మరో రెండు జాబితాలు!

Telangana Elections 2018 Congress Preparing 2 Lists - Sakshi

మలి విడతపై  కాంగ్రెస్‌ కసరత్తు 

సాక్షి, న్యూఢిల్లీ: 65 మంది అభ్యర్థులతో తొలి జాబితా విడుదల చేసిన కాంగ్రెస్‌.. మలి జాబితాపై వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. మిత్రపక్షాలకు కేటాయించిన స్థానాలు తీసేయగా.. మరో 29 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. అందులో తెలంగాణ ఇంటి పార్టీకి ఒక సీటు ఇవ్వొచ్చని తెలుస్తోంది. మిత్రపక్షాల స్థానాలపై స్పష్టత వస్తే.. మరో రెండు విడతలుగా తమ జాబితాలు విడుదలయ్యే అవకాశం ఉందని కాంగ్రెస్‌ పార్టీ వర్గాలు వెల్లడించాయి. తెలుగుదేశం పార్టీకి 14 స్థానాలు కేటాయించగా.. ఆ పార్టీ తొలి విడతగా 9 మంది అభ్యర్థులను ప్రకటించింది. మరో 5 స్థానాలపై స్పష్టత లేకపోవడంతో సందిగ్ధత నెలకొంది. అలాగే సీపీఐకి మూడు స్థానాలు కేటాయించగా.. ఆ పార్టీ మరో స్థానం అడుగుతోంది. టీజేఎస్‌కు ఇవ్వాల్సిన 8 సీట్లలో ప్రస్తుతానికి ఆరింటిపైనే కాంగ్రెస్‌ స్పష్టత ఇచ్చింది.

ఈ నేపథ్యంలో మిత్రపక్షాల స్థానాలపై స్పష్టత వచ్చిన తర్వాతే కాంగ్రెస్‌ రెండో జాబితా విడుదల కానుంది. కాంగ్రెస్‌ ఎన్నికల స్క్రీనింగ్‌ కమిటీతోపాటు పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ కూడా 29 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసినప్పటికీ, ఒకటి రెండు స్థానాలు మిత్రపక్షాలకు మారే అవకాశం ఉండటంతో మరోసారి ఈ వ్యవహారంపై చర్చలు జరిగాయి. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌చార్జ్‌ ఆర్సీ కుంతియా, ఏఐసీసీ కార్యదర్శులు బోసు రాజు, సలీం అహ్మద్‌ మంగళవారం ఇక్కడి కర్ణాటక భవన్‌లో సమావేశమై ఆయా స్థానాలపై చర్చించారు. వీటిలో అనేక స్థానాల్లో ఆశావహుల మధ్య గట్టి పోటీ ఉండడం, అభ్యర్థిత్వం దక్కనివారు ఇతర పార్టీలకు వలస వెళ్లే ప్రమాదం ఉండడం, తిరుగుబాటు అభ్యర్థులుగా రంగంలోకి దిగే సూచనలు కనిపిస్తుండడంతో.. జాబితా ప్రకటనను ఒకటి రెండు రోజులు జాప్యం చేసే అవకాశం ఉందని సమాచారం.  

కీలక స్థానాలపై ఉత్కంఠ
జనగామ, భూపాలపల్లి, సనత్‌నగర్, రాజేంద్రనగర్, జూబ్లీహిల్స్, సికింద్రాబాద్, పటాన్‌చెరు, నారాయణఖేడ్, మిర్యాలగూడ, తుంగతుర్తి, దేవరకొండ, కొల్లాపూర్, దేవరకద్ర, బాల్కొండ, ఎల్లారెడ్డి, నిజామాబాద్‌ అర్బన్, షాద్‌నగర్, నారాయణపేట్, ఇల్లెందు తదితర కీలక స్థానాలపై ఉత్కంఠ కొనసాగుతోంది. వీటిలో కొన్ని స్థానాలపై మిత్రపక్షాల నుంచి స్పష్టత రావాల్సి ఉండటంతో కాంగ్రెస్‌ ఆచితూచి అడుగులు వేస్తోంది. తొలి జాబితాలో కేవలం 14 మంది బీసీ అభ్యర్థులకు మాత్రమే అవకాశం ఇవ్వడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. దీంతో బీసీలకు, మహిళలకు టీఆర్‌ఎస్‌ కంటే తామే ప్రాధాన్యం ఇస్తున్నామని.. రెండో విడతలో మరో 5 నుంచి 6 స్థానాలు కేటాయించనున్నామని కుంతియా మంగళవారం పేర్కొన్నారు.

హస్తినలో మకాం 
పొన్నాల లక్ష్మయ్య, మర్రి శశిధర్‌రెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి వంటి పార్టీ సీనియర్‌ నేతల పేర్లు సైతం తొలి జాబితాలో కనిపించకపోవడంతో ఆశావహుల్లో ఉత్కంఠ పెరిగింది. తమ అభ్యర్థిత్వాలు ఎక్కడ గల్లంతవుతాయోనన్న ఆందోళనతో ఈ 29 స్థానాలకు చెందిన ఆశావహులు, వారి గాడ్‌ఫాదర్లు ఢిల్లీ బాట పట్టారు. ఇప్పటికే జానారెడ్డి, రేవంత్‌రెడ్డి, డీకే అరుణ, వీహెచ్, రేణుకాచౌదరి వంటి సీనియర్‌ నేతలు హస్తినలో మకాం వేశారు. డీకే అరుణ, వీహెచ్‌లు కర్ణాటక భవన్‌లో ఉత్తమ్, కుంతియాలను కలిసి పలు సీట్లపై చర్చించినట్టు తెలుస్తోంది. మూడు నాలుగు స్థానాలపై పలువురు సీనియర్‌ నేతలు వేర్వేరు అభ్యర్థులను సూచిస్తుండడంతో ఉత్తమ్, కుంతియాలు మల్లగుల్లాలు పడుతున్నట్టు సమాచారం. పాత మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాలకు సంబంధించి ఈ పరిస్థితి ఇంకా కొనసాగుతోందని తెలుస్తోంది. 

ఆరేడు సభల్లో రాహుల్‌.. రెండు సభల్లో సోనియా..
అభ్యర్థుల మలి విడత జాబి తాలు, మేనిఫెస్టో విడుదల, బహిరంగ సభల నిర్వహణ తదితర అంశాలపై ఉత్తమ్, కుంతియా, ఏఐసీసీ కార్యదర్శులు కూలంకషంగా చర్చించారు. తెలంగాణలో సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ పాల్గొనే బహిరంగ సభలపై కసరత్తు చేసినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. సోనియా ఒకరోజు, రాహుల్‌  3 రోజులపాటు ప్రచారంలో పాల్గొననున్నారు. సోనియా రెండు సభల్లో పాల్గొంటారని తెలుస్తోంది. రాహుల్‌ కనీసం ఆరేడు సభల్లో పాల్గొనేలా ప్రణాళిక రూపొందించినట్టు సమాచారం. 

కొనసాగుతున్న బుజ్జగింపులు
మిత్రపక్షాల ఒత్తిళ్ల కారణంగా సీటు కోల్పోయి ఆందోళనలో ఉన్న నేతలను పార్టీ అధిష్టానం బుజ్జగిస్తోంది. ఏఐసీసీ ఇన్‌చార్జి కార్యదర్శులు వారితో ఫోన్‌లో సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం. పార్టీ అధికారంలోకి వచ్చాక న్యా యం చేస్తామని హామీ ఇస్తున్నట్టు తెలిసింది. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top