడా మరోసారి పోటీ చేస్తున్నారు. మంజుల సైతం జెడ్‌పీ చైర్‌పర్సన్‌ బరిలో నిలువనున్నారు. కేటీఆర్‌ ఎవరి పేరు చెపితే వారే ఇక్కడ జిల్లా పరిషత్‌ అధ్యక్ష పీఠాన్ని అధిరోహిస్తారు.

కరీంనగర్‌లో కుదరని  రిజర్వుడు లెక్కలు
కరీంనగర్‌ జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ పదవి ఎస్సీ మహిళకు రిజర్వు కాగా, ఈ కేటగిరీలో రెండు జెడ్‌పీటీసీలు మాత్రమే జిల్లాలో ఉన్నాయి. ఇక్కడ రాష్ట్ర మంత్రి ఈటెల రాజేందర్‌ నిర్ణయం మీదనే జిల్లా పరిషత్‌ అధ్యక్ష పదవి ఆధారపడి ఉంది. హుజూ రాబాద్‌ నియోజకవర్గంలోని కొత్త మండలం ఇల్లందకుంట, చొప్పదండి మండలాలు ఎస్సీ మహిళకు రిజర్వు చేయబడ్డాయి. ఇల్లందకుంట నుంచి కనుమల విజయను జెడ్‌పీటీసీగా ఇప్పటికే ఎంపిక చేశారు. ఆమెను జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ అభ్యర్థిగా ప్రకటిస్తారా లేదా అనే విషయంలో స్పష్టత లేదు.

 మరో మండలం చొప్పదండిలో ఎమ్మెల్యే రవిశంకర్‌ భార్య జీవన పోటీ చేస్తారని, ఆమెకే జెడ్‌పీ అధ్యక్షురాలి అభ్యర్థిత్వం ఖరారు చేస్తారని ప్రచారం జరిగింది. కాగా బుధవారం ఎమ్మెల్యే రవిశంకర్‌ తన భార్య పోటీ చేయడం లేదని స్పష్టత ఇచ్చారు. చొప్పదండిలో స్థానికులకే అవకాశం లభిస్తుందని చెప్పారు. మాజీ జెడ్‌పీ చైర్‌పర్సన్‌ ఆరెపల్లి మోహన్‌ సతీమణిని ఎస్‌సీ జనరల్‌ నుంచి గానీ జనరల్‌ స్థానం నుంచి గాని పోటీ చేయిస్తారనే ప్రచారం జరుగుతోంది. దీనిపై పార్టీ నాయకులు స్పష్టత ఇవ్వడం లేదు. చొప్పదండి నుంచి స్థానిక టీఆర్‌ఎస్‌ నాయకులు తమ సతీమణులను పోటీలో నిలిపేందుకు పోటీ పడుతున్నా, జెడ్‌పీ పీఠంపై కూర్చొనే అనుభవం ఉన్నవారు లేకపోవడం గమనార్హం.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top