పొడిచిన పొత్తు!

Telangana ZPTC And MPTC Third Phase Nominations Mahabubnagar - Sakshi

నారాయణపేట: జిల్లాలో రాజకీయాలు అసక్తికరంగా మారాయి. అధికార పార్టీని ఎదుర్కొనేందుకు బీజేపీ, కాంగ్రెస్‌లు ఒక్కటయ్యాయి. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరనే దానికి ఇదే నిదర్శనమని చెప్పవచ్చు. దేశరాజకీయాలు మనకేందుకు గల్లీ రాజకీయాలు మనకే ముఖ్యం అంటూ కమలంతో చేయి కలిపి వామపక్షాలతో జతకట్టి స్థానిక పోరుకు సిద్దమయ్యారు.
 
బెడిసికొట్టిన ఒప్పందాలు..  
నారాయణపేట మండలంలో జెడ్పీటీసీ స్థానానికి కాంగ్రెస్‌ తరఫున డాక్టర్‌ రంజితారెడ్డిని రంగంలోకి దిగి ఎంపీపీ ఒప్పందంతో బీజేపీ నుంచి పోటీకి దిగారు. ధన్వాడ మండలంలో జెడ్పీటీసీకి బీజేపీ నుంచి విమల నామినేషన్‌ వేయగా కాంగ్రెస్‌ పార్టీకి ఎంపీపీకి ఇచ్చేందుకు అంగీకారం కూదుర్చుకుంటూ 11 సీట్లలో ఎంపీటీసీ స్థానాలను సర్దుబాటు చేసుకొని రంగంలోకి దిగారు. అలాగే మందిపల్లికి చెందిన చంద్రమ్మ స్వతంత్య్ర అభ్యర్థిగా జెడ్పీటీసీకి నామినేషన్‌ వేశారు.

మరికల్‌ మండలంలో జెడ్పీటీసీకి కాంగ్రెస్‌ నుంచి గొల్ల జయమ్మ, బీజేపీ నుంచి జ్యోతిలు నామినేషన్‌ వేశారు. సయోద్య కోసం పార్టీ బడానేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఉపసంహరణ సమయానికి ఏదో ఒకటి తేలిపోయే అవకాశం ఉంది. దామరగిద్ద మండలంలో బీజేపీ, కాంగ్రెస్, సీపీఎం మైత్రితో కాంగ్రెస్‌ పార్టీ నుంచి అనిత, కవితలతో నామినేషన్‌ వేయించారు. ఇద్దరిలో ఒకరిని పోటీలో పెట్టే సమాలోచనలు ఉన్నారు. 

అధికార పార్టీ జెడ్పీటీసీ అభ్యర్థులు వీరే.. 
మరికల్‌ జెడ్పీటీసీ అభ్యర్థిగా సురేఖారెడ్డి, ధన్వాడ అభ్యర్థిగా కమలమ్మ, నారాయణపేట నుంచి అంజలి, దామరగిద్దలో లావణ్యలతో పాటు 55 స్థానాల్లో ఎంపీటీసీలుగా అభ్యర్థులు పోటీ చేసేందుకు నామినేషన్లు వేశారు. నారాయణపేట ఎంపీపీ జనరల్‌ కావడంతో చిన్న జట్రం ఎంపీటీసీ స్థానం నుంచి అప్పంపల్లికి చెందిన మాజీ మార్కెట్‌ చైర్మన్‌ అమ్మకోళ్ల శ్రీనివాస్‌రెడ్డితో నామినేషన్‌ వేయించారు.
 
కోటకొండలో కిరికిరి 
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ, టీఆర్‌ఎస్‌ మైత్రిలో టీఆర్‌ఎస్‌ మద్దతుదారులుగా సర్పంచ్‌కు పోటీకి నిలిపారు. ఆ సమయంలో రెండు ఎంపీటీసీ స్థానాలను బీజేపీకి మద్దతిస్తామని అప్పట్లో ఒప్పందం కుదుర్చుకున్నారు. మారిన రాజకీయ పరిణామాలతో కోటకొండలో చిక్కుముడి పడినట్లయింది. మండలంలో బీజేపీ, కాంగ్రెస్‌పార్టీల మధ్య సయోద్య కుదర్చుకొని ఎంపీపీకి బీజేపీ, కాంగ్రెస్‌కు జెడ్పీటీసీ స్థానాల్లో పోటీ చేసేందుకు నామినేషన్లు వేశారు. అయితే కోటకొండలో బీజేపీ, టీఆర్‌ఎస్‌లు ముందు ఒప్పుకున్న విధంగానే అభ్యర్థులను ఖరారు చేసుకొని నామినేషన్లు వేసేందుకు సిద్ధమయ్యారు.

ఎమ్మెల్యే ససేమిరా.. 
నారాయణపేట మండలంలో కాంగ్రెస్, బీజేపీ పొత్తు పెట్టుకుంటే మీరేమో కోటకొండలో బీజేపీతో పొత్తుపెట్టుకుంటారేమో అంటూ ఎమ్మెల్యే ఆ గ్రామ టీఆర్‌ఎస్‌ నేతలపై గరమైనట్లు సమాచారం. నామినేషన్లకు చివరిరోజు కావడంతో  
టీఆర్‌ఎస్‌ నేతలు హుటాహుటిన అభ్యర్థులను తయారుచేసి కోటకొండ ఎంపీటీసీ–1కు  ఈడిగ అనంతమ్మను, ఎంపీటీసీ–2కు నాగేంద్రమ్మలతో నామినేషన్లు వేయించారు.
 
ఎరిదారిలో వారు.. 
బీజేపీతో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్‌ కోటకొండలో బీజేపీ, టీఆర్‌ఎస్‌ శ్రేణుల మధ్య ఉన్న ఒప్పందంతో ముందస్తుగానే కోటకొండ ఎంపీటీసీ–1కి బీజేపీ తరఫున కెంచి అనసూయ, కాంగ్రెస్‌ తరఫున ఎడ్ల పూజ, 2వ ఎంపీటీసీకి పెంటమ్మ కాంగ్రెస్‌ తరఫున నామినేషన్లు వేశారు. ఇందులో ఎవరు ఏ రంగంలో ఉంటారో తెలియరాలేదు.

పోటీలో సీపీఐ(ఎంల్‌)న్యూడెమోక్రసీ.. 
వామపక్షాలకు, బీజేపీకి కోటకొండలో ఎప్పటికీ వారి మధ్యనే పోరు కొనసాగుతుంది. మారిన రాజకీయ సమీకరణలతో కాంగ్రెస్, బీజేపీ పొత్తు కుదుర్చుకున్న సీపీఐ (ఎంఎల్‌) న్యూడెమోక్రసీ నుంచి జెడ్పీటీసీగా సరళతో పాటు ఎంపీటీసీ–1కి అభ్యర్థులుగా సీతవీణ, రాజేశ్వరి, అక్కమ్మ, రెండో ఎంపీటీసీకి రాజేశ్వరితో నామినేషన్లు వేయించారు.

కృష్ణ మండలంలో కలకలం టికెట్టు ఇవ్వలేదని ఆత్మహత్యాయత్నం  
తనకు అధికార పార్టీ బీఫాం ఇవ్వలేదని పోటీలోంచి తప్పించి ఉపసంహరింపజేసిందంటూ టీఆర్‌ఎస్‌ నాయకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన గురువారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని కృష్ణ మండలం జెడ్పీటీసీ స్థానం బీసీ జనరల్‌కు రిజర్వు కావడంతో అధికార పార్టీ నుంచి తనకు టికెట్‌ ఇవ్వాలని వీరేందర్‌పాటిల్‌ నామినేషన్‌ వేశాడు. అయితే పార్టీ టికెట్‌ తాజా ఎంపీపీ అంజమ్మపాటిల్‌కు ఇచ్చింది. దీంతో మానస్తాపానికి గురైన వీరేందర్‌పాటిల్‌ క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top