దేశానికి దిక్సూచిలా తెలంగాణ : కేసీఆర్‌ | Telangana CM KCR Slams BJP And Congress In Warangal Meeting | Sakshi
Sakshi News home page

దేశానికి దిక్సూచిలా తెలంగాణ : కేసీఆర్‌

Apr 2 2019 7:21 PM | Updated on Apr 2 2019 7:24 PM

Telangana CM KCR Slams BJP And Congress In Warangal Meeting - Sakshi

వరంగల్‌: సంక్షేమంతో పాటు అనేక కార్యక్రమాల్లో మనం దేశానికి దిక్సూచిగా ఉన్నామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. వరంగల్ జిల్లా అజంజాహీ మిల్లు మైదానంలో జరిగిన టీఆర్‌ఎస్ పార్టీ బహిరంగ సభలో సీఎం పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. వరంగల్ చాలా చైతన్యవంతమైన జిల్లా అన్నారు. ఉద్యమాల పురిటిగడ్డ వరంగల్ జిల్లా అని, ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించింది ఇక్కడి ప్రజలేనని కొనియాడారు. ఇక్కడి ప్రజలకు కొత్తగా నేర్పాల్సిన అవసరం లేదన్నారు. చైతన్యవంతమైన జిల్లా నుంచి స్ఫూర్తివంతమైన తీర్పు వస్తుందని భావిస్తున్నానన్నారు. ఉద్యమంలో అగ్రభాగాన ఉన్నట్టే గెలుపులో కూడా అగ్రభాగాన ఉండాలన్నారు.

ఈ ఎన్నికల్లో కూడా దయచేసి అగ్రభాగాన నిలబెట్టాలని కోరుతున్నానని సీఎం అన్నారు. ఐదేండ్ల క్రితం మన తెలంగాణ ఎంట్లుండే? ఈవాళ తెలంగాణ ఎట్ల ఉన్నది? ఐదేళ్ల క్రితం కూడా ప్రభుత్వాలు ఉన్నాయి.. కరెంటు కోసం లాఠీ చార్జీలు జరిగాయి..కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్‌ఫార్మర్లు ఎన్నో చూశాం.. ఐదేళ్లలో టీఆర్‌ఎస్ ప్రభుత్వ పాలనలో పరిస్థితి తారుమారైందని పేర్కొన్నారు. విద్యుత్ తలసరి వినియోగంలో ఇప్పుడు తెలంగాణ అగ్రస్థానంలో ఉందని సీఎం తెలిపారు. వ్యవసాయానికి ఉచితంగా కరెంట్ ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. సంక్షేమ రంగంలో దేశానికే దిక్సూచిగా ఉన్నట్లు చెప్పారు. వచ్చే నెల నుంచి రెట్టింపు చేసిన పెన్షన్లు ఇస్తామని తెలిపారు. 

దేవాదుల నిర్మాణం పూర్తి
‘75 టీఎంసీల కెపాసిటీ గల దేవాదు నిర్మాణానికి కూడా పూర్తి చేశాం. పది నెలలు ఎస్‌ఆర్‌ఎస్‌పీ కాలువల్లో నీళ్లు ఉండేలా సిద్ధం చేశాం. విలీన గ్రామాల్లో సమస్యలు ఉన్నాయనేది వాస్తవం. ప్రతీ జిల్లాలో ప్రజాదర్బార్‌ ఏర్పాటు చేసి స్వయంగా సమస్యలన్నీ పరిష్కరిస్తాం. ప్రభుత్వమంటే ఇలా పనిచేస్తుందా అని అందరూ ఆశ్చర్యపడేలా చేస్తా’మని కేసీఆర్‌ చెప్పారు.

దేశానికి కాంగ్రెస్‌, బీజేపీ చేసిందేమిటి?
‘రాహుల్‌ గాంధీ, నరేంద్ర మోదీలు ఒకరినొకరు విమర్శించుకుంటున్నారు. దేశానికి కాంగ్రెస్‌, బీజేపీలు చేసిందేమిటి. ఫెడరల్‌ ఫ్రంట్‌ మాట ఎత్తినప్పటి నుంచి నా ప్రశ్నలకు వారిద్దరూ సమాధానమివ్వలేదు. గుజరాత్‌లో కూడా 24 గంటల కరెంటు ఇవ్వలేదు. తెలంగాణా ప్రయోజనాల కోసం టీఆర్‌ఎస్‌కు ఓటేయాలి. మట్టి​ పనికైనా ఇంటోడు ఉండాలి. బీజేపీ, కాంగ్రెస్‌కు ఓటేస్తే వాళ్ల ముందు మోకరిల్లినట్లే. దేశంలో నిరుద్యోగ సమస్య పోవాలంటే కచ్చితంగా మార్పు రావా’ లని కేసీఆర్‌ కోరారు.

పదహారు సీట్లు రావాలన్న కోరిక లేదు
‘నాకు పదహారు సీట్లు రావాలన్న కోరిక లేదు. ప్రజల అభీష్టం తెలవాల్సిన అవసరముంది. వర్గీకరణ సమస్య పరిష్కారం కావాలన్నా మార్పు రావాలి. మోదీ, రాహుల్‌ గాంధీలు రాష్ట్రాల్లో చొరబడి చిల్లర రాజకీయాలు చేస్తున్నారు. మోదీ పచ్చి అబద్ధాలు చెబుతున్నారు. నా ముక్కు బాగా లేదంటూ దిగజారి మాట్లాడుతున్నారు.  దేశాన్ని సాకే ఐదారు రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. ప్రధాని తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. కాంగ్రెస్‌, బీజేపీయేతర ప్రభుత్వం రావా’లని ఈ సందర్భంగా కేసీఆర్‌ వరంగల్‌ సభలో కోరికను వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement