ఏళ్లకు తీరిన ఓట్ల కష్టం

Telangana Lok Sabha Elections: Villagers Suffering To Cast Vote - Sakshi

అతి తక్కువ ఓటర్లు ఉన్న పోలింగ్‌ కేంద్రం

కెరమెరి(ఆసిఫాబాద్‌): అదో కుగ్రామం. కెరమెరి మండలానికి అతి సమీపం. ఏ కాలంలో.. ఏ సందర్భంలో ఆ గ్రామాన్ని సిర్పూర్‌(యూ) మండలంలో చేర్పించారో ఎవరికి తెలియదు. అనాదిగా వారు కష్టాలు అనుభవిస్తున్నారు. సమస్యల్లోనే కాదు ఓట్లు వేయడంలోనూ వారికి ఇబ్బందులే.. అదే సిర్పూర్‌(యూ) మండలంలోని బాబ్జిపేట్‌ గ్రామ పంచాయతీలోని మెట్టిగూడ గ్రామం. అక్కడ నివసిస్తున్నది గోండు తెగలు, ఆదివాసీలు. మొత్తం జనాభా 129, పురుష ఓటర్లు 31, మహిళా ఓటర్లు 38 మొత్తం కేవలం 69 మంది మాత్రమే ఉన్నారు. 

ఏళ్ల తర్వాత తీరిన సమస్య!
ప్రతిసారి జరిగే ఎన్నికల్లో వారు ఓటు వేయాలంటే 24కిలో మీటర్ల దూరంలోని పంగిడి పోలింగ్‌ కేంద్రానికి వెళ్లి ఓట్లు వేయకతప్పని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇటీవల నిర్వహించిన శాసన సభ ఎన్నికల్లో మాత్రం వారు 6కిలో మీటర్ల సమీపంలోని బాబ్జిపేట్‌ (ఖాతీగూడ) గ్రామంలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రంలో ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు. దేశంలో ప్రారంభమైన ఎన్నికల ప్రక్రియ నుంచి వారు ప్రతిసారి జరిగే ఎన్నికల్లో 24కిలో మీటర్ల దూరం వెళ్లి ఓటు వేయాల్సి వచ్చేది. రెండు గుట్టలు ఎక్కడం.. రాళ్లు రప్పల రహదారి. విషప్రాణులు సంచరించే అభయారణ్యం అయినా రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును వినియోగించుకోవాలనే తపనతో వారు ఎంత దూరమైన కాలిబాటతో వెళ్లి ఓటు వేసేవారు. కానీ ఈసారి ఎన్నికల నిబంధన ప్రకారం రెండు కిలో మీటర్ల దూరంలో పోలింగ్‌స్టేషన్‌ ఉంటే స్వంత గ్రామంలోనే పోలింగ్‌ కేంద్రం ఏర్పాటు చేయవచ్చనే నిబంధన వారి సమస్యకు చెక్‌ పడినట్లయింది. 

రికార్డుకెక్కిన ఆదివాసీ గ్రామం...
తెలంగాణ రాష్ట్రంలోని అతితక్కువ మంది ఓటర్లు ఉన్న పోలింగ్‌ బూత్‌ కేంద్రంగా మెట్టిగూడ రాష్ట్ర రికార్డుల్లో చేరింది. తమ గ్రామంలోనే పోలింగ్‌ కేంద్రం ఏర్పాటు చేయడంతో అక్కడి ఆదివాసీల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ఇన్నాళ్లు రాళ్లు రప్పలు, వాగులు వంకలు దాటి అష్టకష్టాలు పడేవాళ్లమని కానీ అధికారులు మాపై కరుణ చూపారని వారు పేర్కొంటున్నారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top